కశ్మీర్ సమస్య పరిష్కారంలో పాకిస్థాన్ పేరెత్తే రాష్ట్ర రాజకీయ పార్టీలకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఎర్రగీతగీశారు. అది రెండు దేశాల మధ్య సమస్య రెండు ప్రభుత్వాలు చూసుకుంటాయి, దాంతో మీకేం పని అంటున్నాడు. కశ్మీర్ లోయలో ప్రధాన రాజకీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపిల నుద్దేశించి “భారతపాకిస్థాన్ శాంతి చర్చల గూర్చి మాట్లాడే హక్కు ఈ పార్టీలకు లేదు. అది రెండు దేశాల ప్రభుత్వాల సమస్య. అవి ఇరుగుపొరుగు దేశాలైనందున చర్చలు జరుగుతాయి. అయితే ఇక్కడి రాజకీయ పార్టీలు సంభాషణల క్రమంలోకి పాకిస్థాన్ సమస్యను తీసుకురావటం మాకు (బిజెపివారికి కావచ్చు) అప్పుడు, ఇప్పుడు ఆమోదయోగ్యంకాదు” అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేర్పాటువాద సంస్థ అయిన హురియత్ మాట్లాడే పనే లేదన్నారు. “వారు (హురియత్ నాయకులు) పాకిస్థాన్ అడగకుండా మరుగుదొడ్డికి కూడా పోరు. వారు పాకిస్థాన్ పక్కనపెట్టేవరకు వారితో చర్చలుండవు” అని ప్రకటించారు. ఇది అహంకారపూరిత వైఖరి.
భారతపాకిస్థాన్ శాంతికి, కశ్మీర్ ప్రశాంతతకు గల అవినాభావ సంబంధం ప్రపంచానికంతకూ తెలుసు. అదొక భావోద్వేగ సంబంధం. గత ప్రభుత్వాలన్నీ దీన్ని గ్రహించాయి. కశ్మీర్ సమస్య సహా అన్ని సమస్యలను పాకిస్థాన్ చర్చించటానికి అంగీకరించాయి. పలు సందర్భాల్లో చర్చలు జరిపాయి కూడా. కశ్మీర్ అంతర్గత సమస్యలుత్పన్నమైనప్పుడు అన్ని రాజకీయ పక్షాలతో చర్చలు జరపాలని ఆదేశించాయి. గవర్నర్ పాలన ఉన్నప్పుడు మధ్యవర్తులను నియమించాయి. అంతేగాని పాకిస్థాన్ పేరెత్తితే ఏ గవర్నరూ చిర్రెత్తిపోలేదు. మాలిక్ వైఖరి కశ్మీర్ సమస్యల పరిష్కారంకన్నా బల ప్రయోగంతో ప్రజలను అణచివేసే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ విధానం అమలు చేయటం కావచ్చు. నరేంద్రమోడీ ప్రభుత్వం కూడా పాకిస్థాన్ వ్యవహరించటంలో ఆకర్షవికర్ష విధానం అనుసరిస్తున్నది. పాకిస్థాన్ గడ్డనుంచి సాగుతున్న సీమాంతర టెర్రరిజం మనదేశానికి పెద్ద బెడదే. దాన్ని అరికట్టటానికి అంతర్జాతీయ ఒత్తిడి తేవటం, మిలటరీ మార్గంతో పాటు చర్చలు అవసరం. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనకుండా అంతర్గత మిలిటెన్సీని అరికట్టటం సాధ్యంకాదని అనుభవం నేర్పుతున్నది. అందువల్ల కశ్మీర్ పార్టీలతో చర్చించేటప్పుడు విధిగా పాకిస్థాన్ అంశం వస్తుంది. గవర్నర్ కాదంటే అది పోదు. ఆచరణాత్మక వాదిగా పనిచేయటం ముఖ్యం.
కశ్మీర్ గవర్నర్ వితండం
RELATED ARTICLES