HomeNewsLatest Newsఇల్లు కూలినవారికి ఇందిరమ్మ ఇల్లు

ఇల్లు కూలినవారికి ఇందిరమ్మ ఇల్లు

ముందస్తు చర్యలతో నష్టనివారణ
అధికారులు, మంత్రుల సహాయక చర్యలు భేష్‌
వరదప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సిఎం పరామర్శ

ప్రజాపక్షం/మహబూబాబాద్‌
రాష్ట్రంలో అకాల వర్షలు కబలించిన ప్రాణ నష్టం,ఆస్థి నష్టం తనను కలిచివేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేధన వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన వరద నష్టాన్ని సీఎం మంత్రులతో కలిసి పరిశీలించారు. తొలుత ఖమ్మం జిల్లాలోని గేట్‌ కారెపల్లి సమీపంలోని గంగారం గ్రామంలో నూనావత్‌ అశ్విని సోదరుడు, తల్లిని సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించి, అశ్విని, మోతీలాల్‌ మరణాలకు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఇల్లు లేకపోవడంతో తక్షణమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లాలోని మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం వద్ద పూర్తిగా వరద భీభత్సంతో డ్యామేజీ అయిన బ్రిడ్జీ పరిస్థితిని అధికారులు, మంత్రులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి సీతారాంతండాకు వెళ్లిన సీఎం తండాకు ఏ విధంగా ముంపుకు గురైందో తెలుసుకున్నారు. మూడు తండాలు వరద తాకిడితో ఇబ్బందుల నేపథ్యంలో వాటిన్నింటి ఒక్కచోటకు చేర్చి వారిందరికీ ఇందిర పథకం ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ను ఆదేశించారు. అటు తర్వాత మహబూబాబాద్‌ ఐడీవోసీకి చేరుకున్న సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ముందస్తు చర్యలతోనే నష్ట నివారణ సాధ్యమైందన్నారు. అధికారులు, మంత్రులతో ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందాయన్నారు. వరద భీభత్సంతో ప్రాణ, ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్థులకు నష్టం వాటిల్లిందన్నారు. ఖమ్మం మహబూబాబాద్‌లో అధికారులు, మంత్రుల సహాయక చర్యలు భేష్‌ అని అభినందించారు. సీతక్క మంచి సేవలు అందించారని ప్రత్యేకంగా అభినందించారు. వరద భీభత్సం దాటికి జిల్లాలో ముగ్గురు మృతి..చెరువులు, రోడ్లు డ్యామేజ్‌ అయ్యాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 45 ఇళ్లు పూర్తిగా, 96 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయినట్లు వివరించారు. సీతారాంతండాతో పాటు మరో రెండు తండాలను కలిపి ఒక్కచోటే ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి బాధితులకు అప్పగించాలన్నారు. అశ్విని, మోతీలాల్‌ మృతి హృదయ విధారకంగా మారిందని, వీరి మరణం రాష్ట్ర ప్రజలకు సైతం కదిలించిందన్నారు. వారికి తక్షణమే ఇందిరమ్మ ఇల్లును మంజూరీ చేశామన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం కింద రూ..5 లక్షల పరిహారం చెల్లించేలా అధికారులకు ఆదేశించారు. ప్రతి ఎకరాకు తక్షణ సాయం కింద ఎకరాకు రూ.10 వేలు అందించనున్నట్లు పేర్కొన్నారు. వరద తాకిడికి మృతి చెందిన పశువులకు 50 వేలు, గొర్రెలు, మేకలకు రూ.5వేలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. తెలంగాణ వర్ష భీభత్సం జాతీయ విపత్తు కింద పరిగణించాలని ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5438 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాధమిక అంచనా వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ తక్షణ సాయం 2 వేల కోట్లు అందించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. జిల్లాలో జరిగిన నష్టంపై నివేధిక అందించాలన్నారు. జిల్లాలో 45 ఇళ్లు పూర్తిగా, 96 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నష్టం వాటిల్లిందని, త్వరలోనే మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. అధికారుల ముందస్తు చర్యలతోనే నష్ట నిరవారణ జరిగిందన్నారు. అలాగే అధికారుల,మంత్రుల సహాయక చర్యలు భేష్‌ అని, తక్షణమే పునరుద్దరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.
కెసిఆర్‌ ఏనాడైనా బాధితులను పరామర్శించారా..?
పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కెసిఆర్‌ ఏనాడైనా వరద, ప్రమాద బాధితులను పరామర్శించారా అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. వరద బాధితుల వద్దకు ఏనాడూ కెసిఆర్‌ వెళ్లలేదని, సొంత నియోజవకర్గం మాసాయిపేటలో రైలు ప్రమాదంతో చిన్నారులు చనిపోయినా, హైదరాబాద్‌ ఒఆర్‌ఆర్‌లో పశు వైద్యురాలు అత్యాచారానికి, హత్యకు గురైతే కనీసం వాళ్ల కుటుంబ సభ్యులను కెసిఆర్‌ పరామర్శించలేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని కెసిఆర్‌ ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అమెరికాలో ఎంజాయ్‌ చేస్తున్న కెటిఆర్‌ క్షేత్రంలో ఉండి సహాయక చర్యలు చేపడుతున్న మంత్రులపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో దోచుకున్న రూ.లక్ష కోట్ల నిధుల్లో రూ.వెయ్యి కోట్లో… రూ. రెండు వేల కోట్లో సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని కెసిఆర్‌ కుటుంబానికి ముఖ్యమంత్రి సూచించారు.
సిఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు…
వరద సహాయక చర్యలు చేపట్టేందుకు గానూ ముఖ్యమంత్రి ఉపశమన నిధి (సిఎంఆర్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు మూల వేతనం రూ.135 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి చెక్‌ రూపంలో అందజేశారు. వారికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
కార్పోరేట్‌ కంపెనీలు మానవీయ కోణంలో స్పందించాలి
తెలంగాణ, తెలంగాణేతర కార్పోరేట్‌ కంపెనీలు జరిగిన విపత్తు పట్ల మానవీయ కోణంలో స్పందింఆచలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లా వర్ష భీభత్సానికి కకావికలం అయ్యాయని, వీరందరిని ఆదుకునేందుకు ఆర్థికంగా ఎదిగిన వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీరోలు పోలసీస్టేషన్‌ ఎస్సై సేవలు అభినందనీయమని రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గత మూడు రోజుల క్రింత ఉద్బవించిన వర్ష భీభత్సానికి గురైన సీతారాంతండా వాసులు వంద మందిని కాపాడి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు.

అశ్విని కుటుంబాన్ని ఆదుకుంటాం నివాళులర్పించిన సిఎం రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం / ఖమ్మం : రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన మోతీలాల్‌, అశ్విని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మోతీలాల్‌, అశ్విని కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రెండు రోజుల క్రితం ఆకేరు వరద ప్రవాహంలో కారు కొట్టుకోని పోయి యువ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి మోతీలాల్‌ మరణించిన విషయం విధితమే. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అశ్విని, మోతీలాల్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధైర్యంగా ఉండాలని యువ శాస్త్రవేత్తను కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. అశ్విని సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా శాసన సభ్యులు మాలోత్‌ రాందాస్‌ నాయక్‌, మహబూబాబాద్‌ ఎంపి పోరిక బలరాం నాయక్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు. అంతకు ముందు ఖమ్మం నగరంలో ముఖ్యమంత్రి మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. హరీష్‌రావు సాయం చేయాలి తప్ప బురద రాజకీయాలు చేయకూడదని సూచించారు. ప్రకటించిన పరిహారం ప్రాథమికమేనని అంచనాలు పూర్తయిన తర్వాత అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పరిహారాన్ని మరింత పెంచడంతో పాటు ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలను వివరిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments