శబ్ద కాలుష్యం అరికట్టటం, ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణను పరిరక్షించటం ఎంతైనా అవసరం. వాయు, జల కాలుష్యంతోపాటు ధ్వని కాలుష్యం మనుషు లకే కాదు, జంతువులకూ హానికరం. పండుగలు, వివాహాలు, విజయోత్స వాలతోపాటు అంతిమయాత్రల్లో సైతం టపాకాయలు పేలుతుంటాయి, తారాజువ్వలు గగనంలో వెలుగులు వెదజల్లుతుంటాయి. ధ్వనికాలుష్య కారకాల్లో అవి ఒక భాగం. దేవుడి ఉత్సవాలు, ఊరేగింపులపుడు బాణాసంచా పేలుళ్లు పెద్ద ఆకర్షణ. శాస్త్రీయజ్ఞానం చెవికెక్కించుకోకుండా అట్టహాసాలు, ఆడంబర ప్రదర్శన కోసం టపాసులు కాల్చే సమాజంలో వాటిపై విధి నిషేధాలను జనాలు పాటిస్తారా? అయినా చెప్పగా చెప్పగా చెవికెక్కకపోదు, చైతన్యం పెరగకపోదు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాన్ని ఆ దృష్టితోనే చూడవలసి ఉంటుంది. దీపావళి, ఇతర పండుగల రోజున రాత్రి 8-10 గంటల మధ్యనే టపాసులు కాల్చాలని, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంలో రాత్రి 11.55 గంటలనుంచి 12.30 వరకు 35 నిముషాలు మాత్రమే కాల్చాలని జస్టిస్ ఎ.కె.సిక్రి, అశోక్ భూషణ్ కూడిన ధర్మాసనం ఉత్తర్వు చేసింది. టపాసుల ఆన్ విక్రయాలను పూర్తిగా నిషేధించింది. టపాసుల్లో బేరియం సాల్ట్ వరుసగా పేలేమందుగుండును నిషేధించింది. పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ (పెసొ) టపాసులన్నిటినీ పరీక్షించి అనుమతు లు మంజూరుచేయాలని ఆదేశించిన ధర్మాసనం, టపాసుల్లో ఉపయోగించే మిశ్రమంలో నిషిద్ధ రసాయనాలున్నాయేమో పరిశీలించి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని పెసోను ఆదేశించింది. ఉల్లంఘనలు జరగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో స్టేషన్ అధికారిపై కోర్టు ధిక్కార నేరం మోపుతామని హెచ్చరించింది. పొగరాని టపాసులు, మెరుగుపరిచిన టపాసులతో పండగ చేసుకోండి ఆరోగ్యాలు కాపాడుకోండి అన్నది సుప్రీంకోర్టు సదుద్దేశం.
సుప్రీంకోర్టు ఆదేశం ఆహ్వానించదగింది, ఆవశ్యకమైందీ అయినప్పటికీ ప్రజలు దాన్ని ఆచరించేటట్లు చేయటమే కష్టం. దీపావళి పక్షం రోజుల్లోకి వచ్చింది. మందుగుండు సామాగ్రి ఉత్పత్తి దాదాపుగా పూర్తయింది. దేశమంతటా పంపిణీదారులకు చేరుతోంది. టపాసుల తయారీదశకు ముందునుంచే అధికారులు ఉత్పత్తిదారులను హెచ్చరించి, మిశ్రమాలను పరీక్షించి అనుమతులు మంజూరుచేస్తే ఆరోగ్యానికి హానికరమైన టపాసులు మార్కెట్ రావు. అటువంటి వాటిని కాల్చే అవకాశం ప్రజలకు లభించదు. ఆరోగ్యానికి హానికరమైన రసాయనాల సమ్మిళిత టపాసులను నివారించటాన్ని ప్రజలు కూడా హర్షిస్తారు. అందుకు ముందునుంచీ చర్యలు లేకుండా ఇప్పుడు ఆంక్షలంటే వ్యాపారులు విపరీతంగా నష్టపోతారు, సరకు లభ్యంకాకపోతే ప్రజలు ఆగ్రహిస్తారు.
హిందూ పౌరాణిక గాథతో పెనవేసుకుని ఆబాలగోపాలం ఆనందంగా జరుపుకునే దీపావళిలో టపాసులు విడదీయరాని భాగం. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్షంతో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశం అమలు జరగని వాటిలో ఒకటి కాకూడదు. ఈ సంవత్సరానికి కొన్ని సడలింపులిచ్చి, వచ్చే సంవత్సరానికి టపాసుల తయారీ దశనుంచే నియంత్రణలు అమలు చేసేటట్లు సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. పాపం! పోలీసు స్టేషన్ అధికారి ఎందరిని నియంత్రించగలడు, ఎందరిపై కేసులు పెట్టగలడు అంతా సక్రమంగా జరిగిందని రిపోర్టు రాయడం తప్ప!
టపాసులపై ఆంక్షలు
RELATED ARTICLES