మహిళలపై అఘాయిత్యాల మీద దేశం మేల్కొనాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కోల్కతా ఘటన నేపథ్యంలో ‘పిటిఐ’కి ప్రత్యేక వ్యాసం
న్యూఢిల్లీ : ‘ఇక జరిగింది చాలు’ అని, మహిళలపై విపరీత నేరాలకు వ్యతిరేకంగా భారతదేశం మేల్కొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహిళలను తక్కువ శక్తి కలవారుగా, తక్కువ సమర్ధులుగా, తక్కువ మేధస్సు కలవారుగా చూసే ఆలోచన ధోరణిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ‘ఇలాంటి అభిప్రాయాలను పంచుకునేవారు, మరింత ముందుకు వెళ్ళి మహిళలను వస్తువులగా చూస్తారని, భయం నుండి స్వేచ్ఛను సాధించేవదుకు మన ఆడపిల్లలు భయం నుంచి స్వాతంత్య్రం పొందేందుకు వారి మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించాలని అన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన వ్యాసాన్ని ‘పిటిఐ’ వార్తా సంస్థకు రాశారు. ఆగస్టు 9న కోల్కతా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం గురించి ప్రస్తావిస్తూ తనను కూడా ‘కలత, భయం’ కలిగించిందని, మహిళలపై జరుగుతున్న వరుస నేరాలలో ఇదొక భాగమనే అంశం మరింత నిస్పృహకు లోను చేసిందని ముర్ము అన్నారు. తమ పిల్లలు, సోదరీమణులపై ఇలాంటి అత్యాచారాలకు గురయ్యేందుకు ఏ సభ్య సమాజం కూడా అనుమతించబోదని వ్యాఖ్యానించారు. దేశమంతా తీవ్ర ఆగ్రహానికి గురైందని, తాను కూడా అలాగే లోనయ్యానని తెలిపారు. ‘మహిళల రక్షణ : ఇక చాలు’ అనే పేరుతో తొలిసారిగా కోల్కతా ఘటనపై తన భావాలను వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి పిటిఐకి వ్యాసం రాశారు. పిటిఐ సంస్థ 77వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 27న రాష్ట్రపతి భవన్లో తనను కలిసిన పిటిఐ సీనియర్ సంపాదక బృందంతో తాజా పరిణామాలపై లోతుగా చర్చించిన అనంతరం రాష్ట్రపతి ఈ వ్యాసాన్ని అందజేశారు. కోల్కతాలో విద్యార్థులు, డాక్టర్లు, పౌరులు సహా అనేక మంది నిరసనలు చేపడుతుంటే, నేరస్తులు మాత్రం బయట తిరుగుతున్నారు. బాధితుల్లో అనేక మంది కిండర్ గార్టెన్ (కెజి) పిల్లలు కూడా ఉన్నారు’ అని ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రక్షాబంధన్ సందర్భంగా పాఠశాల విద్యార్థుల బృందంతో తాను మాట్లాడిన సందర్భాన్ని ద్రౌపదీ ముర్ము గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో నిర్భయ తరహా ఘటన పునరావృతం కాబోవని హామీ ఇవ్వగలరా అని బడి పిల్లలు అమాయకంగా తనను అడిగారని తెలిపారు. 2012 డిసెంబర్లో ఢిల్లీలో ఫిజియోథెరపి విద్యార్థి దారుణ అత్యాచారం, హత్య ఘటనను వారు ప్రస్తావించారు. ఆగ్రహంతో ఉన్న దేశం అప్పుడు అనేక ప్రణాళికలు, వ్యూహాలను రూపొందించిందని, నాటి చర్యలు కొంత మార్పు తీసుకువచ్చాయని రాష్ట్రపతి అన్నారు. అయితే నాటి నుంచి 12 ఏళ్లో అలాంటి ఘటనలే అసంఖ్యాకంగా జరిగాయని, అందులో కొన్ని మాత్రమే దేశం దృష్టికి వచ్చాయని ముర్ము అన్నారు.
మనం గుణపాఠాలు నేర్చుకున్నామా?
‘మనం గుణపాఠాలు నేర్చుకున్నామా? సామాజిక నిరసనలు తగ్గుముఖం పట్టగానే ఇలాంటి (నిర్భయ) ఘటనలు సామాజిక స్మృతిపథంలో గుర్తు లేనంత లోతుగా పూడ్చబడుతున్నాయి. మరో నీచమైన నేరం జరిగినప్పుడు వాటిని గుర్తు చేసుకుంటున్నామ’ని రాష్ట్రపతి పేర్కొన్నారు. మహిళలు తాము గెలుపొందేందుకు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంచులో పోరాటాలు చేయాల్సి వచ్చిందని అన్నారు. మహిళల హక్కుల విస్తరణకు సామాజిక అపోహలు, కట్టుబాట్లు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఇది అత్యంత శోచనీయమైన ఆలోచనా ధోరణి అని, ఈ ఆలోచన విధానంలో మహిళలను మనిషిగా తక్కువగా, తక్కువ శక్తివంతులుగా, తక్కువ సమర్థులుగా, తక్కువ మేథస్సు కలిగిన వారిగా చూస్తారని అన్నారు. కొంత మంది ఇలాంటి వాళ్ళు మహిళలను వస్తువుగా చూడడమే వారిపై నేరాలకు కారణమని రాష్ట్రపతి అన్నారు. ఇలాంటి అభిప్రాయాలు అలాంటి వారిలో బలంగా నాటుకుపోయాయని, దానిని తిప్పి కొట్టే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకురావడం ప్రభుత్వం, సమాజాల కర్తవ్యమని నొక్కి చెప్పారు. చరిత్ర తరచు గాయపరుస్తుందని, చరిత్రను ఎదుర్కొనేందుకు భయపడి సమాజం ‘సామూమిక మతిమరుపు’ను ఎంచుకొని, తమ తలలను ఆస్ట్రిచ్ పక్షిలా ఇసుకలో దూరుస్తుందని ముర్ము అన్నారు. దారుణ ఘటనల విషయంలో సమాజం తనను తాను నిష్పాక్షికమైన ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనకు తానుగా కొన్ని కష్టమైన ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలని అన్నారు. ‘మనం ఎక్కడ తప్పు చేశాం? లోపాలను సరిచేయడానికి మనం ఏమి చేయవచ్చు? అనే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనకపోతే, మన జనాభాలో సగం మంది స్వేచ్ఛగా జీవించలేరు‘ అని ముర్ము తెలిపారు. ఇప్పటికే జరిగిన ఘటనలను గుర్తుంచుకుని, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆకృత్యాలకు ఏ నాగరిక సమాజం కూడా తమ కుమార్తెలను, సోదరీమణులను ఎప్పటికీ బలి ఇవ్వదు. నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్ల కాలంలో సమాజం ఎన్నో అత్యాచార ఘటనలను మరిచిపోయింది. ఇటువంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైనది. గత తప్పులను ఎదుర్కొనేందుకు సమాజం భయపడుతోంది. కానీ ఇప్పుడు చరిత్రను సమూలంగా మార్చేందుకు సమయం ఆసన్నమైంది. సమగ్రమైన రీతిలో ఈ సమస్యను నిర్మూలించేందుకు ప్రయత్నిద్దాం” రాష్ట్రపతి పేర్కొన్నారు.