పదిమందితో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు
కోల్‌కతా ఘటనపై బెంగాల్ సర్కార్‌కు మొట్టికాయలు
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం భయానకమైనది
దేశం మరో ఇలాంటి ఘటన కోసం నిరీక్షించే పరిస్థితి తలెత్తకూడదని వ్యాఖ్య
టాస్క్‌ఫోర్స్ సభ్యులు
డా. నాగేశ్వర్ రెడ్డి (ఏఐజీ)
డా. ఎం. శ్రీనివాస్ (దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్),
డా. ప్రతిమ మూర్తి, బెంగళూరు,
డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి
డాక్టర్ సౌమిత్ర రావత్
ప్రొఫెసర్ అనితా సక్సేనా, ఎయిమ్స్ ఢిల్లీ కార్డియాలజీ హెడ్
ప్రొఫెసర్ పల్లవి సప్రే (డీన్- గ్రాంట్ మెడికల్ కాలేజ్, ముంబయి)
డాక్టర్ పద్మ శ్రీవాస్తవ (న్యూరాలజీ విభాగం, ఎయిమ్స్)
క్యాబినెట్, కేంద్ర హోం, ఆరోగ్య శాఖల కార్యదర్శులు,
నేషనల్ హెల్త్ కమిషన్ ఛైర్పర్సన్
న్యూఢిల్లీ : డాక్టర్లు, ఆరోగ్యసంరక్షణ సిబ్బంది రక్షణ కోసం ఒక జాతీయ భద్రతా ప్రొటోకాల్‌ను రూపొందించేందుకు 10మంది సభ్యులతో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్.టి.ఎఫ్)ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ నేతృత్వంలోని 10మంది సభ్యుల నేషనల్ టాస్క్‌ఫోర్స్ మూడు వారాలలోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ దారుణ హత్య కేసు విచారణలో దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్ట్‌ను అందజేయాలని ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని ఆదేశించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజి, హాస్పిటల్లో ట్రైనీడాక్టర్ హత్యాచార కేసుపై మంగళవారం సుప్రీంకోర్ట్ సుమోటో విచారణను ప్రారంభించింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఈ కేసు విషయంలో అనుసరించిన తీరుపై సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేస్తూ గట్టిగా మొట్టికాయలు వేసింది. ఈ హత్యాచార సంఘటన ‘భయానకమైనదని’ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ హత్యాచార సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు ఆలస్యం అయ్యిందని, వేలాదిమంది దుండగులు ప్రభుత్వ వైద్యశాలపై పడి విధ్వంసానికి పాల్పడుతుంటే ముందస్తుగా ఎందుకు పసిగట్టలేదని, నివారించలేదని ప్రశ్నలు సంధిస్తూ ధర్మాసనం ప్రభుతాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దేశవ్యాప్తంగా ఈదారుణ హత్యాచార ఘటనపై నిరసనలు పెల్లుబికుతున్న తరుణంలో విధ్వంసకారులపట్ల సున్నితంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం ఉన్న దా? అంటూ మండిపడింది. క్షేత్రస్థాయిలో మార్పులను తీసుకువచ్చేందుకు దేశం మరో అత్యాచారం, హత్య కోసం దేశం నిరీక్షించే పరిస్థితి తలెత్త కూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రఆవేదనను వ్యక్తంచేసింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే, వారు పనిచేస్తున్న చోట భద్రత కల్పించలేకపోతే, మనం వారి సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్జి కార్ హాస్పిటల్ విధ్వంసంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంపై ఒక నివేదికను అందజేయాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. హత్యాచారానికి గురైన బాధితురాలి ఫొటోలు, వీడియో క్లిప్పింగులు, నిర్జీవంగా పడిఉన్న శరీరాన్ని యావత్ ప్రపంచానికి మీడియా ద్వారా ప్రదర్శించడంపై కూడా ధర్మాసనం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆర్జికార్ హాస్పిటల్లో అల్లరి మూకలు పాల్పడిన విధ్వంసానికి పాల్పడుతున్నప్పుడు కోల్‌కతా పోలీసులు ఘటనా స్థలం నుంచి పారిపోవడా న్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఆహాస్పిటల్ వైద్యులు తిరిగి తమవిధులను నిర్వర్తించేందుకు తగిన భద్ర త కల్పించాల్సిన అవసరం ఉన్నదని, వెంటనే ఆర్జి కార్ మెడికల్ కాలేజి, హాస్పిటల్ వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్ఎఫ్)ను మోహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య అనంతరం జరిగిన ప్రదర్శనలు, విధ్వంసాలు శాంతిభద్రతలకు విఘా తం కలుగుతాయని బెంగాల్ ప్రభుత్వం అంచనావేసి మెడికల్ కాలేజి, హాస్పిటల్ వద్ద అధికార, పో లీస్ యంత్రాంగాన్ని మోహరింపజేయడంలో వైఫ ల్యం చెందిందని మందలించింది. మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్‌ఘోష్ ట్రైనీ డాక్టర్ హత్యాచార సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ తల్లిదండ్రులకు తెలియజేయడం, హాస్పిటల్‌కు వచ్చిన తల్లిదండ్రులను చాలా గంటల సమయం గడిచిన తర్వాత కూతురు మృతదేహాన్ని చూసేందుకు అనుమతించడాన్ని ప్రధాన న్యాయమూర్తి డివై.చంద్రచూడ్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆసుపత్రులలో ఎమర్జెన్సీ సేవలు అందించే రూముల వద్ద అదనపు భద్రతా ఏర్పాట్ల అవసరం ఉంటుందని, పేషెంట్లకు కాకుండా వారి సంబంధి త అటెండెంట్లను, విజిటర్లను తనిఖీ చేసి హాస్పిటల్ లోపలకు అనుమతించాలని, వైద్య సంరక్షణ సిబ్బంది, వైద్యులపై దాడులు జరగకుండా నివారించాలని, వైద్య నిపుణుల కోసం అత్యవసర పరిస్థితులలో హెల్ప్‌లైన్ నెంబర్ల సౌకర్యం కల్పించాలని, లింగభేదంతో సంబంధం లేకుండా పనిచేసే చోట వైద్యులు, నర్సులకు రెస్ట్‌రూమ్స్ కల్పించాలని, అక్కడ బయో మెట్రి క్, రికగ్నేషన్ పరికరాలను ఏర్పాటు చేయాలని, రాత్రి 10గంటల నుంచి తెల్లవారు జామున ఆరుగంటల సమయంలో రవాణా సౌకర్యం కల్పించాల ని ధర్మాసనం వైద్యుల భద్రత విషయంలో పలు సూచనలు చేసింది. ఇకమీదట ఎలాంటి హత్యాచార ఘటనలు, వైద్యులపై దాడు లు జరగకుండా నివారించేందుకు ఎన్‌టిఎఫ్ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను నియమించాల్సిన అవసరాన్ని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం నొక్కిచెప్పింది.