కొత్త ఆవిష్కరణలతో ప్రజాజీవితాల్లో మార్పులు
సాంకేతికత ఆవిష్కరణలు లేకుంటే భవిత శూన్యం
ఎఐ సమ్మిట్ ప్రారంభోత్సవంలో సిఎం రేవంత్‌రెడ్డి
“ఎఐ రోడ్‌మ్యాప్, వరల్డ్ ట్రేడ్ సెంటర్( డబ్ల్యుటిసి) రూపొందించిన “తెలంగాణ గ్రోత్ స్టోరీ” పుస్తకాల ఆవిష్కరణ
కలిసికట్టుగా పనిచేసి సరికొత్త భవిష్యత్‌ను ఆవిష్కరించాలి. ప్రస్తుత ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్… గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయాం… ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌పై మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు.. హైదరాబాద్‌ను ‘ఎఐ హబ్’ గా తీర్చిదిద్దబోతున్నాం … సిఎం రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్
ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని, ఇందులో పూర్తిగా పట్టు సాధించబోతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయని, ఈ ఆవిష్కరణ మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుందోనని ఒక వైపు ఆశలు, మరోవైపు ఉద్యోగాలు పోతాయాననే భయం మాత్రం పలువురిని వెంటాడుతున్నదని చెప్పారు. సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఎటువంటి మార్పులు జరగబోవని స్పష్టం చేశారు. నేటితరం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఎఐ) ద్వారా అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారన్నారు. హైదరాబాద్, హెచ్‌ఐసిసిలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల ‘అంతర్జాతీయ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్-(ఎఐ) సమ్మిట్”కు సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ఐటి, పరిశ్రమల శాఖ అదనపు ప్రత్యేక కార్యదర్శి జయేష్‌రంజన్, నాస్కామ్ మాజీ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి, డబ్ల్యుటిసిఎ ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్ రాబిన్‌వన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా “ఎఐ రోడ్‌మ్యాప్, వరల్డ్ ట్రేడ్ సెంటర్( డబ్ల్యుటిసి) రూపొంధించిన “తెలంగాణ గ్రోత్ స్టోరీ” పుస్తకాలను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సిఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సదస్సులో ఎఐ కి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మొదటిసారి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారిందని, విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిందని వివరించారు. ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టివి, కెమెరా, కంప్యూటర్ ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు. టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన తరం చేసుకున్న అదృష్టమన్నారు.
విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరమూ సిద్ధంగా లేదని, ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదని, భవిష్యత్తును సృష్టిస్తామన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ ఎఐ ఏర్పాటుతో భవిష్యత్‌కు బలమైన పునాది వేశామన్నారు. నాస్కామ్ సహకారంతో ఎఐ ప్రేమ్‌వర్క్‌కు రూపకల్పన జరుగుతుందని, ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేస్తుందని వివరించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి సరికొత్త భవిష్యత్‌కు ఆవిష్కరించాలని సూచించారు. ప్రస్తుత ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు. దేశ చరిత్రను పరిశీలిస్తే గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయామని సిఎం అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నామని, ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నామని అన్నారు. ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని, హైదరాబాద్ ను ‘ఎఐ హబ్’ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనమన్నారు. అందరూ కలిసి ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప ఎఐ హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో భాగస్వాములు కావాలని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
త్వరలోనే ‘ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా’ ఎదుగడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్‌బాబు
ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రం సంవత్సరానికి 11.3 శాతం ఆర్థిక వృద్ధిని సాధించడంతో, మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్‌డిపి ) 176 బిలియన్ డాలర్లుగా చేరిందన్నారు. తెలంగాణను గ్లోబల్ ఎఐ చుక్కానిగా నిలబెట్టడానికి, అత్యాధునిక కంప్యూట్ ఫెసిలిటీస్, విస్తృత డేటా సెంటర్లు, సుస్థిర కనెక్టివిటీని అందిస్తుందని వివరించారు. నూతన ఆవిష్కరణలకు ఎఐ సిటీ పుట్టినిల్లు అవుతుందని, టెక్నాలజీ శక్తిసామర్థ్యాన్ని దృఢంగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు. ఎఐ సిటీలో ఒక స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభించేందుకు తాము ప్రణాళికలను సిద్ధంచేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలు, విద్యాసంస్థలు, దిగ్గజ టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలతో 26 పరస్పర అవగాహన పత్రాలను (ఎంఒయు) కుదుర్చుకున్నామన్నారు. ఇందులో ప్రధానంగా కంప్యూట్ ,ఇన్‌ఫ్రాస్ట్ర క్చర్, స్కిల్లింగ్, ఇంపాక్ట్ అసెస్‌మెంట్, స్టార్టప్ ఇన్నొవేషన్, జనరేటివ్ ఎఐI, పరిశోధన సహకారం, డేటా అనోటేషన్ అంశాలు ఉన్నాయన్నారు. ఎఐ ద్వారా తెలంగాణను ప్రపంచ మేధోశక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలను పటిష్టంగా రూపొందిస్తున్నదని శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రపంచ స్థాయి వర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని,హైదరాబాద్ సమీ పంలో 200 ఎకరాల్లో ఎఐ సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.ప్రపంచ స్థాయి ఏఐ కంపెనీలు ఏర్పాటయ్యేలా చూస్తామని, సవాళ్లను ఎదుర్కొనేలా కృత్రిమమేథను వినియోగిస్తామని శ్రీధర్ బాబు చెప్పారు.
అనతికాలంలోనే కొత్త ఆవిష్కరణలు: బివిఆర్.మోహన్ రెడ్డి
నాస్కామ్ మాజీ ఛైర్మన్ బి.వి.ఆర్.మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనతికాలంలోనే స్కీల్ యూనివర్సిటీ, విద్యా కమిషన్, ఎఐ సిటీ లాంటి కొత్త ఆవిష్కరణలకు ప్రవేశపెట్టిందని, ఇదొక ప్రగతి ప్రభుత్వమని ప్రశంసించారు.