HomeNewsLatest News‘తెలంగాణ విద్యా కమిషన్‌' ఏర్పాటు

‘తెలంగాణ విద్యా కమిషన్‌’ ఏర్పాటు

ప్రజాపక్షం/హైదరాబాద్‌
రాష్ట్రంలో నూతన విద్యావిధానాన్ని రూపొందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ విద్య కమిషన్‌’ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మంగళవారం జిఒ నంబర్‌ 27 ను విడుదల చేశారు. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ విద్య వరకు పలు అంశాలను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్‌ సిఫారసులు చేస్తుంది. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు నేటీ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేలా నూతన విద్యావిధానాన్ని రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పలువురు విద్యావేత్తలు, ప్రముఖులతో చర్చించినట్టు తెలిసింది. ఈ కమిషన్‌కు ఛైర్మన్‌, సహా ముగ్గరు సభ్యులను నియమించనుంది.పలు అంశాలను అధ్యయనం చేసి ప్రీ ప్రైమరీ నుంచి సాంకేతిక , యూనివర్సిటీ విద్య వరకు విద్యావిధానాన్ని రూపొందించనున్నారు. విద్యారంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి విద్యా కమిషన్‌ తెలియజేయనుంది. విద్యారంగ నిపుణులతోపాటు పలువురితో విద్యా రంగంలో వస్తున్న మార్పులు తదితర అంశాలపై విద్యా కమిషన్‌ నిత్యం అధ్యయనం చేయనుంది. నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దిగజారుతున్నాయని వెల్లడైంది. పైగా యూనివర్సిటీల్లో పబ్లికేషన్ల సంఖ్య తగ్గుతోంది. పరిశోధనలు కుంటుపడుతున్నాయి.ఈ నేపథ్యంలో విద్యా రంగంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం బావిస్తున్నది.
అధ్యయనం చేసే అంశాలు ఇవే
విలువలతో కూడిన విద్యను అందించడం. విద్యార్థులను ఉత్తమ ,బాధ్యత గల అంతర్జాతీయ పౌరులుగా తీర్చిదిద్దడం.
విద్యార్దులందరికీ పూర్వ ప్రాథమిక విద్యను అందించడం. ప్రాథమిక బడుల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు.
ఉన్నత విద్యలో నాణ్యమైన విద్యను అందించడం.
విద్యార్థుల సమాగ్రాభివృద్ధికి చర్యలు.
ఉన్నత విద్య సంస్థలను అప్రంటిస్‌ షిప్‌, ఎంప్లాయిబిలీటీస్కీల్స్‌తో అనుసంధానం.
ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాన్ని తీర్చిదిద్దడం.
విద్యా కమిషన్‌ ఛైర్మన్‌గా ఆకునూరి మురళీ..?
విద్యా కమిషన్‌కు త్వరలోనే ఛైర్మన్‌,ముగ్గురు సభ్యులను నియమించనున్నారు. కమిషన్‌ మెంబర్‌ సెక్రెటరీగా విద్యాశాఖకు చెందిన అధికారిని నియమించనున్నారు. కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఐఎఎస్‌ అధికారి ఆకునూరి మురళీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్‌ఇ విధానానికి సంబంధించిన నివేదికను అందజేయడంతో పాటు విద్యావిధానంలో మార్పులు తీసుకొచ్చారు. పైగా నూతన విద్యా విధానం అంశంలో ఆకునూరి మురళీతో పలు మార్లు చర్చలు జరిగినట్టు తెలిసింది. అలాగే మిగిలిన ముగ్గురు సభ్యులలో విద్యా రంగానికి చెందిన సీనియర్‌ ప్రొఫెసర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో ప్రొఫెసర్‌. పి.ఎల్‌.వి విశ్వేశ్వర్‌రావు పేరు కూడా వినిపిస్తుంది. మరో ప్రొఫెసర్‌తో పాటు విద్యారంగంతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని సభ్యునిగా నియమించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments