ప్రజాపక్షం/ న్యూస్
వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టికి రాష్ట్రం అతలాకుతలమైంది. గంటల వ్యవధిలో కురిసిన కుండపోతకు 8 ప్రాంతాల్లో అత్యధికంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పోటెత్తిన వరదతో వాగులు, వంకలు పొంగిపొర్లి ప్రవహించగా, గ్రామాలతో పాటు లోతట్టు కాలనీల్లోని ఇళ్లను నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాం తాలను వరద ముంచెత్తగా, జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో గడపాల్సి వచ్చింది. జల ప్రళయం ఖమ్మం జిల్లాలోని వేలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. చివరకు కన్నీరు మిగిల్చింది. రికార్డు స్థాయిలో వచ్చిన వరద వందలాది మంది జీవిత గమనాన్ని మార్చివేసింది. అధికార యంత్రాంగ అంచనా వైఫల్యం, తరలింపులో నిర్లక్ష్యం బాధితుల పాలిట శాపంగా మారింది. వరద ముంపుకు గురైన ప్రాంత ప్రజలది ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. కొన్ని గంటల్లోనే వరద నీరు ముంచెత్తడంతో కట్టు బట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. ఇంట్లో ఏ ముంది అన్న ధ్యాస కంటే బతకడం ఎలా అన్న ఆందోళన పరుగులు పెట్టేలా చేసింది. ఫలితంగా చివరకు కట్టు బట్టలే మిగిలాయి. వరద బాధిత ప్రాంతాల్లో ఏ ఇంటిని కదిలించినా కన్నీటి వ్యథే. ఏ ఆధారం లేక రేకులు వేసుకుని జీవిస్తున్న ఓ ని రుపేద కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ఉన్న రేకులు కొట్టుకుపోవడంతో ఆ తల్లి పైకప్పులు లేని గూటిలో దీనంగా కాలం గడుపుతుంది. ముఖ్యం గా మున్నేరు బాధిత కుటుంబాలలో పిల్లలది ఓ దురదృష్టకర ఘటన. చదువుకునే పుస్తకాలు, ధృవపత్రాలు, ల్యాప్‌టాప్‌లు అన్ని వరదలో కొట్టుకుపోయాయి. మిగిలినవి తడిసి ముద్దయ్యాయి. ఆదివా రం ఇల్లు చేరిన ఓ బాలిక ఇంటికి వెళ్లి తడిసిన తన పుస్తకాల సంచిని చూసుకుని పుస్తకాలను ఆరబెట్టుకుంటున్న తీరు కంటతడిపెట్టించింది. ఓ చిరు వ్యాపారి పెళ్లిళ్ల సీజన్ కదా అని ఇంట్లో మూడు లక్షల రూపాయల విలువైన సామాను తెచ్చిపెట్టుకున్నాడు. మొత్తం వానకు తడిసిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నాడు. మోతి నగర్, వెంకటేశ్వర నగర్, కవిరాజ్ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, బొక్కలగడ్డ, ప్రకాష్‌నగర్ తదితర ప్రాంతాలలో 10 అడుగుల మేర నీరు చేరాయి. ఇంట్లో ఉన్న ఏ ఎలక్ట్రానిక్ వస్తువూ పనికొచ్చే పరిస్థితి లేదు. ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టివిలు చాలా మంది ఇండ్ల నుంచి కొట్టుకుపోయాయి. ఉన్నవి పనికి రాకుండాపోయాయి. ఇక ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువు ఏది ఉపయోగపడే పరిస్థితి లేదు. శరీరం పై ఉన్నవి తప్ప మార్చుకోవడానికి మరో గుడ్డ లేదు. స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు లేదా అధికారులు తినడానికి అందిస్తున్నారు కానీ చాలా మంది రేపటి పరిస్థితి ఏమిటి అని తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఖమ్మం నగరంలోని మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఏ రోడ్డు చూసినా బురదమయమే. ఇండ్లనిండా బురదే. నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించడంతో పాటు ప్రతి పేద కుటుంబానికి కనీసం ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటిస్తే తప్ప జీవించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ముంపుకు కారకులై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికార యంత్రాంగంపై తగు చర్యలు తీసుకోవాలని బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమకు తగిన పరిహారం వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు.
విషాదకర సంఘటనలు మిగిల్చిన భారీవర్షం
దెబ్బతిన్న పంటలు, రహదారులు, డైనేజీ వ్యవస్థ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వరంగల్ నగరంలో అన్ని కాలనీలు, శివారు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. పలు ప్రాంతాలలో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు ధ్వంసం కావడంతో పాటు రోడ్లపైకి వరద నీరు చేరి ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు పంటలకు తీరని నష్టాన్ని కలిగించాయి. వరంగల్ , హన్మకొండ జిల్లాలలో సాధారణం కంటే మించి వర్షపాతం నమోదు అయింది. వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 694 మి.మి. నమోదు కావాల్సి ఉండగా 875 మి.మి.వర్షపాతం నమోదు అయింది. అలాగే హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 667 మి.మి.లు నమోదు కావాల్సి ఉండగా 795 మి.మి.ల వర్షపాతం నమోదు అయింది. ఒక్క ఆదివారమే వరంగల్ జిల్లాలో 54.4 మి.మిలు, హనుమకొండ జిల్లాలో 37.1 మి.మి.ల వర్షపాతం నమోదు అయింది. మహబూబాబాద్ జిల్లాలో జిల్లా సరాసరి 29.67 సెంటిమీటర్ల రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతం జనాన్ని అతలాకుతలం చేసింది. మున్నేరువాగు, ఆకేరువాగు, పాలేరు వాగులు పొంగి పొర్లడంతో అనేక గ్రామాలు, గిరిజన తండాలు నీటమునిగాయి. కేసముద్రం మండల పరిధిలోని అన్నారం వద్ద చెరువులు, కుంటలు నిండంతో పాటు కట్టలు తెగిపోవడం వల్ల రైల్లే ట్రాక్ తెబ్బతిని, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్, కేసముద్రం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులతో వెళ్లాల్సిన రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకోలేక నానాఅవస్థలు పడ్డారు. తాడ్వాయి మండల వ్యాప్తంగా పంటపొలాల్లో ఇసుకమేటలు వేశాయి. నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందజేయాలని తాడ్వాయి మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగు పొంగి ప్రవహిస్తున్న విషయాన్ని గమనించకుండా ఎయిర్‌పోర్టు కోసం బయలు దేరిన ఖమ్మం జిల్లా కారేపల్లి తండాకు చెందిన తండ్రి, కూతురు సహా వారు ప్రయాణిస్తున్న కారు కూడా కొట్టుకుపోయిన ఘటనలో తండ్రికూతుళ్లు మరణించిన వార్త అందరినీ కలచివేసింది.గల్లంతైన నునావత్ మోతీలాల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆకేరు ఏటికి కొద్ది దూరంలో అశ్విని మృతదేహం కారు ఆచూకీ లభించగా, మృతదేహాన్ని కారును ఒడ్డుకు చేర్చారు. అశ్విని మృతదేహానికి ఆదివారం పోస్ట్‌మార్టం నిర్వహించగా, సోమవారం మోతీలాల్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు మరిపెడ ఎస్‌ఐ బొలగాని సతీష్ తెలిపారు.
మహబూబ్ నగర్‌లోనలుగురు మృతి: భారీగా పంట నష్టం
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారంపేట జిల్లా మద్దూరు మండలం కొత్తపల్లిలో మట్టి ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందారు. గద్వాల జిల్లా కేంద్రంలో, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మరో ఇద్దరు మృతిచెందారు. భారీ వర్షాల మూలంగా జిల్లాలోని చెరువులు కుంటలు పొంగి పారుతున్నాయి. పత్తి, వరి, మొక్కజొన్న, కందులు తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోట్లల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తడంతో జారాల ప్రాజెక్టులోని 40 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టులోని 10 గేట్లను ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 13 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి.
