ప్రజాఫ్రంట్ నేతల సంయుక్త మీడియా సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
హైదరాబాద్: నాలుగేళ్ల కెసిఆర్ పాలన అవినీతిమయంగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన ప్రజాఫ్రంట్ నేతల సంయుక్త మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. యువకులు, తెలంగాణ ప్రజలు తాము కన్న కలల్ని మర్చిపోయారన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర రూపురేఖలు మారుతాయని ప్రజలు భావించారని, కెసిఆర్ మాత్రం వారిని మోసం చేశారన్నారు.
మోడీకి ఏజెంట్ కెసిఆర్
ప్రధాని మోడీకి ఏజెంట్‌గా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. తెలంగాణలో అహంకారపూరిత పాలన కొనసాగుతోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించడం ద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని భావించి తామంతా ఒక్కటయ్యామని చెప్పారు.
గొప్ప రాష్ట్రాన్ని టిఆర్ఎస్ నాశనం చేసింది
గొప్ప రాష్ట్రాన్ని టిఆర్ఎస్ నాశనం చేసిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. తెలంగాణ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు నాంది కాబోతున్నాయన్నారు. తెలంగాణలో ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం తమకుందన్నారు. సంపదలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం అభివృద్ధిలోనూ ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. టిఆర్ఎస్, బిజెపి విభజన రాజకీయాలు చేస్తున్నాయని, తెలంగాణకు తామంతా అండగా ఉంటామన్నారు. ప్రజాఫ్రంట్‌ను గెలిపిస్తేనే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు అన్నారు. ఎన్నికలలో అందరూ తప్పకుండా ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.
స్వప్రయోజనాల కోసం పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు
ఒక కుటుంబం తమ స్వప్రయోజనం కోసం ప్రభుత్వాన్ని నడిపిస్తే ఫలితాలు రావని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదనే విషయాన్ని ప్రజలకు చెప్పామన్నారు. తెలంగాణ వచ్చే వరకు రాష్ట్రం కోసం, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కొరకు పోరాడమని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్‌కు మద్దతు తెలపాలని ప్రజలను కోదండరాం కోరారు.