కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో అమలు
ఆదాయ మార్గాలపై మున్సిపల్ నజర్
“అసెస్మెంట్ల మార్పు” చేయని 36 కమిషనర్లకు షోకాజ్ నోటీసులు
ప్రజాపక్షం/ హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో అదనం గా ఐదు శాతం ఆస్తిపన్నును వసూలు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2018- మార్చి నాటికి) పెంచిన పన్నులను వసూలు చేయాలని స్థానిక మున్సిపాలిటీలను మున్సిపల్ శాఖ ఆదేశించింది. అలాగే అసెస్మెంట్ల మార్పు ప్రక్రియను పూర్తి చేయ ని 36 మున్సిపాలిటీ కమిషనర్లకు షోకాజ్ నోటీసులను జారీ చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు సుమారు మూడు నెలల గడువు మాత్రమే ఉండడంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు మున్సిపల్ శాఖ మార్గాలను అన్వేషిస్తోంది. కొత్తగా ఏర్పడిన 61 మున్సిపాలిటీల నుంచి మొత్తంగా రూ. 81.49 కోట్ల ఆస్తిపన్నులు వసూలు కావాల్సి ఉండగా, కేవలం రూ. 22.39 కోట్లు మాత్రమే వసూలు కావడం పట్ల తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదాయాన్ని పెంచుకునేందుకు మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలని, అలాగే పెండింగ్లో ఉన్న ఆస్తిపన్నులు, వివిధ రకాల పన్నులను వసూలు చేయాలని ఆయా మున్సిపాలిటీలకు సూచించింది. కాగా, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడిన 61 మున్సిపాలిటీలలో అదనంగా ఐదు శాతం పన్నులను వసూలు చేయాలని తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన పక్రియను తక్షణమే చేపట్టాలని కొత్తగా ఏర్పడిన 61 మున్సిపాలిటీలను ఆదేశించింది. ఇటీవల ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు సమావేశమై ఆస్తి పన్నుల బకాయిలు, ఆదాయన్ని సమకూర్చుకునే మార్గాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నది. “భువన్ అసెస్మెంట్ల”లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,82,209 అసెస్మెంట్లను మార్పు (నిర్మాణాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా అసెస్మెంట్ల మార్పు)చేయడంతో మున్సిపల్ ఖజానాకు రూ. 24.75 కోట్లు అదనంగా వసూలైంది.అయితే అసెస్మెంట్ల మార్పు ప్రక్రియను ఇప్పటి వరకు 28 మున్సిపాలిటీలలో వంద శాతం పూర్తి చేశా రు. అసంపూర్తిగా ఉన్న మరో 36 మున్సిపాలిటీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు నిర్ణయించింది. మరోసారి జరిగే ట్యాక్స్ బోర్డ్ సమావేశానికి అసెస్మెంట్ల మార్పు ప్రక్రియను పూర్తిగా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వారానికో రెండు మున్సిపాలిటీలపై దృష్టి
ఆస్తిపన్నుల వసూలులో వెనుకడిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు నిర్ణయించింది. ఆస్తిపన్నుల వసూలు, ఇతర ఆదాయమార్గాలను పెంచేందుకు ప్రత్యేక అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను ప్రతివారం రెండు మున్సిపాలిటీల చొప్పున పరిశీలించి అక్కడి ఆదాయాన్ని పెంచడంతో పాటు బకాయిలను వసూలయ్యేలా చూడాలని బోర్డు సూచించింది.