జైపూర్: రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. ఓట్ల పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 4.74 కోట్ల ఓటర్లలో 74 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిలుచున్న ఓటర్లకు ఓటును వినియోగించుకునే అవకాశాన్ని అధికారులు ఇచ్చారు. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఆ సమయానికి 73.85 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని 51,687 పోలింగ్ బూత్‌లలో ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రశాంతంగా మొదలయిందని అధికారులు చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ సచిన్ పైలట్, ఇతర ప్రముఖ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝల్రాపతన్ నుంచి వసుంధర రాజే, టోంక్ నుంచి పైలట్, సర్దార్‌పురా నుంచి అశోక్ గెహ్లాట్ సహా 2,274 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మరణించడంతో అల్వార్ జిల్లాలోని రామ్‌గఢ్ నియోజకవర్గంలో ఎన్నికలను నిలిపేశారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న(మంగళవారం) ప్రకటిస్తారు. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధర రాజే ప్రముఖ బిజెపి నాయకుడు జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్‌తో ఝల్రాపతన్లో తలపడుతున్నారు. ఆమె 2003 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో ఆయన వసుంధర రాజేకు తీవ్ర పోటీనిస్తున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న టోంక్‌లో కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలెట్‌కు, బిజెపి అభ్యర్థి, రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి యూనుస్ ఖాన్‌కు మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది. ఎన్నికల్లో కాషాయ పార్టీ నుంచి పోటీచేస్తున్న ఒకే ఒక ముస్లిం అభ్యర్థి ఖాన్. బిజెపి మొదట టోంక్‌లో సిట్టింగ్ ఎంఎల్ఎ అజిత్ సింగ్ మెహతాను నిలిపింది. కానీ వ్యూహాన్ని మార్చుకోవడంతో అతడిని తప్పించి పైలెట్‌పై ఖాన్‌ను పోటీకి నిలబెట్టింది. సచిన్ పైలెట్‌కు ఇదే తొలి అసెంబ్లీ ఎన్నికలు. రెండుసార్లు ఎంపిగా గెలిచిన సచిన్ పైలెట్ మొదటిసారి అసెంబ్లీకి పోటీచేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. గతంలో ఆయ న పార్లమెంటు సభ్యుడిగా దౌస, అజ్మీర్ లోక్‌సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్‌లోని దాదాపు 130 నియోజకవర్గాల్లో ఎన్నికల పోటీ కాంగ్రెస్, బిజెపి మధ్యే ఉంది. ప్రస్తుతం రాజస్తాన్ అసెంబ్లీలో బిజెపికి 160 స్థానాలు, కాంగ్రెస్‌కు 25 స్థానాలు ఉన్నాయి.