దేశాన్ని పట్టిపీడుస్తున్న సమస్యల్లో ప్రధానమైనది ‘నిరుద్యోగం’. గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగితా శాతం పెరిగిపోయినప్పటికీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాటలతో మభ్యపెడుతున్నది. చేతల్లో మాత్రం చిత్తశుద్ధి లోపించింది. నిరుద్యోగులుకు శుష్క వాగ్దానాలు.. శూన్యహస్తాలే మిగులుతున్నాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని 2014 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, నిరుద్యోగుల ఓట్లను కొల్లగొట్టిన బిజెపి, ఆ తర్వాత పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. హామీని అటకెక్కించింది. ప్రతిసారీ ఏదో ఒక కొత్త పథకం లేదా నినాదంతో హడావుడి చేయడం తప్ప, నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం వల్ల ఒరుగుతున్నది ఏమీ లేదు. ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024- ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని పదేపదే చెప్పారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా 23 సార్లు ఉపాధి కల్పనను ప్రస్తావించారు. ఇటీవల కాలంలో నిరుద్యోగ సమస్య తారస్థాయికి చేరుకోవడంతో, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నందుకే, నిర్మల ఈ అంశాన్ని అంతగా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. బడ్జెట్‌కు ముందు సభలో ఉంచిన ఆర్థిక సర్వే ప్రకారం, 2022 ఆర్థిక సంవత్సరంలో మన దేశ శ్రామిక శక్తి దాదాపు 56.5 కోట్లు. వీరిలో 40 శాతం మంది వ్యవసాయ రంగంలో, 11.4 శాతం మంది తయారీ రంగంలో, 28.9 శాతం సేవా రంగంలో, 13 శాతం నిర్మాణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అధికారిక నిరుద్యోగితా రేటు 3.2 శాతం మాత్రమే. కానీ, ఈ లెక్కకూ, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యకూ సారూప్యం లేదు. లక్షలాది మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటూ, ఆర్థికంగా పతనమవుతుంటే, ఈ సమస్య చాలా తక్కువగా ఉందనడం వాస్తవాన్ని కప్పిపుచ్చడమే.
2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, పట్టం నిరుద్యోగం 6.7 శాతంగా ఉందని, 2022 ఇది 10 శాతమని ఆర్థిక సర్వే చెప్తున్నది. అయితే, శ్రామిక శక్తిని, నిరుద్యోగితా శాతాన్ని లెక్కించడానికి అనుసరించిన విధానాలు ఏమిటనేది ప్రశ్న. ప్రమాణికాలు లేని సర్వే నివేదికలతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. 2017- రెగ్యులర్ జీతాల కార్మికుల శాతం 22.8 శాతం నుండి ఐదు సంవత్సరాల కాలంలో 20.9 శాతానికి పడిపోయింది. ఉపాధి పొందుతున్న వారుగా సర్వేలో చూపుతున్న ఎంతో మందికి స్థిరమైన జీతభత్యాలు లేవు. ఎంతో మంది అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారు. వారికి స్పష్టమైన కార్మిక ఒప్పందాలుగానీ, సామాజిక భద్రతా ప్రయోజనాలుగానీ, అధికారిక ఉపాధిగానీ లేవు. మొదటిసారి ఉద్యోగులను నియమించుకోవడం కోసం రూ. 15,000 వరకు వేతన రాయితీని కేంద్ర ప్రకటించింది. కోటి మందికి ఇది వర్తిస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయం సంతోషకరమే. కానీ, ఇది ఊరట మాత్రమే… నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కానేకాదు. తయారీ రంగంలో ఈ వేతన రాయితీలు రూ. 25,000 వరకూ ఉంటాయి. పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో వసతులు పెంచడానికి, సౌకర్యాలను సమకూర్చుకోవడానికి వీలుకల్పిస్తున్నట్టు కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే, వృత్తి శిక్షణా సంస్థలకు ప్రోత్సాహకాలు, మొదటిసారి ఉద్యోగం చేరిన వారికి సహకారాలు వంటి పథకాల అమలులో కొన్ని సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఉదాహరణకు మొదటిసారి ఉద్యోగి సబ్సిడీని తీసుకుంటే, దీనిని మూడు వాయిదాలుగా చెల్లిస్తారు. సదరు ఉద్యోగి రెండో విడత మొత్తాన్ని పొందడం కోసం ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యతా కోర్సును పూర్తి చేయాలి. వివిధ రంగాల్లో ఇది అసాధ్యం. ఏదైనా కారణం చేత సదరు ఉద్యోగి 12 నెలలలోపు ఉద్యోగాన్ని విడిచిపెడితే, ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని యాజమాన్యాలు తిరిగి చెల్లించాలి. చిన్న, సూక్ష్మ పరిశ్రమల యాజమాన్యాలు ఇలాంటి ఆర్థిక పరమైన భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉండవు. అందుకే, అప్పటికే ఏదో ఒక ఉద్యోగం చేసిన వారినే నియమించుకుంటాయి. మరో సమస్య ఏమిటంటే, ఉత్పాదక ఉపాధి కల్పన పథకానికి అర్హత సంపాదించాలంటే, సదరు కంపెనీలో కనీసం 50 మంది లేదా అప్పటికే ఉన్న శ్రామిక శక్తిలో 25 శాతం మందిని కొత్తగా నియమించుకోవాలి. ఉది ఉపాంత ప్రయోజనాలను కోరుకునే చిన్న సంస్థలకు మోయలేని మారుతుంది. కొత్త ఉద్యోగుల నియామకానికి అయ్యే ఖర్చును యాజమాన్యాలకు తగ్గించడానికి తప్ప ఈ పథకాల వల్ల ఆశించిన ప్రయోజనాలు ఉండవు. అర్థవంతమైన ఉపాధిని సృష్టించడానికి ప్రయత్నాలు జరగినప్పుడే, నిరుద్యోగ సమస్యకు కొంతవరకైనా పరిష్కారం లభిస్తుందే తప్ప, కేంద్రం అట్టహాసంగా ప్రకటించిన ‘మొదటి జీతం రాయితీ’ వంటి పథకాల వల్ల కాదన్నది నిజం. చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగాల్లో ఉద్యోగితను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వాటిని ప్రోత్సహించి, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగుల వేతనాలు పెరిగే దిశగా చర్యలు తీసుకోవాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) వేతనాలను పెంచడం, వినియోగం అత్యవసరం. అదే విధంగా, వివిధ వస్తుసేవల డిమాండ్ పెంచడానికి వీలుగా, ఉద్యోగుల వేతనాలను ఎప్పటికప్పుడు సవరించాలి. మౌలిక అంశాలను విస్మరించి, ఎలాంటి పథకాలను అమలు చేసినా లాభం ఉండదు.