అక్షరాల అండంలో
అనుమతిలేకుండా
విషవీర్యం ప్రవేశం
విషాక్షరాల జననం
ఒక్కపుట్టుక
అక్షరాల ప్రోది
ఏ అక్షరాన్ని
స్వేచ్ఛగా బతకనీయట్లే
చావనీయట్లే
అక్షరాన్ని
అనుకూలంగా మార్చుకునేక్రమంలో
అక్షరాన్ని చెరుస్తున్నారూ
హత్య చేస్తున్నారూ
భావవ్యక్తీకరణలో
తలదూర్చి
విలువల వలువలనొలిచేస్తున్నారూ
కుంభకోణాల వెలికితీత
ప్రహసనమై
దాడుల రూపకల్పన
అక్షరం ప్రజాపక్షమై
ఆయుధమౌతుంటే
సహించక
అక్షరం గొంతుపై వేటకొడవళ్ళు
ఇలాకాలో
విపక్షాక్షరం
అగుపిస్తే వెన్నులో వణుకు
అసమ్మదీయ అక్షరమే ఎక్కడైనా
అధికార ఎజెండాయే
అక్షరం వెదజల్లాలి
నిజానిజాల తేటతెల్లం కానేరదు
అక్షరం ప్రాణం
మాయలఫకీరు చేతిలో
అక్షరం పంజరంలో చిలుక
అక్షరం రెక్కలు తెగనరక్క బడ్డ పక్షి
ఒక్కో అక్షరానికి
ఒక్కో రేటు కట్టే షరాబు
సంఘర్షణలో అక్షర యోధులు
ఓదార్చలేని అక్షరం
ఓరిమిగా అక్షరం
అగ్నిపర్వతమై బద్దలయ్యే రోజుకై
– గిరిప్రసాద్ చెలమల్లు
9493388201