పురుషుల హాకీ ప్రపంచకప్
భువనేశ్వర్: పురుషల హాకీ ప్రపంచకప్‌లో భాగంగా భారత్, బెల్జియం మధ్య జరిగిన కీలక మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్ 2-2 బెల్జియం చెరో రెండు గోల్స్ చేయడంతో మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రా అయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఒకవైపు ప్రపంచ మూడో ర్యాంకర్.. మరోవైపు ప్రపంచ ఐదో ర్యాంకర్ ఇద్దరి మధ్య కీలక పోరు.. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు క్వార్టర్స్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంటుంది.. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ కంటే బలంగా ఉన్న బెల్జియంకే విజయం వరిస్తుందని అందరూ భావించారు.. దాదాపు 40 నిమిషాల వరకు ఆధిపత్యం చెలాయించిన బెల్జియం చివరికి భారత్‌ను నిలువరించలేక డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ పోరాటం అద్భుతం. ఆరంభంలో పేలవంగా ఆడిన టీమిండియా చివర్లో అనూహ్యంగా పుంజుకుంది. ఆదివారం ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన పూల్-సి మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదట్లో బెల్జియం తన ఆధిపత్యాన్ని చెలాయించింది. (8వ) నిమిషంలోనే గోల్ చేసిన హేండ్రిక్స్ అలెక్సాండర్ బెల్జియంకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తర్వాత చాలా సేపటి వరకు బెల్జియం తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. భారత ఆటగాళ్లు గోల్స్ కొట్టేందుకు ఎంతగానో ప్రయత్నించినా ప్రత్యర్థి కీపర్ వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. దీంతో మొదటి క్వార్టర్ ఆట ముగిసే సరికి బెల్జియం ఆధిక్యంలోనే నిలిచింది. అయితే తర్వాతి క్వార్టర్లో పుంజుకున్న భారత ఆటగాళ్లు చెలరేగి ఆడారు. ప్రత్యర్థి గోల్ పోస్టుపై వరుస దాడులు చేస్తూ హడలెత్తించారు. ఈ క్రమంలోనే హర్మన్‌ప్రీత్ సింగ్ కళ్లుచెదిరే గోల్‌తో భారత్ ఖాతా తెరిచాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. తర్వాత అదే జోరును కొనసాగించిన భారత ఆటగాళ్లు మరో 8 నిమిషాల వ్యవధిలోనే ఇంకోక గోల్ చేసి సంచలనం సృష్టించారు. (47వ) నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ ఈ గోల్‌ను సాధించాడు. ఈ సమయంలో భారత జట్టు 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే ఓటమికి చెరువైన బెల్జియం చివర్లో వరుసగా దాడులు చేస్తూ గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించింది. (56వ) నిమిషంలో వారి శ్రమ ఫలించింది. గౌగ్నార్డ్ సీమన్ భారత ఆశలపై నీరుగారిస్తూ బెల్జియంకి రెండో గోల్ అందించాడు. దీంతో రెండు జట్ల స్కోరు 2-2తో మరోసారి సమమైంది. చివరి వరకు ఇరుజట్లు మరో గోల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. మ్యాచ్ పూర్తి సమయం ముగిసే వరకు అది సాధ్యపడలేదు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. శనివారం జరిగే తన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు కెనడాతో తలపడనుంది. పూల్-సిలో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో కెనడా 1-1తో దక్షిణాఫ్రికాతో డ్రా చేసుకుంది.
భారత్, బెల్జియం మ్యాచ్ డ్రా
RELATED ARTICLES