శ్రీలంక రాజకీయాధికారంలో మిత్రులు శత్రువులయ్యారు, శత్రువులు మిత్రులయ్యారు. ఈ ఆకస్మిక నాటకీయ పరిణామంలో అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన యుఎన్ నాయకుడు రనిల్ విక్రంసింఘెను ప్రధానమంత్రి పదవినుంచి తొలగించారు. తన ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్షె చేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాజపక్షె ప్రభుత్వంలో ఆరోగ్యమంత్రిగా పనిచేసిన సిరిసేన 2015లో అధ్యక్ష ఎన్నికలకు ముందు బయటకువచ్చి ఆ ఎన్నికల్లో రాజపక్షెను ఓడించి యుఎన్ చేయి కలిపి ‘జాతీయ ఐక్యత ప్రభుత్వం’ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని విక్రంసింఘె మధ్య విభేదాల్లో విదేశాంగవిధానం కూడా ఒక ముఖ్యాంశం. విక్రంసింఘె భారత్ దగ్గర. కాగా చైనాకు సన్నిహితుడైన రాజపక్షెను ప్రధానిని చేయటమంటే శిరిసేన కూడా అటే మొగ్గినట్లు భావించాల్సి ఉంటుంది. తనను, మాజీ రక్షణమంత్రి, రాజపక్షె సోదరుడు గోటభయ రాజపక్షెను హత్యచేయటానికి కుట్ర జరిగిందన్న ఆరోపణను విక్రంసింఘె సీరియస్ తీసుకోలేదన్న భావన సిరిసేనలో ఉంది. ఆ కుట్రవెనుక భారత్ ఏజంట్ల పాత్ర ఉందని ఆయన ఆరోపించినట్లు వార్తలు రాగా ఆయన స్వయంగా ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేసి ఆ వార్తను ఖండించారు. ఏమైనా శ్రీలంక పరిణామాలను భారతప్రభుత్వం జాగ్రత్తగా గమనించాల్సి ఉంది.