సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం
దళిత, గిరిజనులు, మహిళలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
టిజి ఎంఎస్ఎంఇ 2024 పాలసీ ఆవిష్కరణ
పెండింగ్ సబ్సిడీ నిధులు విడుదల చేస్తాం : భట్టి
వన్ ట్రిలియన్ ఎకానమీ చేరుకోవడమే లక్ష్యం : శ్రీధర్‌బాబు
ప్రజాపక్షం / హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సంపదను పెంపొందించేందుకే ఎంఎస్ఎంఇ పాలసీ -2004ను తీసుకొచ్చామని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఇ)లను ప్రోత్సహిస్తామని, మహిళలు, దళిత, గిరిజనులకు పరిశ్రమలు పెట్టుకునేందుకు తగిన సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. ఎంఎస్ఎంఇ రంగంలో మహిళలకు 20 శాతం, అలాగే దళిత, గిరిజనులకు 5 శాతం తగ్గకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు, దళిత, గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుపడినట్లని అన్నారు. డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సిఐఐ, డిక్కీ తదితర వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో కలిసి ‘ తెలంగాణ ఎంఎస్ఎంఇ పాలసీ-2024’ను సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మాదాపూర్ శిల్పకళావేదికలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ఎంఎల్ఎంఈ లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక విధానాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పారిశ్రామిక విధానంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. దీనికి కొనసాగింపుగా తెలంగాణలో సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచనతో “ తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ-2024” ను రూపొందించడాన్ని సిఎం అభినంధించారు. ఐటి, ఫార్మా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని, ఈ క్రమంలో కోవిడ్‌కు ప్రపంచం అంతా వణికిపోతే తెలంగాణనే మూడు వ్యాక్సిన్ లు తయారీ చేసి ఇచ్చిందన్నారు. ఫార్మా రంగం అభివృద్ధిలో పరిశ్రమల శాఖ కృషి అమోఘమన్నారు. పరిశ్రమలకు పాలసీ డాక్యు మెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించబోదని, అందుకే ఎంఎస్ఎంఈ పాలసీ-2024 ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే,. కొత్త పాలసీని ముందుకు తీసుకెళతామని సిఎం భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు ఉండబోవని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించుకుంటూ పరిశ్రమలను అభివృద్ధి చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా రాష్ట అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదని సిఎం రేవంత్ వ్యాఖ్యానించారు. .రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలను తొలగించేందుకు తమ ప్రభుత్వం వెనక్కు తగ్గదని స్పష్టం చేశారు.
రూ.2400 కోట్లతో ఐటిఐల ఆధునీకరణ
ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడిన క్రమంలో రాష్ట్రంలోని 65 ఐటిఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు.టాటా ఇనిస్టిట్యూట్ తో కలిసి సంయుక్తంగా రూ.2400 కోట్లతో వాటిని ఆధునీకరిస్తున్నామని వివరించారు. యువతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను పూర్తి అధ్యయనం తరువాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటిని ఏర్పాటు చేశామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యువతకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు. యంగ్ ఇండియా యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తల నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్‌ఫండ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వీటిని యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసిందన్నారు.
వ్యవసాయాన్ని వదలొద్దు.. అగ్రికల్చర్ అనేది మన కల్చర్..
