HomeNewsLatest Newsఅధిక వాటా

అధిక వాటా

సింగరేణి కార్మికులకు ఈ ప్రభుత్వంలోనే అధిక వాటా

గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంటే ఈసారి ఎక్కువే ఇచ్చారు
ఎఐటియుసి పోరాట ఫలితంగానే కార్మికులకు లాభాల్లో వాటా
కెటిఆర్‌ వ్యాఖ్యలు సరికాదు :  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

ప్రజాపక్షం/హైదరాబాద్‌
సింగరేణి లాభాలలో కార్మికులకు వాటా పంపిణీకి సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు విమర్శలు చేస్తూ సిపిఐ, ఎఐటియుసి బాధ్యత వహించాలని చేసిన వ్యాఖ్యలను సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తప్పుపట్టారు. సింగరేణి లాభాల విషయంలో గతంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమి చేసిందో, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే చేసిందని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాక్షికంగా కార్మికులకు వాటాలను పంచారని, ఈ ప్రభుత్వం కార్మికులకు అదనంగా వాటాను ఇచ్చిందని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా, కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్‌.బాలమల్లేష్‌, సింగరేణిలో గు ర్తింపు సంఘం సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యతో కలిసి కూనంనేని సాంబశివరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ గత ఆర్థిక ఏడాది 2023-24 సింగరేణి పూర్తి లాభం రూ.4701 కోట్లు కాగా రూ.2412 కోట్ల నికర లాభాల నుండి 33 శాతాన్ని కార్మికులకు ఇచ్చారని అన్నారు. అయితే కెసిఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుండి కూడా ఇదే ప్రక్రియ జరుగుతున్నదని అన్నారు. “టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2018-19 మొత్తం లాభాలు రూ.2822.48 కోట్లు కాగా నికర లాభం రూ.1822.91 కోట్ల నుండి కార్మికులకు వాటా ఇచ్చారు. 2019-20 లో మొత్తం లాభాలు రూ.2857.47 కోట్లు కాగా నికర లాభం రూ.1003.52 కోట్ల నికర లాభాల నుండి మాత్రమే వాటా ఇచ్చారు. 2020-21 మొత్తం లాభాలు రూ.777.26 కోట్లు ఉంటే నికర లాభం రూ.441.59 కోట్లు నికర లాభాల నుండి కార్మికులకు వాటా ఇచ్చారు. 2021-22 మొత్తం లాభాలు రూ.1684.72 కోట్లు ఉంటే నికర లాభాలు రూ.1193.21 కోట్ల నికర లాభాల నుండి కార్మికులకు వాటా ఇచ్చారు. 2022-23 మొత్తం లాభాలు రూ.3074.36 కోట్లు ఉంటే నికర లాభాలు రూ.2222.46 కోట్ల నికర లాభాల నుండి మాత్రమే కార్మికులకు వాటా ఇచ్చారు” అని సాంబశివరావు వివరించారు. ఆనాడు కెసిఆర్‌ ప్రభుత్వం కూడా మొత్తం లాభాలలో కాకుండా నికర లాభాల నుండి మాత్రమే సింగరేణి కార్మికులకు వాటా ఇచ్చారని ఆయన తెలిపారు. ఏనాడు కూడా పూర్తి లాభాలలో కెసిఆర్‌ ఇవ్వలేదని, పాక్షికంగానే ఇచ్చారని ఆయన విమర్శించారు. సింగరేణిలో ఎనిమిదన్నర సంవత్సరాల పాటు ఒకరినే ఎందుకు సిఎండిగా నియమించారని, సింగరేణికి వచ్చిన ఆదాయాన్ని ఎక్కడికి మళ్ళించారని, కనీసం ఇల్లు లేని కార్మికులకు సొంత ఇల్లు కట్టించారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెతున్న వున్న రోజుల్లో లక్ష మంది కార్మికులు సింగరేణిలో ఉండేవిధంగా చేస్తానని ప్రకటించిన కెసిఆర్‌, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 60 వేల మంది కార్మికులకు 40 వేల మంది కార్మికులు మాత్రమే మిగిలారని అన్నారు. కొత్తగా బొగ్గుబావులు తేకపోగా కోయగూడెం, సత్తుపల్లి, శ్రీరాంపూర్‌ బొగ్గుబావులను ప్రైవేట్‌పరం చేశారని సాంబశివరావు ఆగ్ర హం వ్యక్తం చేశారు. 2000 సంవత్సరంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనియన్‌కు అధ్యక్షులుగా ఉన్న కెఎల్‌ మహేంద్ర చొరవతో లాభాలలో 10 శాతం సాధించామని, ఇప్పుడు అది 33 శాతంవరకు రావడం ఎఐటియుసి పోరాట ఫలితమని సాంబశివరావు అన్నారు. 80 ఏండ్ల చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్మికుల ప్రయోజనాలు, హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని కూనంనేని అన్నారు. సిఎండిపై విచారణ చేపట్టాలని గత బిఆర్‌స్‌, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూడా కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సంస్థకు వచ్చిన పూర్తి లాభాల్లో కొంత భవిష్యత్‌ ప్రణాళిక నిమ్తితం నిధులను తీసిపెట్టామని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం ఆ విషయాన్ని కూడా చెప్పలేదన్నారు. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న 30వేల కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించాలని, రేషన్‌ కార్డులతో పాటు ఇంటి సౌకర్యాన్ని కల్పించాలని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొడుకుకు ఉద్యోగం ఉన్నదనే నెపంతో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన కార్మికులకు ప్రభుత్వ పెన్షన్‌ ఇవ్వడంలేదని, వారికి కేవలం రూ.2 నుంచి రూ.3 వేల పెన్షన్‌ మాత్రమే వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బిఆర్‌ఎస్‌ హయాంలో పూర్తి వాటాలు పంచారా? : సీతారామయ్య
సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను కార్మికులకు గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా పంపిణీ చేసి ఉంటే, తాము కూడా ప్రస్తుత లాభాలను పూర్తిగా కార్మికుల పంపిణీ చేసే బాధ్యతను తీసుకుంటామని, అలా చేయకపోతే బిఆర్‌ఎస్‌ ఏమి బాధ్యత తీసుకుంటుందని వాసిరెడ్డి సీతారామయ్య నిలదీశారు. సింగరేణి గుర్తింపు సంఘంగా ఎఐటియుసికి మంచి ఆదరణ లభిస్తుంటే చూసి ఓర్వలేకనే కెటిఆర్‌ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార గుర్తింపు సంఘంగా ఎఐటియుసి గెలిచినందుకే కొత్తగా ఈసారి కాంట్రాక్టు కార్మికులకు రూ.5వేల వాటాను పంపిణీ చేయించామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments