HomeOpinionEditorialలైంగిక వేధింపులపై కమిటీ

లైంగిక వేధింపులపై కమిటీ

కేంద్రప్రభుత్వం అనేక విషయాల్లోవలె ‘మీ టూ’ ఉద్యమం గూర్చీ ఆలస్యం గా స్పందించింది. పని ప్రదేశాల్లో బాస్ ఉన్నవారు తమపై పాల్పడిన లైంగిక వేధింపుల గూర్చి కొన్ని రంగాల్లోని మహిళలు గళం విప్పటమే ‘మీ టూ’ ఉద్యమం. అది ఇదీ ఏమని అన్ని రంగాల్లో మహిళలను లోబరుచుకునే, వేధించే పురుషపుంగవులున్నప్పటికీ ఇప్పుడు ప్రధానంగా మీడియా, సినీరంగంలోని మహిళలు తామనుభవించిన అవమానాలను ధైర్యంగా వెల్లడిచేస్తున్నారు. దీని పర్యవసానంగా కేంద్ర సహాయమంత్రి ఎంజె అక్బర్, పలువురు జర్నలిస్టు ప్రముఖులు పదవులు కోల్పోయారు. అకడమిక్ రంగంలో కూడా బాధితులు నోరువిప్పుతున్నారు. కొందరు ప్రముఖులు తమపై ఆరోపణలు చేసిన బాధితులపై పరువునష్టం దావాలు వేస్తున్నారు. అయినా రోజు ఎవరో ఒకరిపై ఆరోపణలు సోషల్ మీడియాలో, పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. కొందరు ప్రముఖులు ముఖ్యంగా సినీరంగంనుంచి లైంగిక వేధింపులను ఖండిస్తున్నారు. మీటూ ఉద్యమాన్ని సమర్థిస్తున్నారు. అయితే పనిప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధానికి తాము తెచ్చిన చట్టం పర్యవసానమే మీ టూ అని ఉద్యమ ఖ్యాతిని తన ఖాతాలో వేసుకోజూసిన కేంద్ర మహిళలు, బాలల సంక్షేమ శాఖామంత్రి మనేకాగాంధీకి ప్రభుత్వంలో కదలిక తేవటానికి ఎక్కువ సమయమే పట్టింది. అక్బర్ రాజీనామా చేయించటానికి ప్రభుత్వం తటపటాయింపు వైఖరే దాని సున్నిత రాహిత్యానికి నిదర్శనం. ఏమైతేనేం, లైంగిక వేధింపుల సమస్యను పరిశీలించేందుకు ప్రభుత్వం హోంమంత్రి రాజ్ అధ్యక్షతన ఎట్టకేలకు నలుగురు మంత్రులతో ఒక కమిటీని నియమించింది. చట్టాలను మరింత కట్టుదిట్టం చేయటం, పని ప్రదేశాల్లో యాజమాన్యాలు ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయటమేకాక వాటిని పనిచేయించటం, దోషులకు విధించాల్సిన శిక్షలు వగైరాలను కమిటీ మూడునెలల్లో సిఫారసు చేస్తుంది. అయితే ‘మీటూ’ ఉద్యమంలాగా దుర్వర్తనులు, దుష్టులైన కొందరు మగరాయుళ్లను వ్రేలెత్తి చూపి అవమానం పాల్జేస్తే మంచిదేగాని ఫిర్యాదు లేకుండా చట్టం చర్యలు తీసుకోజాలదు. ఫిర్యాదు చేయాలంటే ఈ పురుషాధిక్య సమాజంలో బాధిత మహిళకు ధైర్యమే కాదు, ఇంటబయట అండకావాలి. దన్నుగా నిలిచే చేతులు కావాలి. ఇది చేకూరటం సునాయాసం కాదు. అందువల్ల పని ప్రదేశాల్లో కాగితంపైగాక చురుకుగా పనిచేసే కమిటీలు కావాలి. పని ప్రదేశాల్లోనేకాదు, వెలుపల కూడా స్త్రీలను వేధించేవారిని శిక్షించేందుకుగల చట్టాలను కట్టుదిట్టం చేయాలి. నిర్భయ గ్యాంగ్ హత్య సందర్భంలో నియమించిన జస్టిస్ వర్మ కమిటీ ప్రతిచోట మహిళల రక్షణకు అనేక సిఫారసులు చేసింది. అవి కాగితానికే పరిమితమైనాయి. లింగ సమానత్వం గూర్చి అంతర్జాతీయ చట్టాలు ఘోషిస్తున్నాయి. మన నాయకులు ఆయా సందర్భాన్నిబట్టి ఆ ప్రవచనం వినిపిస్తుంటారు. కాని ఆచరణలో పెట్టటంలో అడుగు ముందుకు పడదు. పని ప్రదేశాల్లోనేకాదు, వెలుపల సమాజంలో అతి పిన్నవయస్కుల నుంచి వృద్ధ మహిళలపై సైతం అఘాయిత్యా లు జరుగుతున్నాయి. కాబట్టి నేరస్థులను శిక్షించేందుకు చట్టాలను కట్టుదిట్టం చేయాలి, అంతే పకడ్బందీగా అమలు జరపాలి. మంత్రివర్గ ఉపసంఘం అన్ని కోణాలనుంచి అధ్యయనం చేయాలి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments