HomeNewsLatest Newsబడాబాబులకు హైడ్రా భయపడొద్దు

బడాబాబులకు హైడ్రా భయపడొద్దు

పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలి

ఫామ్‌ హౌస్‌ల కోసం చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాచేసిన వారి పేర్లు బయటపెట్టాలి
చెరువులు, ప్రభుత్వ, వక్ఫ్‌, దేవాదాయ భూముల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌
హైడ్రా కూల్చివేతలు చేపట్టే ముందుగా పైసా పైసా కూడబెట్టుకుని స్థలాలు, అపార్ట్‌మెంట్లు కొనుక్కున్న పేదవారికి, మధ్య తరగతి ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం, పునరావాసం కల్పించకుండా వారి నిర్మాణాలను కూల్చవద్దని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో గందరగోళం, పేద, మధ్యతరగతి ప్రజల్లో అయోమయం నెలకొందని, ఈ నేపథ్యంలో చెరువులు, ప్రభుత్వ భూములు, వక్ఫ్‌ భూములు, దేవాదాయ భూములు తదితర భూములలో కబ్జాలు, ఆక్రమణల అంశంపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తద్వారా ఎవరెవరి ఆక్రమణలు తొలగించనున్నారో ప్రజలకు స్పష్టమౌతుందన్నారు. హైడ్రా అంటే ఆక్రమణదారులకు భయం పుట్టాలని, పేదలకు కాదని అన్నారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌, ఎన్‌.బాలమల్లేష్‌లతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. హైడ్రా చేపడుతున్న కార్యకలాపాల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయకూడదని, బడా బాబులను చూసి భయపడకుండా అడుగు ముందుకు వేయాలని, అది తెలంగాణ ప్రయోజనాలకు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా, ఆక్రమణలపై ముందస్తు విశ్లేషణ, నిర్ధిష్ట కార్యాచరణ ప్రణాళిక ఉండాలని కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చి ఫామ్‌హౌస్‌ల పేరుతో చెరువులను, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి పేర్లను కూడా బయటపెట్టాలన్నారు. ప్రభుత్వానికి ధైర్యముంటే హైడ్రా పాతబస్తీ వైపు వెళ్ళాలని కొందరు అంటున్నారని, ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి పెద్దవారైనా వదలొద్దని,ఏ ఒక్కరిని వదిలినా ఇప్పటి వరకు చేసిన మంచి పని అంతా అప్రతిష్టపాలవుతుందని ఆయన హెచ్చరించారు. నాగార్జున విషయంలో 2014లోనే ఈ అంశంపై కోర్ట్‌ ఆర్డర్స్‌ ఉన్నప్పటికీ పదేళ్లుగా ఎన్‌ కన్వెన్షన్‌పై వస్తున్న ఆదాయాన్ని వారు అనుభవిస్తున్నారని, ఎన్‌ కన్వెన్షన్‌ ఒక్కటే కాకుండా ఎవరైతే బఫర్‌ జోన్‌లో కట్టడాలు చేపట్టిన బడాబాబులందరూ కచ్చితంగా చెరువు పునర్నిర్మాణానికి, ఇప్పటి వరకు వారికి వచ్చిన ఆదాయంలో ప్రభుత్వానికి కొంత చెల్లించాలన్నారు.
అప్పటి మంత్రులు, అధికారులపై కేసులు పెట్టాలి:
బఫర్‌ జోన్‌లో ఎలాంటి కట్టడాలకు అనుమతులు ఇవ్వబోరని, అయినప్పటికీ వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులు, ఆ శాఖలకు బాధ్యులైన మంత్రులను కూడా వదిలిపెట్టకుండా కచ్చితంగా కేసులు పెట్టాలని కూనంనేని సాంబశివ రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ విముక్తి దినోత్సవం సందర్భంగా అమరవీరులను స్మరిస్తూ సెప్టెంబర్‌ 11 నుండి 17 వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రైతు రుణమాఫీపై స్పష్టత లేదని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతవరకు రుణ మాఫీ చేసింది, ఇంకా ఎంత మందికి చేయాల్సి ఉన్నదో అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇంతవరకు రూ.18 వేల కోట్ల రుణమాఫీ జరిగిందని వ్యవసాయ శాఖ బాధ్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారని, ప్రభుత్వ లక్ష్యం ప్రకారం రూ.31 వేల కోట్లు కాకుండా, పాత లెక్కల ప్రకారం రూ.40 వేల కోట్లు అవసరం అవుతుందన్నారు.
ఆడబిడ్డపై రాజకీయలొద్దు…
ఎంఎల్‌సి కవిత బెయిల్‌ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ఆడబిడ్డ అని కూడా చూడకుండా కక్ష సాధింపుతో వెంటపడి, వేధింపులకు గురిచేయడం తగదని కూనంనేని సాంబశివరావు అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే కెసిఆర్‌, కెటిఆర్‌పైన పోరాడాలని సూచించారు. కవితపై వచ్చిన ఆరోపణల విషయంలో కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా తప్పు చేస్తే, ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటే కమ్యూనిస్టు పార్టీ రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఉంటే భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీ చేస్తామని, లేదంటే కమ్యూనిస్టు పార్టీకి బలమున్న ప్రతి చోట సొంతంగానే పోటీ చేస్తామని కూనంనేని సాంబశివరావు ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మిత్రధర్మాన్ని పాటించి కమ్యూనిస్టు పార్టీకి హామీ ఇచ్చిన పదవులు ఇవ్వాలని కూనంనేని మరో ప్రశ్నకు జవాబు ఇచ్చారు.
సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్ధూం మోహియుద్దీన్‌ల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఒకే చోట ఏర్పాటు చేయాలి
సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. “తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని ఎంఎఐఎం లేదా ఎవరికో భయపడి నిర్వహించలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారంగా నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించి మాట నిలబెట్టుకోవాలి” కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లింలకు మధ్య సమస్య కాదని, వెట్టి చాకిరి విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం నాటి రాచరిక నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సామాజిక మహా పోరాటమని, ఆ పోరాటంలో ముస్లింలు కూడా అనేక మంది అమరులయ్యారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ఆ పోరాటానికి నాంది పలికిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్ధూం మోహియుద్దీన్‌ విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఒకే చోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ట్యాంక్‌బండ్‌పై ఉన్న మగ్ధూం మోహియుద్దీన్‌ విగ్రహం వద్ద ఒకే చోట రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిల విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని సిఎంను వారు కోరారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సాయుధపోరాటాన్ని భావి తరాలకు తెలియజేసిందుకు పాఠ్యాంశాలలో చేర్చడంతో పాటు ఈ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీకి కూడా ఆ పాఠ్యాంశాలలో పొందుపర్చి రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాయుధ పోరాటయోధులు చాకలి ఐలమ్మ, కుమురం భీమ్‌ తదితరులను కులాల ప్రాతిపదికన కాకుండా కమ్యూనిస్టు పార్టీ పోరాటయోధులుగా గుర్తించి వారి విగ్రహాలను సముచితమైన స్థానంలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు సిఎంకు విజ్ఞప్తి చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments