అగ్రరాజ్యం అమెరికాను కార్చిచ్చు భయపెడుతోంది. కాలిఫోర్నియాలో సంభవించిన కార్చిచ్చులో 630 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరానికి 280 కిలోమీటర్ల దూరంలో వారం రోజుల క్రితం రాజుకున్న మంటలు ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ కార్చిచ్చులో ఇప్పటికే 63 మంది చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించగా.. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గత వందేళ్ల కాలంలో కాలిఫోర్నియా చరిత్రలో ఈ స్థాయిలో మంటలు ఎప్పుడూ చెలరేగలేదని అధికారులు తెలిపారు. రాష్ట్ర అటవీ, అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మంటల్లో సుమారు 9 వేల ఇళ్లు, భవనాలు దగ్ధమయ్యాయి. ఇంకా సమీప ప్రాంతాల్లోని వేలాది భవనాలకు మంటలు అంటుకునే ముప్పు ఉంది. ఇంకా 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ఆదేశాలు ఉన్నాయి. మంటలకు ప్రభావితమైన పట్టణాల్లో ఎటు చూసినా శిథిలమైన భవనాలు, బూడిదే కనిపిస్తోందని అధికారులు తెలిపారు.