రామజన్మభూమిబాబ్రీమసీదు స్థల వివాదం కేసుపై సుప్రీంకోర్టు ఈనెల 29వ తేదీన రెగ్యులర్ విచారణ ప్రారంభించకపోవటం హిందూత్వ దళాలకు ఆగ్రహం తెప్పించటంలో ఆశ్చర్యం లేదు. 2.77 ఎకరాల వివాద స్థలాన్ని హిందూ సంస్థలకు కేటాయించి రామాలయ నిర్మాణాన్ని సుగమం చేసే నిమిత్తం నరేంద్రమోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని, పార్లమెంటు శీతాకాల సమావేశంలో చట్టం చేయాలని ఆర్ విహెచ్ మఠాధిపతు ల్లో కొందరు, శివసేన డిమాండ్ చేస్తున్నాయి. బిజెపి నాయకులు నోరు మెదపక పోయినా ఆర్డినెన్స్ కొరకు అంతర్గతంగా కొందరు ఒత్తిడి చేస్తున్నారు. తక్షణా వశ్యకమని భావించిన ఏ అంశంపైనైనా ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే అయోధ్య వివాదం హిందూత్వ వాదులకు భావో ద్వేగ సమస్యే అయినప్పటికీ, సుప్రీంకోర్టు ముందున్న కేసు స్థల వివా దానికి సంబంధించిన సివిల్ కేసు. అందువల్ల ఇది మోడీ ప్రభుత్వానికి సంకట సమస్య. సంయమనంతో ఆలోచిస్తుందా, దుందుడుకుశక్తుల ఒత్తిడికి లొంగు తుందా? ఆర్డినెన్స్ జారీ చేసినా అది న్యాయపరీక్షకు నిలవదని నిపుణుల అభిప్రాయం.
బిజెపి ఏకపక్ష మెజారిటీ కలిగిన లోక్ నరేంద్రమోడీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లు పరిపాలన పూర్తిచేసుకుని సార్వత్రిక ఎన్నికలకు చేరువవుతున్న సమయంలో రామాలయ సమస్య తెరపైకి రావటంలో ఉద్దేశాలు స్పష్టం. ఇంతకాలం చట్టంకొరకు డిమాండ్ చేయని శక్తులు ఇప్పుడు గొంతెత్తటం ఊహించదగిందే. రామాలయ సమస్యను సజీవంగా ఉంచటం ద్వారా హిందూ మనోభావాలను ఓట్లుగా మలుచుకోవటం దీర్ఘకాలంగా బిజెపి, ఆర్ చేస్తున్న పనే. ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఈ పర్యాయం వారు భావించి ఉండవచ్చు. వివాదస్థలాన్ని కక్షిదారులైన సున్నీ వక్ఫ్ నిర్మోహి అఖారా, రాంలాల మధ్య సమానంగా విభజిస్తూ 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేసిన అప్పీళ్లు సుప్రీంకోర్టు ముందున్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా (ప్రస్తుతం రిటైర్డ్) బెంచి గత సంవత్సరం డిసెంబర్ 5న విచారణ చేపట్టింది. ఆ విచారణ క్రమంలో, ‘ఇస్లాం మతా చారాల ఆచరణలో మసీదు తప్పనిసరి భాగం కాదు, ముస్లింలు ఎక్కడైనా, బహిరంగ ప్రదేశంలో సైతం ప్రార్థన చేయవచ్చు’ అని 1994లో డాక్టర్ ఇస్మాయిల్ ఫరూఖీ కేసు తీర్పులో ఐదుగురు జడ్జీల రాజ్యాంగధర్మాసనం చేసిన వ్యాఖ్యను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని ఇస్లామిక్ సంస్థలు, కొందరు వ్యక్తులు కోరారు. దానిపై సెప్టెంబర్ 27 న తీర్పు చెప్పిన ధర్మాసనంలో ఇద్దరుజస్టిస్ మిశ్రా, అశోక్ భూషణ్ ఆ విజ్ఞప్తిని తిరస్కరించగా, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ విభేదించారు. ఆయోధ్య స్థల వివాద కేసును అక్టోబర్ 29 నుంచి సుప్రీంకోర్టు విచారిస్తుందని ఆ మెజారిటీ తీర్పు చివర చెప్పారు. దానివల్ల అక్టోబర్ 29 నుంచి రోజువారీ విచారణ చేబడతారని, త్వరలో తీర్పు వస్తుందని హిందూత్వవాదులు ఆశించారు.
అయితే కొత్త ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి బెంచి సోమవారం కేసును చేబట్టి జనవరిలో బెంచి ఏర్పాటవుతుందని, కేసు విచారణ ఎప్పుడు చేబట్టేది జనవరిలోనా లేక మార్చిఏప్రిల్ అనేది ఆ బెంచి నిర్ణయిస్తుందని ప్రకటించటం ఆ శక్తులకు పిడుగుపాటు అయింది. ఎన్నికలకు ముందు తీర్పురాదని తేలటంతో ఆగ్రహోదగ్రులవుతున్నారు. తీర్పుగనుక వస్తే హిందూ సమాజాన్ని మొత్తంగా ఉత్సాహపరచవచ్చని, దానిమాటున మోడీ ప్రభుత్వంపై కనిపిస్తున్న వ్యతిరేకతనంతా అధిగమించి సునాయాసంగా ఎన్నికల్లో గెలవవచ్చని వారు భావించి ఉంటారు.
సమాజంలో భావోద్వేగాలు లేని ప్రశాంత పరిస్థితుల్లో సున్నితమైన ఈ వివాదంపై విచారణ చేబట్టాలని ప్రధాన న్యాయమూర్తి భావించి ఉండవచ్చు. ఎన్నికలకుముందు తమ తీర్పు ఏ విధంగా ఉన్నప్పటికీ అది ఒక రాజకీయ పార్టీకి ఉపకరించవచ్చని భావించి ఉండవచ్చు. ఈ సంవత్సరం ఆలయ నిర్మాణం చేపట్టి తీరుతామని కొంతకాలంగా యుపి ముఖ్యమంత్రి ఆదిత్య నాధ్, ఆర్ అధినేత మోహన్ భగవత్ తదితరులు ప్రకటనలు చేస్తున్నారు. రాజ్యాంగంకన్నా మత విశ్వాసాలు మిన్న అనే ధిక్కార ధోరణిని వారు ప్రదర్శించటాన్ని శబరిమల అయ్యప్ప ఆలయ వివాదంలో మనం చూస్తున్నాం. రామజన్మభూమి అనేది కూడా మత విశ్వాసమే. ప్రజాస్వామ్యం లో రాజ్యాంగం మిన్న. మతవివాదాలు దేశాన్ని వెనక్కి నడిపిస్తాయని గ్రహించాలి. కోర్టు తీర్పును శిరసావహించటానికి తాము సిద్ధంగా ఉన్నామని రామజన్మభూమి ప్రధాన పూజారి సత్యేంద్రదాస్, సున్నీల తరఫు వ్యాజ్యందారు ఇక్బాల్ అన్సారీ విలువైన మాట చెప్పారు. అది అందరికీ శిరోధార్యం.
ఆర్డినెన్స్ రూటు అవాంఛనీయం
RELATED ARTICLES