ప్రజాపక్షం/హైదరాబాద్/రంగారెడ్డి
ఒకప్పుడు ఇంట్లో చొరబడి దోపిడీలు చేసేవారని, ప్రస్తుతం దొంగలు ఎక్కడో ఉండి మన సొమ్మును దొంగిలిస్తున్నారని, నేరాల శైలి మారుతోందని, ఈ మార్పులకనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. నేరాల విధానం వేగంగా మారుతోందని, సమాజంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని రకాల ప్రణాళికలనూ సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఫేక్ న్యూస్,ఆర్థిక నేరాలను కూడా నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణను ‘సైబర్ సేఫ్ స్టేట్’ గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దామని సిఎం పిలుపునిచ్చారు. హైదరాబాద్ హెచ్ తెలంగాణ ‘సైబర్ సెక్యూరిటీ బ్యూరో’(టిజిసిఎస్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ‘షీల్డ్ -2025’ కాన్ సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డిజిపి డాక్టర్ జితేందర్,టిజిసిఎస్ ఇన్ షికాగోయల్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి,సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీ రమేశ్ ఖాజా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ సేఫ్టి విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ నిలపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. డిజిటల్ సేఫ్టీ, భవిష్యత్తుపైన చర్చించేందుకు ‘షీల్డ్ 2025ని’ నిర్వహించుకున్నట్లు వెల్లడించారు.
సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోసం ‘ఎకో సిస్టమ్ వ్యవస్థ’ను ఏర్పాటు చేసేందుకు, ప్రభుత్వ నిపుణులు, ఐటి సంస్థలతో కలిసి పనిచేయడానికి,అన్ని రకాల వనరులనూ సమకూరుస్తోందన్నారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ మార్చాలని సూచించారు. దేశంలో సైబర్ నేరగాళ్లు గత ఏడాది రూ. 22,812 కోట్లు దోచుకున్నట్టు ఒక అంచనా ఉన్నదని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు, మన పౌరులకు ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో ఫేక్ న్యూస్ అనేది మరో ప్రధానమైన ముప్పుగా మారిందని, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో సమాజంలో గందరగోళం ఏర్పడుతుందని సిఎం తెలిపారు. 24/7 సైబర్ హెల్ప్ 1930 నంబర్ అందరికీ షేర్ చేయాలని ఆయన సూచించారు. పూర్తిస్థాయిలో పనిచేసే సైబర్ సెక్యూరిటీ బ్యూరో, పౌరులను రక్షించడానికి అంకితమైన సైబర్ హెల్ప్ ఉన్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని అన్నారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఏడు కొత్త ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని, సైబర్ నేరాగాళ్లు దోచుకున్న సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు. మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సిఎం అభినందించారు. మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ త్వరలోనే కొత్త సెక్యూరిటీ పాలసీని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. అభివృద్ది, సైబర్ ఈకో విధానానికి ప్రభుత్వం అనుకూలమైన విధానాలను తీసుకుంటుందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ ప్రారంభించామని, తద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సాంకేతికత ప్రజలకు ఉపయోగపడాలని శ్రీధర్ తెలిపారు.