లండన్: మార్స్ (అంగారక గ్రహం)పై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు చేపట్టిన పరిశోధనలు మరింత ముందుడుగు వేస్తున్నాయి. తాజాగా మార్స్ చుట్టూ వున్న వింత మేఘాల గురించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఇఎస్‌ఎ) వివరించే ప్రయత్నం చేసింది. శాస్త్రవేత్తలు మార్స్‌పై ఒక వింత మేఘాన్ని చూశారు. అలాంటి మరికొన్ని బయటపడ్డాయి. దీంతో ఈ పరిణామంపై ఆసక్తి మొదలైంది. ఆ మేఘాలు చాలా పెద్దగా వున్నాయి. భూమిపై నుంచి టెలిస్కోప్‌ల సాయంతో కూడా వీటిని చూడవచ్చని ఇఎస్‌ఎ శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్‌పై అగ్నిపర్వతాలు పేలుడు కారణంగానే ఇది జరిగిందా అన్న కోణం నుంచి కూడా పరిశోధనలు సాగించారు. నెల రోజుల క్రితమే మార్స్‌పై మేఘాలు కన్పించాయి. మార్స్ భూమధ్య రేఖకు సమీపంలోని ఆర్సియామాన్స్ వద్ద దాదాపు 930 మైళ్ల పొడవునా ఈ మేఘాలు కన్పించాయి. మొదట్లో అగ్నిపర్వత పేలుళ్ల కారణంగా ఇది సంభవించి వుండవచ్చని భావించినప్పటికీ, అది మార్స్ భూమధ్యరేఖ వద్ద వున్నందున అగ్నిపర్వత పేలుడుతో సంబంధం లేదని నిర్ధారించారు. పైగా ఆఖరి అతిపెద్ద అగ్నిపర్వత పేలుడు దాదాపు 50 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించింది. ఆ సమయంలో భూమిపై డైనోసార్లు సంచరించేవి. ఇక మంచునీటి మేఘాలు అయివుండవచ్చని కూడా మరో కోణం నుంచి పరిశోధన సాగించారు. ఆర్సియా మాన్స్ ప్రాంతంలో తరచూ ఈ తరహా తెల్లని మేఘాలు కన్పిస్తున్నందున ఇది మంచునీటి మేఘాలై వుండవచ్చని సందేహిస్తున్నారు. ఇలా మేఘాలు కన్పించడం ఇది కొత్తకాదు. 2015లో మార్స్ ఎక్స్‌ప్రెస్ పరిశీలనలో కూడా ఆఖరిసారిగా ఇదే తరహాలో మంచు నీటి మేఘాలు కన్పించాయి. మార్స్‌లోని ఉత్తర ధృవంలో శీతాకాలానికి ముందు కొద్ది రోజులపాటు ఈ మేఘం కన్పించింది. మార్స్‌లో ఎక్కువగా ఈ తరహా మేఘాలు ఆర్సియా మాన్స్ ప్రాంతంలోనే దర్శనమిస్తుంటాయి. అక్కడి భూమధ్యరేఖకు సమాంతరంగా ఇవి కన్పిస్తున్నాయి.