రాజస్థాన్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ గురువారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపడితే రైతులకు రుణమాఫీ, బాలికలకు, మహిళలకు ఉచిత విద్య, రూ. 3500 వరకు నిరుద్యోగ భృతి, వృద్ధ రైతులకు పింఛన్లు ఇస్తామని హామీనిచ్చింది. ఎఐసిసి జనరల్ సెక్రటరీ అవినాష్ పాండె, రాష్ట్ర పిసిసి చీఫ్ సచిన్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ హరీశ్ చౌదరి జైపూర్ ‘జన్ ఘోష్న పత్ర’ పేరుతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సచిన్ పైలట్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వివిధ మార్గాల ద్వారా ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుందని, సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ పద్ధతుల ద్వారా దాదాపు రెండు లక్షల సూచనలు వచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఒక నిర్ణీత కాలంలో మేనిఫెస్టోను అమలు చేయడమే కాంగ్రెస్ లక్షమన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను ఆయన వివరించారు. రైతు రుణాలు మాఫీ, బాలికలు, మహిళలకు ఉచిత విద్య, చదువుకున్న నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3500 వరకు భృతి కల్పిస్తామని పైలట్ పేర్కొన్నారు. రాహలు మోడల్ ఆధారంగా మేనిఫెస్టోను తయారు చేశామని, ముసాయిదా తయారీకి ముందుకు ప్రజల సూచనలు, సలహాలను తీసుకున్నట్లు అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన యూనివర్శిటీలను అధికార బిజెపి మూసివేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తిరిగి తెరుస్తామని హామీనిచ్చారు. కాగా, వ్యవసాయ పనిముట్లను అందజేస్తామని, ట్రాక్టర్లను జిఎస్ మినహాయిస్తామని తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపర్చింది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్ పరిధిలోకి తీసుకువచ్చేలా జిఎస్ కౌన్సిల్ సిఫార్సు చేస్తామని పేర్కొంది. రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక, పర్యాటక విధానాలను తీసుకువస్తామని, స్థానిక కళలు, సంస్కృతి, వారసత్వాల్లో ప్రమోషన్లు కల్పిస్తామని హామీనిచ్చింది. ప్రతి జిల్లాలో మహిళలకు ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామని, వృద్ధులకు పెన్షన్ పెంచుతామని, జర్నలిస్టు రక్షణ చట్టాన్ని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకువస్తామని, మతపరమైన ప్రదేశాల్లో భద్రతకు సంబంధించి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చింది.
రైతులకు రుణమాఫీ, బాలికలకు ఉచిత విద్య
RELATED ARTICLES