పారిస్ : ఈ శతాబ్దాంతానికి ప్రపంచంలోని పలుభాగాలు ఒకేసారి అరడజను వాతావరణ ఉపద్రవాలను ఎదుర్కొంటాయని వాతావరణ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. వడగాల్పులు, అడవుల్లో కార్చిచ్చు, జలప్రళయాలు, భయంకరమైన తుపానులు వాటిలో ఉన్నాయి. అవి ఇప్పుడూ సంభవిస్తున్నాయి మరింత ఉపద్రవంగా మారతాయి. సాధారణంగా ఉష్ణప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగటంతో అవి మొదలవుతాయి. అది అనావృష్టికి, వడగాడ్పులకు, ఇప్పుడు కాలిఫోర్నియాను వణికిస్తున్న కార్చిచ్చుకు దారితీస్తాయి. చలి ప్రాంతాల్లో భారీవర్షాలు, వరదలు సంభవిస్తాయి. మహాసముద్రాల్లో వాతావరణం వేడెక్కటంవల్ల అతిపెద్ద తుపానులు సృష్టిస్తాయి. సముద్రమట్టం పెరుగుతుంది అని హవాయి యూనివర్శిటీకి చెందిన మెరైన్ బయాలజీ ఇన్స్టిట్యూట్లో పరిశోధకుడు ఎరిక్ ఫ్రాంక్లిన్ చెప్పారు. వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఈ వాతావరణ మార్పు ప్రభావాన్ని ఒకటి తర్వాత ఒకటి అధ్యయనం చేస్తున్నారు. వీటిని మానవాళి విజయవంతంగా ఎదుర్కోవటమన్నది గ్రీన్హౌస్ ఉద్గారాలను శీఘ్రంగా తగ్గించటంపై ఆధారపడి ఉందని ఆయన హెచ్చరించారు.