“ వ్యవసాయం అనేది పండుగ, దండుగ కాదు అనేదే మా ప్రభుత్వ నినాదం. రూ.18 వేల కోట్ల నిధులు విడుదల చేసి రైతుల రుణాలు తీర్చాం…
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అనేది వ్యవసాయం పండగనే కదా.. ” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం చేసే వాళ్లు వ్యవసాయం చేస్తూనే ఇతర కుటుంబ సభ్యులను ఉపాధి అవకాశాల వైపు మళ్లించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం రైతు కుటుంబానికి సరిపోవడంలేదన్నారు. మహిళలు, దళిత, గిరిజనులను ప్రోత్సహించి వ్యాపారాల్లో రాణించేలా చూద్దామన్నారు. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని , ఈ ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
మూసీకి ఇక మహర్ధశ
హైదరాబాద్‌లో మూసీ అంటే ఇకపై మురికి కూపం కాదని,. మూసీని మ్యాన్ మేడ్ వండర్‌గా తీర్చిదిద్ది మహర్దశను తేబోతున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామిక రంగాల్లో కోటీశ్వరులను చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇటు శిల్పారామంలోనూ స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మూడు ఎకరాల స్థలం కేటాయించామన్నారు. గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో నిర్వహణను మహిళల చేతుల్లో పెట్టామనీ, మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ కుట్టు పని బాధ్యతలు ఇచ్చామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. టైలర్లు కుట్టిన యూనిఫామ్ ధరను గత సర్కారు రూ.25 ఇవ్వగా దానిని తాము మహిళా సంఘాలకు అప్పగించి యూనిఫాం ధర రూ.75 కు పెంచి ఆడబిడ్డలను ఆర్ధికంగా ఆదుకుంటున్నామన్నారు. ఎంఎస్ఎంఈలు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తమ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు.
దశల వారీగా ఎంఎస్ఎంఈ పెండింగ్ సబ్సిడి నిధులు విడుదల : డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క
రాష్ట్రంలో దశల వారీగా ఎంఎస్ఎంఈ పెండింగ్ సబ్సిడి నిధులు విడుదల చేస్తామని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణల కోసం మంత్రి శ్రీధర్ బాబు నిత్యం శ్రమిస్తు వచ్చారన్నారు. గత ప్రభుత్వాలు అట్టహాసంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సబ్సిడీ ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రాబోయే రోజుల్లో వారిని ప్రోత్సహించేందుకు పెండింగ్ లో ఉన్న సుమారు రూ. 2000 కోట్ల నిధులను దశలవారీగా తమ ప్రభుత్వం విడుదల చేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కొత్త పాలసీలో సామాజిక న్యాయం కనిపిస్తుందన్నారు. ఎస్సి, ఎస్టి, మహిళలకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. కొత్త పాలసీ అద్భుతంగా ఉందని, ఇది రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని చిన్న మధ్యతరహా పరిశ్రమలపై ఆధారపడిన వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ జిడిపి పెరుగుదలకు చిన్న మధ్య తరహా పరిశ్రమలు దోహదపడతాయని, వీటిని ప్రోత్సహిస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం అప్పట్లో హైదరాబాదులోని ఓ హోటల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, దేశ ఆర్థిక సమగ్రాభివృద్ధికి ఈ పరిశ్రమలు దోహదపడతాయని అవగాహన కల్పించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి ఈ పాలసీ వచ్చేలా చూశారని, ఇది ప్రతి ఒక్కరికీ ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నానని భట్టి విక్రమార్క అన్నారు.
తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ చేరుకోవడమే మా లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎంఎస్ఎంఈ పాలసీ రాలేదని, ఈ క్రమంలో తొలి సారిగా ఎంఎస్ఎంఈల పాలసీ విడుదల చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. దీని ద్వారా తమ లక్ష్యం, తమ ఆలోచన, తమ దృక్ఫథాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ ఎకానమీ చేరుకోవాలని సిఎం సంకల్పించామని, ఆ లక్ష్య సాధనకు ముందుకు వెళ్తామన్నారు. ఎక్కువ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్న రంగం ఎంఎస్ఎంఈలు అని, అందుకే వీటిని కాపాడుకుందామన్నారు. రానున్న రోజుల్లోనూ ఎంఎస్ఎంఈ అభివృద్ధిలో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీనీ వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలే కాదని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని అన్నారు. వివిధ పరిశ్రమల సంఘాలతో విస్తృత సంప్రదింపులు, చర్చల జరిపిన తరువాతే ఎంఎస్ఎంఈ పాలసీ-2024ను తీసుకువచ్చామని శ్రీధర్ బాబు వెల్లడించారు.
పెట్టుబడులు పెట్టేందుకు తగిన సహకారం
RELATED ARTICLES