‘సెప్టెంబర్ 17’ను అధికారికంగా నిర్వహించండి
సమస్యలపై ముఖ్యమంత్రికి ప్రజాసంఘాల వినతులు
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సిపిఐ విజ్ఞప్తి
వీరోచిత సాయుధ పోరాట చరిత్రను గుర్తించాలి, ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పడింది. సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రావి, మగ్దూం, బద్దం విగ్రహాలను ట్యాంకుబండ్‌పై ఏర్పాటుచేయాలి
ప్రజాపక్షం/హైదరాబాద్
సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చడం ద్వారా అమరులను, చరిత్రను గౌరవించిన వారమవుతామని తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్‌రావు, ఎన్.బాలమల్లేశ్‌లు వినతిపత్రం సమర్పించారు. వీరోచిత సాయుధపోరాట చరిత్రను గుర్తించాలని, ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రావి నారాయణ రెడ్డి, మగ్దూంమొహియొద్దీన్, బద్దం ఎల్లారెడ్డిల విగ్రహాలను ట్యాంకుబండ్‌పై ఏర్పాటుచేయాలని కోరారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌పై మగ్దూం మొహియొద్దీన్ విగ్రహం ఉందని, అక్కడే ముగ్గురి విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అమరులు దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీల విగ్రహాలను సముచిత ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కోరారు.
ముఖ్యమంత్రికి ప్రజాసంఘాల వినతులు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రజాసంఘాలతో కూడిన ప్రతినిధి బృందం సమావేశమైంది. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు ప్రజాసమస్యలు, సింగరేణి, టిఎస్‌ఆర్‌టిసి, మధ్యాహ్నభోజన పథకం, గిరిజన సమస్యలు, అంగన్‌వాడీ కార్మికుల సమస్యలపై ఆయా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినపతిపత్రాలు సమర్పించారు. సిఎంను కలిసిన ప్రతినిధి బృందంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్.బాలమల్లేశ్, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఎండి యూసుఫ్, బాలరాజ్, ఎం. నర్సింహా (ఎఐటియుసి), డాక్టర్ బి.వి. విజయలక్ష్మి, కమలారెడ్డి (ఎస్‌టియు), అంజయ్యనాయక్ (గిరిజన సమాఖ్య), నరసింహా(మిషన్ భగీరథ), తోట రామాంజనేయులు (ఎన్‌హెచ్‌ఎం), సీతామహాలక్ష్మి (అంగన్‌వాడీ), రవీందర్ (మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్), వెంకట్ రాజు (గ్రామీ పంచాయతీ వర్కర్స్ యూనియన్), స్వామి (హమాలీ వర్కర్స్ యూనియన్), సబ్బు రాజమౌళి (టూరిజం కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్), కె.కాంతయ్య (బికెఎంయు), ఎం.ప్రవీణ్‌కుమార్ (బిల్డింగ్ వర్కర్స్ యూనియన్), రామాంజనేయులు (అంగన్‌వాడీ), కె.యేసురత్నం (మున్సిపల్ వర్కర్స్) వెంకన్న (ఆర్‌టిసి ఎంప్లాయీస్ యూనియన్), అక్బర్ అలీ, తిరుపతి (సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్) తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఐ, ప్రజాసంఘాల ప్రతినిధి బృందం డిమాండ్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.