వాషింగ్టన్ : రష్యాపై ఆధారపడకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు తామే స్వయంగా వ్యోమగాములను పంపించుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేస్తున్న ప్రయత్నాలకు గండిపడుతోంది. ఐఎస్ఎస్పై స్వయంగా వ్యోమగాములను పంపించడానికి, అలాగే చంద్రునిపైకి మానవ రహిత, మానవ సహిత స్పేస్‌క్రాఫ్ట్‌లు పంపడానికి నాసా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం బోయింగ్ కంపెనీ అనే ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. బోయింగ్ నాసా కోసం అతిపెద్ద రాకెట్‌ను నిర్మిస్తున్నది. చంద్రునికిపై మానవులను పంపించే తొలి స్పేస్లాంఛ్ సిస్టమ్ రాకెట్ ఇదే. ఈ తరహా పరీక్ష కూడా ఇదే ప్రథమం కాబోతున్నది. పైగా 1970 నాటి అపోలో మిషన్స్ తర్వాత అమెరికా చంద్రయానానికి ఏర్పాట్లు చేయడం ఇదే మొదటిసారి. ముందుగా 2020 సంవత్సరంలో మానవ రహిత చంద్రయానానికి, 2022లో మానవ సహిత చంద్రయానానికి ఏర్పాట్లు చేసింది. అయితే ఇది కూడా జాప్యం జరిగేలా కన్పిస్తున్నది. దీనికి ప్రధాన కారణం బోయింగ్ బడ్జెట్ పెరగడమే. ఇప్పుడు ఈ రాకెట్ నిర్మాణానికి 8.9 బిలియన్ డాలర్ల వ్యయం అవుతున్నదని నాసా లెక్కగట్టింది. దీంతో మరికాస్త జాప్యం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.