జైపూర్: రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 199 నియోజకవర్గాలకు ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి 72.7శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద వరుసలో ఉన్నవారు మాత్రం ఇంకా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అత్యధికంగా పోఖ్రాన్ జిల్లాలో 71.29శాతం, జైసల్మేర్‌లో 70.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జలోర్, కోటా నార్త్, జోధ్‌పూర్, అజ్మేర్ నార్త్ నియోజకవర్గాల్లో అత్యల్ప పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొండికేయడం, కార్యకర్తల మధ్య ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మొత్తం 200 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రామ్‌గఢ్ ఎమ్మెల్యే బిఎస్పి అభ్యర్థి మృతితో 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 2,274 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. డిసెంబరు 11న ఫలితాలు వెలువడనున్నాయి.
రాజస్థాన్‌లో 72.7శాతం పోలింగ్
RELATED ARTICLES