HomeNewsLatest Newsనాడు మేధావులు నోరు మెదపలేదేం!

నాడు మేధావులు నోరు మెదపలేదేం!

గత బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకుంటే కెసిఆర్‌ను ఎందుకు ప్రశ్నించలేదు?
జెఎసి, ప్రజాసంఘాల ప్రతినిధులు నిలదీత
కెసిఆర్‌కు అధికారం లేకపోతేనే మేధావులకు మాటలొస్తాయా? అని ప్రశ్న

ప్రజాపక్షం/హైదరాబాద్‌
గత పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే మేధావులు ఎందుకు నోరు మెదపలేదని తెలంగాణ జెఎసి, ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. తెలంగాణ సచివాలయంలోపల, బయట, అసెంబ్లీలో, ప్రగతిభవన్‌ అనే గడీలోపల ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని పెట్టాలని ఈ మేధావులు కెసిఆర్‌ను అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. కెసిఆర్‌కు అధికారం లేకపోతేనే మేధావులకు మాటలు వస్తాయా ? అని తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, బుద్ధిజీవులను తెలంగాణలోని విద్యావేత్తలు, ప్రజాసంఘాల నేతలు ప్రశ్నించారు. ‘ఏ పదవుల కోసం మీ పెదవులు ఇంతకాలం మూసుకున్నారని, కెసిఆర్‌కు అధికారం పోతే మీకెందుకు బాధ కలుగుతున్నదని’ వారు నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర మేధావులుగా చెప్పుకుంటున్న వారికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా?, లేదా కెసిఆర్‌ ,ఆయన కుటుంబ ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్థిత్వాన్ని, పోరాట నేపథ్యాన్ని, ప్రశ్నించే గొంతులను గత పదేళ్ల పాటు కాలరాస్తే ఈ మేధావులు ఎందుకు నోరుమెదపలేదని వారు మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని గత పాలకులను ఎందుకు ప్రశ్నించలేక పోయారన్నారు. ఈ మేరకు ప్రొఫసర్‌ ఇటిక్యాల పురుషోత్తం(టిజెఎసి )బుగ్గ మైశయ్య (తెలంగాణ భూరక్షణ సమితి), మేడి పాపయ్య (ఎంఆర్‌పిఎస్‌),శ్రీరాం శివకుమార్‌(ఎరుకల సంక్షేమ సంఘం), కొర్ర శరత్‌ నాయక్‌ (గిరిజన శక్తి ) వరంగల్‌ రవి (తెలంగాణ తీన్మార్‌), జంపాల రాజేశ్‌(తెలంగాణ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ), వలిగొండ నర్సింహ (తెలంగాణ స్టూడెంట్‌ పొలిటికల్‌ జెఎసి), రెడ్డిశ్రీను ( జయశంకర్‌ విద్యార్థి సంఘం), కొమ్ము ప్రవీణ్‌ (తెలంగాణ మాదిగ లాయర్స్‌ ఫెడరేషన్‌ ), కొండ్రు శంకర్‌ మాదిగ (పారిశుద్ధ్య కార్మికుల సంఘం), కాలుకుంట్ల స్వామి ( మాదిగ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌), గడ్డం జ్యోతి(మాదిగ మహిళా సమైఖ్య), తూర్పాటి హనుమంతు (బుడగ జంగాల దండు), బాణాల మంగేష్‌(డక్కలి హక్కుల పోరాట సమితి), భట్టు దాసురావు (దళిత ఐక్యవేదిక),స్వామి(మాస్టీ సంఘం) బహిరంగ ప్రశ్నలతో మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో టిజి అని వాడితే, కేవలం ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఎస్‌ అని పెట్టినా ఆ మేధావుల నోళ్లు ఎందుకు మూతపడ్డాయని, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం చేయకుండా గొంతు నొక్కితే ఎందుకు ప్రశ్నించలేదని పేర్కొన్నారు. అప్పటి సిఎంను కలవడానికి వెళ్లిన ప్రజా గాయకుడు గద్దర్‌ను ప్రగతి భవన్‌ ముందు మండుటెండలో గంటల తరబడి నిలబెట్టారని, తెలంగాణ జెఎసి చైర్మన్‌గా ముందుండి రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు పోరాడిన ప్రొఫెసర్‌ కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి, ఆయనను పోలీసులు అరెస్టు చేస్తే మేధావుల గొంతులు ఎందుకు పెగలలేదని అన్నారు. ఉద్యమకారులను కట్టెలతో ఉరికించి తరిమికొట్టిన వారికి, తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చినప్పుడు మేధావుల పెదవులు ఎందుకు మూసుకున్నారని, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌కు గౌరవం ఇవ్వకపోతే ఎందుకు మాట్లాడలేదన్నారు. భారతదేశంలో మొట్టమొదటి సారి టెక్నాలజీని ప్రోత్సహించిందే మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌ గాంధీ అని,ఆయన విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేస్తే, తాము అధికారంలోనికి వచ్చిన తర్వాత కూల్చివేస్తామనే మాటలు సంఘ విద్రోహులు వాడే మాటలు అని వారు పేర్కొన్నారు. నాసిరకమైన ప్రాజెక్టు పనులపైన, నాణ్యతలేని కలెక్టరేట్లను నిర్మించినప్పుడు, విద్యా, ఉద్యోగ సమస్యలపైన గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించినప్పుడు ఈ మేధావుల గొంతులు ఎందుకు మూగబోయాయని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని, రైతులకు రుణమాఫీ చేసిన పార్టీని విమర్శించడం, ఒక మాజీ ప్రధాని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే ఆక్షేపించడంపైన కొందరు మేధావులు ఆత్మ విమర్శ చేసుకోవాలని వారు సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments