ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,036 కోట్లు
14 రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ రూ.5,858.60 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) అడ్వాన్స్ నుంచి 14 రాష్ట్రాలకు హోంశాఖ నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు.. నష్టాన్ని అంచనా వేస్తూ ఇచ్చిన నివేదిక మేరకు తక్షణసాయంగా ఈ నిధులు కేటాయించింది. కేంద్ర బృందాల నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిధులు మంజూరు చేయనున్నట్లు హోంశాఖ పేర్కొంది. తెలంగాణకు రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లు మంజూరు చేసింది. అత్యధికంగా మహారాష్ట్రకు 1,492 కోట్ల వరద సాయం ప్రకటించింది. అసోంకు 716 కోట్లు, బీహార్ రూ. 655.60 కోట్లు, గుజరాత్ రూ. 600 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ రూ. 189.20 కోట్లు, కేరళ రూ. 145.60 కోట్లు), మణిపుర్ రూ. 50 కోట్లు, మిజోరం రూ. 21.60 కోట్లు నాగాలాండ్ రూ. 19.20 కోట్లు, సిక్కిం రూ. 23.60 కోట్లు, త్రిపుర రూ. 25 కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ. 468 కోట్లు కేటాయించారు. నైరుతి రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల వల్ల ఆ రాష్ట్రాలు నష్టపోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో మోడీ ప్రభుత్వం ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు ప్రకృతి వైపరీత్యాల బాధిత రాష్ట్రాలతో భుజం భుజం కలిపి సాగుతోందని ఆ ప్రకటన పేర్కొన్నది.