తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసిన దినకరన్(శశికళ) వర్గానికి చెందిన 18 మంది శాసనసభ్యులు అనర్హతకు పాత్రులేనని మద్రాసు హైకోర్టు ఎట్టకేలకు గురువారం తీర్పు చెప్పటంతో పాలక ఎఐఎడిఎంకె (అమ్మ) ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఈ 18 మంది సభ్యత్వం రద్దు, ఇరువురు సభ్యుల మృతివల్ల ఖాళీ అయిన 2 స్థానాల కారణంగా మొత్తం సభ సంఖ్యాబలం తగ్గటం వల్ల ఇపిఎస్, ఒపిఎస్ ప్రభుత్వం మెజారిటీ నిలబడింది. ఈ 20 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో! అందువల్ల తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది.
ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం అనేక మలుపులు తిరిగిన రాజకీయ పరిణామాల్లో శశికళ జైలుకు వెళ్లిన తదుపరి ఆమె మేనల్లుడు దినకరన్ నాయకత్వంలో ఏర్పడిన గ్రూపులో 19 మంది శాసనసభ్యులు చేరారు. వారు గవర్నర్ కలిసి ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామి నాయకత్వంలో తమకు విశ్వాసం లేదని పిటిషన్ ఇచ్చారు. వారిలో ఒకరు వెనక్కుతగ్గగా 18 మంది సభ్యత్వాన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ రద్దు చేశారు. వారు హైకోర్టులో పిటిషన్ వేయగా ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు విరుద్ధమైన తీర్పులిచ్చారు. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జస్టిస్ సాంబశివరావుతో ధర్మాసనం ఏర్పాటు చేసింది. స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన గురువారం తీర్పు వెలువరించారు. దినకరన్ వర్గం దీనిపై సుప్రీం కోర్టుకు వెళుతుందా లేక ఉప ఎన్నికలను ఎంచుకుంటుందా? వేచిచూడాలి. తమ పార్టీకి పట్టులేని తమిళనాడులో అన్నా డిఎంకె ప్రభుత్వాన్ని నిలబెట్టి తమ ప్రాబల్యంకింద ఉంచుకునేందుకు మోడీషా ద్వయం శక్తియుక్తులన్నీ ప్రయోగించినప్పటికీ రాజకీయ అనిశ్చితికి మాత్రం తెరపడలేదు.
ఊపిరిపీల్చుకున్న తమిళ ప్రభుత్వం
RELATED ARTICLES