HomeNewsAndhra pradeshరసవత్తర లెక్కలు

రసవత్తర లెక్కలు

గెలుపోటములపై కూడికలు, తీసివేతలు 
ప్రజానాడి దొరకక రాజకీయ వర్గాల మల్లగుల్లాలు 
హోరాహోరీ పోరే ఉందంటున్న మెజారిటీ వర్గాలు
ప్రజాపక్షం / హైదరాబాద్‌ 
పోరు ముగిసింది. హోరు తెలియాల్సి ఉంది. ఇందు కోసం మరో రెండు రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితా లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో వారు వీరు అనే తేడా లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ గెలుపోటములపై లెక్కలు వేస్తున్నారు. ఏ లీడర్‌ నోట విన్నా, చిన్న పిల్లాడి నుంచి పెద్దోడి వరకు ఎవరిని పలకరించినా ఈ సారి పవర్‌లోకి వచ్చేదెవరో చెప్పడం అంత సులభం కాదనే సమాధానం వస్తోంది. ఆలెక్కా, ఈలెక్కా తీసి ఆపార్టీ ఈ పార్టీ అంటూ ఎడతెగని అంచనాలు వేసి చివ రికి అబ్బ చెప్పలేం, పోటీ చాలా హోరా హోరీ గా ఉంది అంటూ ముగించేస్తున్నారు. ఇక పోలింగ్‌ అయిన మరుక్షణం వెలుబడిన పలు ఎగ్జిట్‌పోల్స్‌, వాటి అనంతరం వచ్చిన మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యా యి. జాతీయస్థాయి సంస్థల సర్వేలన్నీ దాదా పు అధికార పార్టీ టిఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపగా, లగడపాటి సర్వే మాత్రం సంకోచం లేకుండా, అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా స్పష్టంగా ప్రజాఫ్రంటే అధికారంలోకి వస్తుందని తేల్చేసింది. పలు మీడియా చానళ్లలోనూ పేరొందిన విశ్లేషకులు, వివిధ పార్టీల రాజకీయ నేతలు ఈ సర్వేలను చాలా లోతుగా విశ్లేషించారు. రాజకీయ పరిశీలకులు సైతం వీటిపై లోతైన అభిప్రాయాలు వెల్లడించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండే వారి అభిప్రాయాలు ఒక రీతిలో ఉండగా, వివిధ పార్టీల నాయకులు మాత్రం ఆ సర్వేలోని గణాంకాలను ఎవరి పార్టీకి అనుగుణంగా వారు విశ్లేషించి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. అయితే వారిలోనూ పూర్తి స్థాయి నమ్మకం కనిపించకపోవడం గమనార్హం. లగడపాటి చెప్పిన విధంగా సర్వేలో ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదన్న వాస్తవం వీటన్నింటిని బట్టిఅర్థమవుతోంది. మొత్తం మీద ఎవరి అంచనాలు వారికున్నా… అంతిమంగా అధికారం దక్కించుకునేదెవరనే దానిపై నలుగురు గూమిగూడిన చోటనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య, యువత, విద్యార్థుల మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయ పరిజ్ఞానం లేని చిన్నారులు సైతం నాన్నా… ఎవరు కొత్త సిఎం అవుతారు అన్న ప్రశ్నలు వేస్తున్నారంటే ఈ సారి తెలంగాణ ఎన్నికలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో అర్థమవుతోంది.
ఏది ప్లస్‌  ఏది మైనస్‌ : చర్చ ఎవరి మధ్య జరిగినా, రాజకీయ పార్టీల నేతల మధ్యనైనా, సాధారణ పౌరులైనా సరే ప్రధానాంశం ఒక్కటే. ఎవరికి ఏది ప్లస్‌ అయింది, ఏది మైనస్‌ అయింది, అంతిమంగా ఎవరు లాభం పొందనున్నారు. దీనిపైనే రసవత్తర మాటల యుద్ధం జరుగుతోంది. కూడికలు, తీసివేతలు వంటి లెక్కలతో చర్చ యమ రంజుగా సాగుతోంది. చర్చల్లో చోటు చేసుకుంటున్న ప్రధానాంశాలను గమనిస్తే… ప్రభుత్వ వ్యతిరేకత, కుటుంబపాలన, మిషన్‌ భగీరథ పూర్తి స్థాయిలో కాకపోవడం, మిషన్‌కాకతీయ, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఇతరత్ర వాటిల్లో చోటుచేసుకున్న అవినీతి, కౌలురైతులకు రైతు బంధు లేకపోవడం, నియామకాలు జరగకపోవడం, ఉద్యోగులు పిఆర్‌సి, ఐఆర్‌ ఇవ్వకపోవడం ఇలా ఎన్నో అంశాలు ప్రజాకూటమికి ఈ సారి చాలా అనుకూలంగా మారాయన్న వాదనలు జరగుతున్నాయి. ఇదే స్థాయిలో సరైన నాయకత్వం లేకపోవడం, ఎవరు సిఎం అవుతారో, ఎవరు ప్రజాకూటమి పాలనను ముందుకు తీసుకుపోతారో తెలియని పరిస్థితులు ఉండడం, ఆంధ్రాపార్టీగా ముద్రపడ్డ టిడిపితో పొత్తు పెట్టుకోవడం, పక్కా తెలంగాణ ముద్ర ఉన్న టిజెఎస్‌ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వంటివి అధికారపార్టీకి ప్లస్‌ అవుతాయన్న వాదనలు చేస్తున్నారు. సరిగ్గా పోలింగ్‌ సమయం వరకు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లోకి చేరడం కూడా కలిసి వస్తుందన్న వినిపిస్తున్నారు. వీటిలో ఓటర్లను ఏవి ఎక్కువ ప్రభావం చూపెట్టాయి, ఎవరికెన్ని ఓట్లు పడేశాయి అన్న దానిపై లెక్కలు వేస్తూ చర్చలు జరుగుతున్నాయి.
పంపకాల ఫలితాలపై అభ్యర్థుల ఆరా : హోల్‌సేల్‌గా రాష్ట్రవ్యాప్త ఫలితాలపై పార్టీ అధినాయకత్వాలు లెక్కలు తీస్తుంటే అభ్యర్థులు వారి గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నారు. తనకున్న పేరు ప్రతిష్టల మాట ఎలా ఉన్నా, తనకు మైనస్‌ ఉన్న ప్రాంతాల్లో చేసిన పంపకాలు, వాటి ఫలితాలు, అవి ఓటరుకు చేరాయా లేదా ఇలా క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలతో మాట్లాడుతూ లెక్కలు వేస్తున్నారు. పోలింగ్‌ రోజు ఎక్కడ, ఏబూత్‌ వద్ద ఎలాంటి వాతావరణం కనిపించింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఇదే నేపథ్యంలో కార్యకర్తలు, నేతల మధ్య కూడా అక్కడ మనకు, ఇక్కడ వారికి అంటూ జరుగుతున్న కూడికలు, తీసివేతలతో పల్లె వీధి నుంచి పట్నం గల్లీ వరకు వాతావరణం యమరంజుగా తయారైంది.
ఉద్యోగులు, యువత, విద్యార్థుల ఓట్లపై  ప్రజాకూటమిలో ధీమా 
గల్లీలో చూసినా, పట్నంలో వీక్షించినా ప్రతి చోట ప్రజాకూటమిలో ఉద్యోగుల, యువత, విద్యార్థుల ఓట్లపై ధీమా వ్యక్తం అవుతోంది. రాజకీయాల కతీతమైన వారి చర్చల్లోనూ ఇది ప్రధానాంశంగా మారింది. ఏ ఉద్యోగిని పలకరించినా మెజా ర్టీ( దాదాపు పూర్తి స్థాయిలో) శాతం ప్రజాకూటమికి ఓటు వేశామన్న మాట వినిపిస్తోంది. ఈ పరిస్థితి యువత, విద్యార్థుల్లోనూ కనిపిస్తోంది. ఇదే సమయంలో రైతులు, గ్రామీణులు, ప్రభుత్వ పథకాల ద్వారా నేరుగా లబ్దిపొందిన వారిలో సింహభాగం అధికారపార్టీవైపే మొగ్గు చూపారన్న వాదన చర్చల్లో చోటుచేసుకుంటోంది.
ఎగ్జిట్‌పోల్స్‌, సర్వేలను అంతగా నమ్మని జనం : గెలుపు ఓటములపై జరుగుతున్న చర్చలు, వేసుకుంటున్న లెక్కల్లో ఎగ్జిట్‌పోల్స్‌, సర్వేల అంశం ప్రస్తావనకు వస్తున్నప్పటికి మెజార్టీ శాతం వీటిని పట్టించుకోవద్దనే అంటున్నారు. ఇప్పటి వరకు జాతీయస్థాయి సంస్థలు చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌, సర్వేలు మన వద్ద నిజం కాలేదని గతంలోని వాటిని ఉదహరించి మరీ వాటిని కొట్టిపారేస్తున్నారు. అయితే గతంలో లగడపాటి సర్వే లు దాదాపుగా నిజం కాగా అప్పట్లో లగడపాటి సర్వేలు మిగతా వాటి సర్వేలకు మధ్య భారీ వత్యాసం ఉండేది కాదన్న వాదన చాలా చోట్ల వినిపిస్తోంది. ఈ సారి మాత్రం మిగతా సర్వేలతో లగడపాటి సర్వే పూర్తిగా భిన్నంగా ఉండడంతో దీనిని కూడా చాలా చోట్ల కొట్టిపారేస్తున్నారు. అయితే సోషల్‌ మీడియా ఈ సారి పెనుప్రభావం చూపడంతో సర్వేలకు ఓటరు తన నాడిని దొరకనీయలేదన్న వాదన వినిపిస్తోంది.ఎగ్జిట్‌పోల్స్‌లోనూ వ్యత్యాసాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్న భావన కూడా పలువురిలో వ్యక్తమవుతోంది. కొన్ని హోరాహోరీ ఫలితాలను వెల్లడించగా, మరి కొన్ని ఒకే వైపు ఫలితాన్ని ప్రకటించడం దీనికి కారణంగా కనిపిస్తోంది.
ప్రాంతాల వారీగా లెక్కలు : 
రాష్ట్ర స్థాయిలో పార్టీల నేతల నుంచి క్షేత్రస్థాయిలో సాధారణ పౌరుని వరకు సైతం ప్రాంతాల వారీగా లెక్కలు కూడా చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో సెటిలర్ల ప్రభావం, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో ఉండే పరిస్థితులను బట్టి ఎవరికి ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై లెక్కలు జోరుగా జరుగుతున్నాయి. వీటితో పాటు బలమైన అభ్యర్థులు, రెబల్‌ అభ్యర్థుల ప్రభావం, జాతీయ స్థాయి నేతల ప్రచార ప్రభావం, నువ్వా నేనా అని ఉన్నచోట పరిస్థితి ఏంటి అన్న అంశాలపైనా జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇలా ఏ కోణంలో ఎక్కడ చర్చ జరిగినా చివరికి అధికారంలోకి ఏపార్టీ వస్తుందన్న అంశం వచ్చే సరికి ఏమో చెప్పలేం, ఈ సారి చిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోటీ చాలా తీవ్రంగా ఉంది, ఎవరు వచ్చినా మార్జిన్‌ తక్కువగా ఉండొచ్చు అన్న ముగింపే వినిపిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments