బిసిసిఐని ప్రశ్నించిన సునీల్ గవాస్కర్
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా ఫామ్‌లో లేక సతమతమవుతూ.. నిలకడగా రాణించలేకపోతున్న మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్‌లు దేశవాళీ క్రికెట్ ఎందుకు ఆడట్లేదని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బిసిసిఐని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగాజరుగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఇప్పుడు కొన్ని నెలల సమయమే మిగిలుంది. అయితే అపారమైన అనుభవం ఉన్న ధోనీ ప్రపంచకప్‌లో ఆడాలంటే దానికంటే ముందు దేశవాళీ క్రికెట్‌లో ఆడి తిరిగి తన పాత ఫామ్ సాధించాలని గవాస్కర్ సూచించారు. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో ధోనీకి చోటు దక్కలేదు. అనంతరం భాతర జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. అక్కడ జరిగిన టి20 సిరీస్‌లో కూడా ధోనీని ఎంపిక చేయలేదు. డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అనంతరం వన్డే సిరీస్ జరుగనుంది. అయితే వన్డే జట్టులో ధోనీ చోటు దక్కించుకోవాలంటే తిరిగి ఫామ్‌లో రావాలి. చివరి సారిగా అక్టోబర్‌లో ఆడిన ధోనీ అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడితే అతనికి ప్రాక్టీస్ అయ్యేదని గవాస్కర్ అన్నారు. ప్రపంచకప్‌లో కీలక ఆటగాడి పాత్ర పోషించే సత్తా ఉన్న ధోనీని బిసిసిఐ దేశవాళీ క్రికెట్ ఆడే సలహ ఎందుకు ఇవ్వడంలేదని ఆయన ప్రశ్నించారు. ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియా వన్డే సిరీస్ అనంతరం న్యూజిలాండ్ పర్యటన చేయనుంది. ఈ రెండు సిరీస్‌లలో అవకాశాలు సాధించి ధోనీ రాణిస్తేనే ప్రపంచకప్ జట్టులో అవకాశం సులువవుతుందనీ, లేదంటే అతని స్థానంపై సందేహాలు వెల్లువెత్తుతాయని గవాస్కర్ చెప్పారు. మరోవైపు శిఖర్ ధవన్ కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ఆసీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో ధవన్ మంచి ప్రదర్శన చేశాడు. అతని ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కింది. అయితే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఖాళీగా ఉన్న సమయాల్లో దేశవాళీ క్రికెట్‌లో ఆడుతుంటే.. తమ ప్రాక్జీస్ కొనసాగుతూ ఉంటుందని, దీనిపై వారు దృష్టి సారించాలని గవాస్కర్ అన్నారు.
ధోనీ, ధవన్ దేశవాళీ క్రికెట్ ఎందుకు ఆడట్లేదు?
RELATED ARTICLES