కరీంనగర్: రాష్ట్రంలో పోలింగ్ జరిగాక కూడా కెటిఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పడం చూస్తుంటే విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. వాస్తవంగా ఆ పార్టీకి 100 కాదు 10 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆదివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల వాతావరణం నెలకొందని తెలిపారు. సెప్టెంబర్లో అసెంబ్లీని రద్దు చేసిన కెసిఆర్ ఇప్పటివరకు సహేతుకమైన కారణం చెప్పలేకపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను తొలుత తప్పుబట్టిన టిఆర్ఎస్ నేతలు.. అది ప్రజల్లోకి వెళ్లడం చూసి కొద్దిపాటి మార్పులతో టిఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని తెలిపారు. అందుకే ఎన్నికల ప్రచారంలో 30 నుంచి 40 మంది ఆ పార్టీ అభ్యర్థులను ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. అన్ని పార్టీల జెండాలను వేసుకున్నారంటూ ప్రజాఫ్రంట్ నేతలను విమర్శించిన టిఆర్ఎస్ నేతలు.. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ జెండాను ఎందుకు వేసుకోవడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల వాతావరణం
RELATED ARTICLES