దోషులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలి
ఘటనను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు నిరసనలు
పెరుగుతున్న నిత్యావసరాలకు వ్యతిరేకంగా 1 తేదీ వరకు ఆందోళనలు
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ
ప్రజాపక్షం/హైదరాబాద్
కోల్‌కతాలోని ప్రభుత్వ డాక్టరుపై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు. ఆర్‌జీకర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచరణ ఘటన మరో నిర్భయ కేసు అని అన్నారు. దోషులను తక్షణమే అరెస్టు చేసి,వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న ధరలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుంచి 7వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు నారాయణ తెలిపారు. హైదరాబాద్‌లోని మగ్ధుంభవన్‌లోని శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, ఈ.టి.నరసింహతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు.పోస్టుమార్టం నివేదిక ప్రకారం డాక్టర్‌పై కొంతమంది దుండుగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను అతికిరాతకంగా చంపినట్టు స్పష్టమవుతుందన్నారు. ‘డాక్టర్ హత్యాచార ఘటన’కు సంబందించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వ్యవహరించి తీరు అసంబద్దంగా ఉన్నదని, ముఖ్యమంత్రి మమత బెనర్జీ సైతం స్పందించిన తీరు సరిగ్గా లేదని, ఈ ఘటన పట్ల ఆమె నైతిక బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. నిరసన పేరుతో కొందరు దుండగులు ఆసుపత్రిపై దాడికి యత్నించి అత్యాచార ఘటనకు సంబంధించి సాక్ష్యాధారాలు లేకుండా చేయడం సరైంది కాదన్నారు. జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి ఆనంద్‌బోస్ స్పందించాల్సిందేనని , కానీ మీడియా సమావేశంలో ఆయన ఒక గవర్నర్‌లాగ కాకుండ బిజెపి నాయకునిగా , కార్యకర్తగా మాట్లాడడం ఆక్షేపణీయమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ, రాజకీయభర్తీల కారణంగా పూర్తిగా దళారివ్యవస్థగా మారిందని నారాయణ విమర్శించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వంపైనా కేంద్ర ప్రభుత్వం కక్షకడితే, ఆ రాష్ట్ర గవర్నర్ అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీవి అన్ని అబద్ధాలే ః నారాయణ
దేశ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ అన్ని అబద్దాలే మాట్లాడారని నారాయణ ఆరోపించారు. భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నామని ప్రధాని చెప్పాడం శుద్ద అబద్దామన్నారు. ప్రధాని కేవలం కార్పొరేట్ శక్తులకు రెడ్‌కార్పెట్ వేసి,అదానిని మాత్రమే ముందుకు తీసుకుపోయేలా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే అత్యంత శక్తివంతమైన సెబినీ కూడా ఆయన నిర్వీర్యం చేసి, దాని చైర్మన్ ద్వారా అదానికి అనుకూలంగా పని చేసేలా మార్చివేశారని విమర్శించారు. ఓట్ల కోసం బిజెపి ప్రభుత్వం దేశాన్ని విచ్చినం చేసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. ఇందులో భాగమే యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో మతాల మధ్య చిచ్చులు పెడుతోందని దుయ్యబట్టారు. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయవాదంతో సెంటిమెంట్ ఉందని, ఈ క్రమంలో దేశాన్ని పూర్తిగా సమైఖ్యంగా ఉంచేందుకు అచీ తూచి వ్యవహరించాల్సి ఉండగా, నియతృత్వ దోరణితో కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని డాక్టర్ కె.నారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి,గత సిఎం కెసిఆర్ వెనకడుగు వేశారన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీ మేరకు ఈ ఏడాది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాను డైనమిక్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న సిఎం రేవంత్‌రెడ్డి ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట’ వారోత్సాలను అధికారికంగా నిర్వహించి, తన మాటను నిలుపుకోవాలని, లేదంటే ఆయన రిమోట్ కూడా ఇతర చేతుల్లో ఉన్నట్టుగా భావించాల్సి వస్తుందని తెలిపారు.
హైదరాబాద్‌లో ప్రత్యాన్మయం తర్వాతే ఇళ్లను తొలగించాలి
నాలలను విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడినందుకే హైదరాబాద్ మహా నగరం చిన్నపాటి వర్షానికి ముప్పునకు గురవుతుందని నారాయణ అన్నారు. చెరువులు, కుంటలు, నాలా కబ్జాలను అరికట్టడానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయడం మంచిదేనన్నారు. ఈ సంస్థ కబ్జాల పేరుతో నిరుపేదలపై ప్రతాపం చూపించడం మాత్రం సమర్థనీయం కాదన్నారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాకు పాల్పడిన రాజకీయ నాయకులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలాలను తిరిగి పేదలు,మధ్య తరగతి ప్రజలకు విక్రయించారని, ఎవరో చేసిన పాపానికి , ప్రజలను శిక్షించడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ కబ్జాలను తొలగించాలంటే ముందు అక్కడ ఉంటున్నవారికి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వస్థలాలను కబ్జాలకు పాల్పడిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డబ్బులను వసూలు చేయాలని ప్రభుత్వాన్ని నారాయణ డిమాండ్ చేశారు.