HomeNewsLatest Newsశాంతి చర్చలు ఫలించేనా?

శాంతి చర్చలు ఫలించేనా?

జెరుసలేం/కతార్‌: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధం, అక్కడ జరుగుతున్న మానవ హననం పట్ల యావత్‌ ప్రపంచం ఆందోళన చెందుతున్నది. ఈ నేపథ్యంలో మొదలైన శాంతి చర్చలు ఎంత వరకూ ఫలిస్తాయన్నది ప్రశ్న. అయితే, ఒక ఒప్పందం కుదిరి, కాల్పుల విరమణ అమల్లోకి రావాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటున్నది. కతార్‌లో శాంతి చర్చలు రెండో రోజుకు చేరుకోగా, ఇజ్రాయెల్‌ ప్రభుత్వంలో చర్చించేందుకు బ్రిటిషన్‌ విదేశాంగ మంత్రి డేవిట్‌ లామ్మీ, ఫ్రెంచ్‌ విదేశాంగ మంత్రి స్టెఫేన్‌ సెజోర్న్‌ శుక్రవారం జెరుసలేం చేరుకున్నారు. ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి రామ్‌ డెర్మెర్‌తో వీరు చర్చలు జరుపుతారు. కతార్‌లో గురువారం ప్రారంభమైన శాంతి చర్చల్లో అమెరికా, కతార్‌,ఈజిప్టు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరంతా ఇజ్రాయెల్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. హమాస్‌ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇప్పటికే, అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన, చేసిన సూచనలను హమాస్‌ సూత్రప్రాయంగా అంగీకరించింది. అమెరికా తదితర దేశాలు వర్గాల మధ్య రాజీ కుదర్చడానికి పలు సూచనలు చేసింది. అయితే, హమాస్‌ కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చిందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్నది. హమాస్‌ కూడా ఇదే విధమైన విమర్శలు చేయడం గమనార్హం. ప్రతిపాదిత అంశాలకు భిన్నంగా, కొత్త ప్రతిపాదనలను, డిమాండ్లను ఇజ్రాయెల్‌ చేస్తున్నదని విమర్శించింది. బహుశా ఈ కారణంతోనే తాజా చర్చలకు హమాస్‌ దూరంగా ఉంది. కాగా, చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయని కతార్‌ ప్రకటించింది.
ఇజ్రాయెల్‌, హమాస్‌ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనగలమన్న విశ్వాసం వ్యక్తం చేసింది. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న దాడుల్లో ఇప్పటి వరకూ 40,005 మంది మృతి చెందారని గాజా ప్రాంతీయ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నారని తెలిపింది. పాఠశాలలు, జనావాసాలపైన కూడా ఇజ్రాయెల్‌ దళాలు దాడులకు తెగబడడంతో, ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇజ్రాయెల్‌ మిలటరీ అధికార ప్రతినిధి రియర్‌ అడ్మిరల్‌ డానియల్‌ హగారీ ఇంత వరకూ 17,000 మంది హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు ప్రకటించాడు.
ప్రమాదకర పరిస్థితులు
ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఏ క్షణమైనా మరింత ఉధృత రూపం దాల్చే అవకాశం ఉంది. హమాస్‌ ఉగ్రవాదుల ఏరివేత అంటూ గాజా స్ట్రిప్‌, వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ మారణహోమాన్ని కొనసాగిస్తున్నది. తమ అగ్రనేతను హతమార్చినందుకు ప్రతీకారంగా లేబనాన్‌కు చెందిన హెజ్బుల్లా దళాలు ఇప్పటికే ఇజ్రాయెల్‌ భూభాగాలపై దాడులు చేస్తున్నాయి.బిరూట్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసినప్పుడు హెజ్బుల్లా కమాండర్‌ ఫవాద్‌ షుక్‌ మృతి చెందాడు. దీనితో హెజ్బుల్లా కూడా దాడులకు దిగింది. మరోవైపు ఇరాన్‌ రంగంలోకి దిగింది. పాలస్తీనాకు మద్దతుగా నిలబడి, ఇజ్రాయెల్‌ను నిలువరించేందుకు యుద్ధ సన్నాహాలు చేస్తున్నది.ఇరాన్‌కు అండగా నిలుస్తామని ఈజిప్టు ప్రకటించిన నేపథ్యంలో, ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కాల్పుల విరమణతో, ఇజ్రాయెల్‌ దూకుడును అడ్డుకుంటే తప్ప శాంతి స్థాపన జరగదు. తాజా చర్చలు ఎంత వరకూ ఈ ప్రయత్నంలో సఫలమవుతాయో చూడాలి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments