ప్రపంచ దేశాల ఆందోళన
జెనీవా: ఎంపాక్స్‌గా పిలుస్తున్న మంకీపాక్స్ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీని కట్టడికి చర్యలు మొదలు పెట్టాయి. ఈ కేసులు ప్రారంభంలో కనిపించిన ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దేశాల్లో ఎంపాక్స్ కేసుల సంఖ్య 18,737కు చేరింది. ఈ నేపథ్యంలో ఎంపాక్స్ వైరస్ కట్టడికి తాము ఏర్పాటు చేసిన అత్యవసర కమిటీ సిఫార్సులను త్వరలోనే విడుదల చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ప్రకటించింది. ఈ సమస్యపై దృష్టి పెట్టిన ఆఫ్రికా దేశాలు జింబాబ్వేలో సమావేశమై పరిస్థితిపై సమీక్ష జరిపాయి. కేవలం ఒక వారం వ్యవధిలోనే 1200లకుపైగా కేసులు నమోదైనట్లు ఆఫ్రికా సమాఖ్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లేడ్ 1 వేరియంట్‌తోపాటు అన్ని రకాల వైరస్‌లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 541 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 96 శాతం కేసులు, మరణాలు కాంగోలోనే నమోదవుతుండగా ఈ ఒక్క వారంలో 222 కేసులు నిర్ధరణ అయ్యాయి. 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించగా మరణాలరేటు 2.89శాతంగా ఉంది. ఇలావుంటే, కాంగో సరిహద్దు దేశం బురుండిలో ఈ వారంలో 39 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఆఫ్రికా వెలుపల పాకిస్థాన్, స్వీడన్‌లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. ఈ వైరస్ విజృంభణ వేళ డబ్ల్యుహెచ్ఒ ఇప్పటికే అత్యవసర స్థితిని ప్రకటించిన విషయం తెలిసిందే. విపత్తుపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలో ఆ కమిటీ తొలి దశ సిఫార్సుల్ని ప్రచురిస్తామని డబ్ల్యుహెచ్ఒ తాజా ప్రకటనలో తెలిపింది. స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. కాగా, జింబాబ్వేలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ సొసైటీ దేశాలు కోరలుచాస్తున్న ఎంపాక్స్ వైరస్‌పై చర్చించారు. డబ్ల్యుహెచ్‌ఒతో పాటు పలు దేశాల వ్యాధి నియంత్రణ సంస్థలు, అంతర్జాతీయ విభాగాలు దీనిని నియంత్రించడానికి ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ వ్యాధి ప్రభావిత దేశాలకు సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించారు. ఎంపాక్స్ అంటు వ్యాధి కావడంతో, ఆఫ్రికా దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు జరిపే వ్యాపారుల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి విషమించలేదని, అయితే, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ఎంపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది వ్యాధి సోకిన జంతువుల లేదా మనుషుల నుంచి వ్యాప్తి చెందుతుంది. రోగితో లైంగిక లేదా సన్నిహితంగా మెలిగినా వైరస్ వ్యాప్తి చెందుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గతంలో వ్యాపించిన వైరస్ నోరు, ముఖం, చేతులు, కాళ్లపై ప్రభావం చూపిస్తే ప్రస్తుతం ఎక్కువగా జననేంద్రియాల వద్ద ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా రోగుల గుర్తింపు కష్టమై వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. 1970లో కాంగోలో తొలిసారి ఇది మనిషికి సోకినట్లు గుర్తించారు. ప్రాణాంతకమైన క్లాడ్ 1 వేరియంట్ ఎక్కువగా కాంగో బేసిన్లోనే ఎక్కువగా ఉంది.
ఎంపాక్స్ విజృంభణ..
RELATED ARTICLES