శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం భూమాత బ్రిగేడ్ వ్యవస్థపాకురాలు తృప్తి దేశాయ్ శబరిమల దర్శనం కోసం పుణే నుంచి విమానంలో కొచ్చికి వచ్చారు. అయితే ఎయిర్‌పోర్టులోనే ఆమెను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆమెను ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లనివ్వం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో తృప్తి విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అటు ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు కూడా తృప్తికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. తృప్తి, ఆమె బృందాన్ని తమ వాహనాల్లో తీసుకెళ్లేది లేదని చెప్పారు. ఇటు హోటళ్లలో కూడా ఆమెకు గది ఇవ్వొద్దని ఆందోళనకారులు హెచ్చరించారు. అయితే ఆందోళనల దృష్ట్యా విమానాశ్రయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టులో ఉన్న తృప్తిదేశాయ్తో మీడియా వర్గాలు ఫోన్లో మాట్లాడాయి. అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునేంతవరకు తాను మహారాష్ట్ర తిరిగి వెళ్లేది లేదని తృప్తి పట్టుబడుతున్నారు. కేరళ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, వారు తమకు భద్రత కల్పిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. మండల పూజ నిమిత్తం శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శుక్రవారం సాయంత్రం తెరుచుకోనుంది.
శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
RELATED ARTICLES