సుప్రీంకోర్టు తీర్పు దన్నుగా శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహనా ఫాతిమాను బిఎస్ బదిలీచేసి వివక్ష ప్రదర్శించింది. ఆమె కొచ్చిలోని చోట్ జెట్టీ బ్రాంచిలో టెలీకం టెక్నీషియన్ ఉద్యోగం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన లింగ సమానత్వాన్ని వక్కాణిస్తూ వయోవివక్షలేకుండా మహిళలను అయ్యప్పస్వామి ఆలయప్రవేశానికి అనుమతించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పిన దరిమిలా, గత వారం రోజుల్లో కొందరు మహిళలు దర్శనానికి వెళ్లగా, ఆలయ సాంప్రదాయ పరిరక్షణే మిన్న అంటూ అనేకమంది పురుష భక్తులు అటకాయించటం తెలిసిందే. పోలీసు రక్షణతో పంబనుంచి ఆలయ సన్నిధానం వరకు వెళ్లిన మహిళల్లో ఫాతిమా ఒకరు. ఈ చర్యకుగాను ముస్లిం మతపెద్దలు ఆమెను మతం నుంచి వెలివేశారు. కొందరు దుండగులు ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. సోషల్ మీడియాలో పోస్టుకుగాను పతనంతిట్ట పోలీసులు ఆమెపై కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడేమో ఉద్యోగ యజమాని అయిన బిఎస్ బదిలీ చేసింది. ఇంకా పోస్టింగ్ ఎక్కడో నిర్ణయించలేదు. స్త్రీ సమానత్వాన్ని ధిక్కరిస్తున్న ఈ నిర్ణయం వివక్షాపూర్వకం, కక్ష సాధింపుగా ఉంది.