నేటి నుంచి హన్మకొండలో సిపిఐ రాష్ట్ర
ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
ప్రజాపక్షం/హన్మకొండ ప్రతినిధి
సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలకు చారిత్రక మహానగరం, కాకతీయుల రాజధాని వరంగల్ మరోసారి వేదిక కాబోతున్నది. ఈ నెల 22 నుండి 24 వరకు హన్మకొండలో మూడు రోజుల పాటు సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు హన్మకొండలో జరుగనున్నాయి. ఈ సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ వేదికగా రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి డి. రాజా హాజరవుతునట్లు చెప్పారు. అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, మాజీ ఎంపి అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సమావేశంలో కార్యదర్శి నివేదిక సమర్పిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై, దేశంలో, రాష్ట్రం లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిపారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. కాగా గతంలో హన్మకొండ వేదికగా సిపిఐ రాష్ట్ర మహాసభలు, రాష్ట్ర నిర్మాణ మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులు గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏర్పాట్లు పూర్తి చేశారు.
జెండాలు, బ్యానర్లతో హన్మకొండ ముస్తాబు
మూడు రోజుల పాటు నిర్వహించనున్న సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలకు వేదిక అయిన హన్మకొండలో సిపిఐ జెండాలు, బ్యానర్లను కట్టారు. నగరంలో ప్రధాన దారుల వెంట, కూడళ్లలో ఎర్ర జెండాలు రెపరెపలాడుతుండగా సమావేశాలు జరుగనున్న కాకతీయ హరిత హోటల్ ప్రాంతంలో జాతీయ, రాష్ట్ర నాయకులుకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.