జనగామను కమ్మేసిన కారు మబ్బులు
మూడో రోజు సైతం జనగామను వర్షం, కారు మబ్బులు కమ్మేశాయి. సోమవారం రోజంతా ముసురు వర్షం కురిసింది. భారీ వర్షాలతో చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వరద ప్రభావం కొంత మేరకు తగ్గినా రోడ్డు డైవర్షన్లు తెగిన ప్రాంతాల్లో వాహన రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. వర్షం వలన జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. జనగామ జిల్లాలో 5వేల ఎకరాకు పైగా వరి, పత్తి పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇక జిల్లా కలెక్టర్‌తో పాటు అధికార యంత్రాంగ పూర్తిగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సోమవారం భారీ వర్షమే కురిసింది. జిల్లా వ్యాప్తంగా 801మిల్లీ మీటర్ల నమోదు కాగా యావరేజ్‌గా 66.8 మిల్లీ మీటర్లు నమోదైంది. అత్యధికంగా బచ్చన్నపేలో నమోదు కాగా అత్యల్ఫంగా దేవరుప్పులలో 17.6 మిల్లీ మీటర్లు నమోదైంది. శనివారం రాత్రి నుండి, ఆదివారం మద్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షానికి హుస్నాబాద్‌కు వెళ్లే రహదారి నానుగుపహాడ్ వద్ద తెగిపోయింది, పాలకుర్తి రూట్‌లో పటేల్‌గూడెం వద్ద, నర్మెటకు వెళ్లె దారిలో మేకలగట్టు వద్ద రోడ్డు డైవర్షన్లు తెగాయి. ఇంకా పునరుద్ధరించకపోవడంతో రాకపోకలు పున: ప్రారంభం కాలేదు. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుండపోత.. తీరని వ్యథ…
తుఫాన్ ప్రభావంతో కురిసిన కుండపోత వర్షం సూర్యాపేట వాసులను తీరని వ్యథకు గురి చేసింది. వరదలతో ప్రాణ, ఆస్తి, పంట నష్ట భారీ స్థాయిలో జరిగింది. తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. 30 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. అత్యధికంగా హూజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వర్షాలు నమోదు కాగా అదే స్థాయిలో నష్టం కూడా జరిగింది. తుఫార్ ప్రభావంతో జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. జిల్లాలో మొత్తం 21 చెరువులు దెబ్బతినగా 15 గ్రామాల నుండి 2750 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఏడు పశువులు మృత్యువాత పడ్డాయి. 7 పక్కా ఇండ్లు నేలమట్టం కాగా పాక్షికంగా 44 ఇండ్లు దెబ్బతిన్నాయి. వరద నీటితో 20వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఇది ఇలా ఉంటే హైద్రాబాద్-విజయవాడ ప్రధాన రహదారి వర్షం దెబ్బకు ధ్వంసమైంది. అలాగే ఖమ్మం-సూర్యాపేట, కోదాడ- ఖమ్మం రహదారులు కూడా దెబ్బతినడంతో పాటు వరద నీరు రోడ్లపై చేరడంతో కోతకు గురయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల నుండి రాకపోకలు నిలిచిపోయాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ప్రవహించే నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద గండిపడింది. కాల్వ నీరు పెద్ద ఎత్తున పంట పొలాల నుండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కోదాడ మండలంలోని గోండ్రియాల గ్రామం నీట మునిగింది. కోదాడ నుండి మేళ్ళచెరువు వెళ్లే మార్గంలో కందిబండ చెరువులో నీరు భారీగా రావడంతో వరద ఉదృతికి వంతెనపై నిర్మించిన రోడ్డు బీటలువారి సోమవారంనాడు కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కోదాడ, హూజూర్‌నగర్, సూర్యాపేట పట్టణంలోని చెరువులు, కుంటలు, నాలాలు వర్షపు నీటితో ఉప్పొంగుతున్నాయి.
పౌంగి పోర్లుతున్నా చెరువులు,వాగులు,చెక్ డ్యాం
ఎడతేరిపి లేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం మూలంగా సిద్దిపేటలో జనజీవన స్థంబించిపోయింది. సోమవారం ముసురు వానతో ముంచెత్తింది. సిద్దిపేట జిల్లా పరిధిలో కురిసిన వర్షం మూలంగా లోతట్టు ప్రాంతలన్ని జలమయమయ్యాయి.జిల్లా వ్యాప్తంగా చెరువులు, చెక్‌డ్యాంలు, వాగులు నిండి పొంగి పొర్లుతున్నాయి. సిద్దిపేట కోమటి చె రువు నిండి మత్తడి దూకుతోంది.
జల ప్రళయం.. జనం కకావికలం
RELATED ARTICLES