నిబంధనలు ఎత్తివేయాలి
అందరికీ రూ. 2 లక్షల రైతు రుణాలు మాఫీ చేయాల్సిందే
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనలు
ప్రజాపక్షం/హైదరాబాద్/ఖమ్మం
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం బేషరుతుగా మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హమీ ప్రకారం నిబంధనలన్నీ ఎత్తివేసి రూ.2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పలు జిల్లా కేంద్రాల్లో రైతులు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాల్లో రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రూ.2లక్షల వరకు ఉన్న ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేస్తామని చేసిన ప్రకటనను ప్రభుత్వం నిలుపుకోవాలని ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సుమారు 53 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, మిగిలిన వారికి కూడా వెంటనే మాఫీ చేయాలని రైతులు నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు, అందుబాటులో ఉన్న ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. రంగరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఖమ్మం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వద్ద నిర్వహించిన ధర్నాలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతీరైతుకూ రూ.2 లక్షల వరకు బేషరుతుగా రుణమాఫీ చేసి ఎప్పుడు పుట్టెడు కష్టంలో ఉండే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం రుణాలు తీసుకన్న రైతుల సంఖ్య 43.91 లక్షలు కాగా, ఇందులో ఇప్పటి వరకు కేవలం 22,37,848 మందికి మాత్రమే రుణ మఫీ జరిగిందని, ఇంకా 47 శాతం మంది రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉందన్నారు. కుటుంబ నిర్ధారణ, తప్పు ఒప్పులు, ఇలా రక రకాల కారణాలతో రైతుల రుణా మాఫీని నిలిపివేయడం సమంజసం కాదన్నారు.
చివరి ఖాతాకు రుణమాఫీ : మంత్రి తుమ్మల
కాగా, ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాదిగా తరలి వచ్చిన రైతులు వి. వెంకటాయపాలెం నుంచి నూతన కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనతో వైరా ఖమ్మం రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 41,78,892 మంది రైతులు 40 బ్యాంకుల ద్వారా 5,782 బ్రాంచీల నుండి రుణాలు తీసుకున్నారని అందుకు గాను ప్రభుత్వం రూ.31వేల కోట్లను కేటాయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 12 డిసెంబరు 2018 నుండి 9 డిసెంబరు 2023 వరకు తెలంగాణ రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆ ప్రక్రియ అమలు అవుతుందన్నారు. ఇప్పటి వరకు 12వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల నుంచి తిరిగి రుణాలుగా పొందారని మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చేస్తామన్నారు. కుటుంబ నిర్దారణ జరగకనే రుణమాఫీ ఆలస్యం అవుతుంది తప్ప ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని తుమ్మల స్పష్టం చేశారు. మంగళవారం నుంచి వ్యవసాయాధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి అక్కడే కుటుంబ సభ్యుల ఫోటోలను యాప్‌లో అప్లోడ్ చేస్తారని తద్వారా రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. రేషన్‌కార్డులు, పాసుపుస్తకాలు లేకపోయినా రుణమాఫీ అమలవుతుందని ఆయన తెలిపారు. రెండు లక్షలకు పైబడిన రైతులు, రెండు లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని బ్యాంకులలో చెల్లిస్తేనే ప్రభుత్వం తరుపున రెండు లక్షలు జమ చేస్తామని తుమ్మల తెలిపారు. ప్రభుత్వం దీనికి సంబంధించి వివరాలను త్వరలో విడుదల చేస్తామని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన హామీ ఇచ్చారు. రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ విషయంలో రైతులు ఎటువంటి అనుమానాలకు గురి కావద్దన్నారు.