HomeNewsBreaking Newsస్కిల్‌ యూనివర్సిటీకి రూ.100 కోట్లు

స్కిల్‌ యూనివర్సిటీకి రూ.100 కోట్లు

  • 150 ఎకరాల భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలి
     పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలి.  కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు ముందుకు రావాలి బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి

ప్రజాపక్షం / హైదరాబాద్‌
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున యూనివర్సిటీకి 150 ఎకరాల భూమితో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్‌ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటుకు, భవనాల నిర్మాణానికి ముందుకు రావాలని సిఎం పిలుపునిచ్చారు. తమ కంపెనీల పేర్లను లేదా దాతల పేర్లను ఈ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు. వీలైనంత వేగంగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని, ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు ఛైర్మన్‌ మహీంద్రా ఆనంద్‌కు అప్పగిస్తున్నామని అన్నారు. ఈ రంగంలో అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న మహీంద్రా ఆనంద్‌ స్కిల్‌ యూనివర్సిటీకి తన బ్రాండ్‌ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకం ఉందని అన్నారు. తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం సచివాలయంలో సమావేశమయ్యారు. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి డి.శ్రీధర్‌బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, కో చైర్మన్‌ శ్రీనిరాజు, సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీష్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, సిఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బోర్డు సభ్యులు మనీష్‌ సభర్వాల్‌, సంజీవ్‌ బిక్చందానీ, ఎంఎం.మురుగప్పన్‌, డాక్టర్‌ కె.పి.కృష్ణన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్కిల్‌ యూనివర్సిటీ చేయాలనే తన ఆలోచనలతో పాటు భవిష్యత్తు ఆకాంక్షలను ఆయన యూనివర్సిటీ బోర్డుతో, రాష్ట్రంలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో పంచుకున్నారు. డిగ్రీలు, పిజి పట్టాలు ఉంటే సరిపోదని, ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన లక్షలాది మంది యువకులు ఒక ఉద్యోగం ఇప్పించండని తన వద్దకు వస్తున్నారని ముఖ్యమంత్రి తనకు ఎదురైన కొన్ని అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఏటేటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పిజిలు, ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తున్నారని, కానీ అందరూ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని అన్నారు. మరోవైపు పరిశ్రమల అవసరాలకు సరిపడే మానవ వనరుల కొరత ఉందని చెప్పారు. ఈ అంతరాన్ని తొలిగించేందుకు స్కిల్‌ యూనివర్సిటీ నెలకొల్పాలనే ఆలోచన చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అందరికీ సరిపడేన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని, వివిధ రంగాలతో పాటు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే యువత ఉపాధికి ఢోకా ఉండదని సిఎం చెప్పారు. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్‌ ఇండియా స్పోర్ట్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని చెప్పారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్‌ యూనివర్సిటీ నెలకొల్పి, 2028 ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్‌ మెడల్‌ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామని అన్నారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బందిలేదని, రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో వెయ్యి కోట్లు ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆర్థిక సహకారానికి మించి, రాష్ట్రంలోని అందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్యవేత్తలు ఆశించినంత చొరవ ప్రదర్శించాలని, తగిన భాగస్వామ్యం, బాధ్యతలను పంచుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు. ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనతో త్వరలోనే స్కిల్‌ యూనివర్సిటీ లో కొత్త కోర్సులు ప్రారంభమవటం ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణకు సత్తా ఉంది; ఆనంద్‌ మహీంద్రా
తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ప్రశంసించారు. మంచి విజన్‌ ఉన్న సమర్థ నాయకుడు సిఎం రేవంత్‌రెడ్డి అని కొనియాడారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్‌గా ఉండాలని సిఎం కోరగానే ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆనంద్‌ మహీంద్రా అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉందని ఆయన అభినందించారు. తెలంగాణలోనే అతి పెద్ద యుఎస్‌ కాన్సులేట్‌ ఉందని, ఎక్కువ మంది ఇక్కడి నుంచే అమెరికాకు వెళుతున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందనడంలో సందేహం లేదన్నారు.
వచ్చే నెల నుంచే కోర్సులు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్‌ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఈఎస్‌సిఐ)లో తాత్కాలికంగా కోర్సులను నిర్వహించనుంది. ముందుగా హెల్త్‌ కేర్‌, ఈ కామర్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ కోర్సులను ప్రారంభించనుంది. ఈ కోర్సుల నిర్వహణకు అపోలోతో పాటు ఎఐజి, లెన్స్‌ కార్ట్‌, ఫ్లిఫ్‌ కార్ట్‌, అమెజాన్‌, అల్కార్గో, ప్రొ కనెక్ట్‌, ఓ9 సొల్యూషన్స్‌ కంపెనీలు ముందుకొచ్చాయి. తొలి ఏడాది రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు యూనివర్సిటీ బోర్టు వెల్లడించింది.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments