గత 75 ఏళ్లుగా మతతత్వ పౌరస్మృతితో కలిసి జీవిస్తున్నాం బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై 140 కోట్ల మంది భారతీయుల ఆందోళన మహిళలపై నేరాలపట్ల తక్షణ న్యాయవిచారణ జరపాలి స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధానమంత్రి మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపైన త్రివర్ణపతాకం ఎగురవేత
న్యూఢిల్లీ : ఉమ్మడి పౌరస్మృతికి ప్రధాని నరేంద్ర మోదీ కొత్తభాష్యం చెప్పారు. దానిని లౌకిక పౌరస్మృతి అంటూ పూర్తి విరుద్ధమైన పోలిక తెచ్చారు. గత 75 ఏళ్ళుగా మనం మతతత్వ పౌర స్మృతితో కలిసి జీవిస్తున్నామని, దేశానికి లౌకిక పౌర స్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ప్రధాని ఎగురవేశారు. పదకొండవసారి మూడు రంగుల జెండాను ఎగురవేసిన మోదీ 98 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. ఒక పెద్ద వర్గం ప్రస్తుత పౌర స్మృతిని మతతత్వ పౌర స్మృతిగా విశ్వసిస్తుండడం వాస్తవమేనని మోదీ అన్నారు. గత 75 ఏళ్ళుగా మనం మతతత్వ పౌర స్మృతితో పాటు జీవిస్తున్నామని, ఇది దేశాన్ని మతం ఆధారంగా విభజించి, అసమానతను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. ఇప్పుడు మనం లౌకిక పౌర స్మృతి దిశగా వెళ్తున్నామని, అది తక్షణ అవసరమని తెలిపారు. ఇదే రాజ్యాంగ స్ఫూర్తి అని, సుప్రీం కోర్టు సైతం అనేక మార్లు ఉమ్మడి పౌర స్మృతి అవసరమని చెప్పిందని, రాజ్యాంగ రూపకర్తల స్వప్నాన్ని సాకారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందువుల గురించి ఆందోళన
దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల భద్రతపై ఆందోళనతో ఉన్నారని మోదీ అన్నారు. త్వరలోనే అక్కడ సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో శాంతి, సంతోషం, సంపదతో ఉండాలని భారతదేశం ఎల్లప్పుడు కోరుకుంటుందని, ఆ దేశ అభివృద్ధి పయనం కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మహిళలు అన్ని రంగాలలో ఎదుగుతున్నారని, అదే సమయంలో వారిపై జరుగుతున్న నేరాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే న్యాయం జరిపేందుకు అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం భారతదేశం బంగారు యుగంలో ఉన్నదని , 2047 నాటికి ‘వికసిత్ భారత్’ అవుతుందని చెప్పారు. భారత రాజకీయాల నుండి కులతత్వం, బంధుత్వాన్ని పక్కకు నెట్టి , రాజకీయాలతో సంబంధం లేని కుటుంబాల నుంచి లక్ష మంది యువత రాజకీయాలలోకి రావాలని పిలుపునిచ్చారు. దీంతో కొత్త రక్తం నూతన ఆలోచనలతో రాజకీయాలను పరిపుష్టం చేస్తుందన్నారు. వారు ఏ పార్టీలోనైనా చేరవచ్చని చెప్పారు. విదేశాలలో వైద్య విద్య కోసం
మన విద్యార్థులు లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్నారని, వచ్చే ఐదేళ్ళలో కొత్తగా 75వేల వైద్య విద్య సీట్లను సృష్టిస్తామని మోదీ అన్నారు.
ప్రతిపక్షాలను పట్టించుకోవద్దు
దేశ ఎదుగుదలను జీర్ణించుకోలేని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొందరికి భారత సంక్షేమం గురించి పట్టదని పరోక్షంగా ప్రతిపక్షాలను మోదీ విమర్శించారు. అలాంటి వారిని ప్రజలు పట్టించుకోవద్దని, వారు తీవ్రమైన నిస్పృహలో ఉన్నారని అన్నారు. కేవలం కొద్ది మంది ఇలాంటి వికృత పనులు చేస్తూ ప్రతి దాని నాశనానికి కారణమవుతున్నారని, అరాచకానికి బాటలు వేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశానికి నష్టం కలిగిస్తుందని, దీంతో తాము నష్టాన్ని మరమ్మతు చేస్తూ సరికొత్త ప్రారంభం చేయాల్సి వస్తుందన్నారు. వారు ప్రతిదానిని నాశనం చేయాలనుకుంటున్నారని, దేశం దానిని అర్థం చేసుకోవాలని అన్నారు. అనేక అంతర్గత, బహిర్గత సవాళ్ళు ఉంటుంటాయని, భారత వ్యతిరేక ప్రణాళికల్లో విదేశీ శక్తులు భాగం కాలేవని, అలాగే దేశ ఎదుగుదలను ఆపలేవని, మన అభివృద్ధి మానవాళి సంక్షేమంతో ముడిపడి ఉన్నదని మోదీ అన్నారు. హిండన్‌బర్డ్ రీసెర్చ్ సంస్థ అదానీ, సెబీ చైర్‌పర్సన్ నివేదికల నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసారు. కొంత మంది అవినీతిని పెద్దగా చేసి చూపిస్తున్నారని, తాను అవినీతిపరుల్లో భయం కలిగించే వాతావారణాన్ని సృష్టిస్తున్నానని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని మోదీ అన్నారు. నలంద స్ఫూర్తితో విద్య కోసం విదేశాలకు వెళ్ళే భారతీయులు తిరిగి ఇక్కడకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్రాలూ పెట్టుబడులను ఆకర్షించాలి
అనేక మంది ప్రపంచ పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని, రాష్ట్రాలు కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు స్పష్టమైన ప్రణాళికతో రావాలని మోదీ సూచించారు. కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు తీసుకురావాలని ప్రధాని అన్నారు. దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థలు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు మూడు లక్షల పరిపలనా యూనిట్లు ఉన్నాయని, ఏటా కనీసం రెండు సంస్కరణలు తీసుకువస్తే ప్రజల జీవితాలలో సులభతరమవుతాయని చెప్పారు. ఎవరు కూడా తమకు రావాల్సింది దక్కలేదని ఫిర్యాదు చేయని పరిస్థితికి రావాలన్నారు. ప్రతి రంగంలో ఆధునికతను తీసుకురావాలని, తమ ప్రభుత్వం అందుకు కృషి చేస్తుందని చెప్పారు.
సంస్కరణలతో పేద, మధ్య తరగతి జీవితాలను మారుస్తా
భారత కార్పొరేట్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతలు సాధిస్తున్నాయని, దేశ ప్రతిష్టను పెంచుతున్నాయని మోదీ కొనియాడారు. కోటి మంది మహిళలు లక్‌పతి దీదీలుగా మారారని, ఇది తనకు గర్వించదగిన విషయమని అన్నారు.తమ ప్రభుతం దేశ మౌలిక సదుపాయాల ఆధునీకరణ చేస్తుందని, అందులో భాగంగా రహదారి, రైలు, పోర్టులు, పాఠశాలలు, ఆసుపతులను ఆధునీకరణ చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలను సంతుష్ఠ స్థాయిలో అమలు పరుస్తున్నామన్నారు. కులం, మతం అనే బేధం లేకుండా ప్రతి లాబార్థికి అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని 140 మంది భారతీయులు భుజం భుజం కలిపి కృతనిశ్చయంతో పని చేస్తే మన సంపద్వంతమైన, అభివృద్ధి దేశాన్ని సాధించగలమని చెప్పారు. యథాతథ స్థితి తో జీవించే మనఃస్థితిని తమ ప్రభుత్వం బద్ధలు కొట్టందని, మధ్యతరగతి, పేద ప్రజల జీవితాలను మార్చే లక్ష్యంతో భారీ సంస్కరణలను తీసుకువస్తున్నామన్నారు. సంస్కరణలు ఎలాంటి రాజకీయ అనివారత్యతో చేసినవి కావని, అవి అభివృద్ధికి బ్లూ ప్రింట్ లాంటివని, దేశం మొదలు అనే అంకితభావంతో అమలు చేస్తున్నవని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశానికి స్వర్ణ యుగమని, ప్రత్యేకించి భౌగోళిక పరిణామాల నేపథ్యంలో ఇలాంటి అవకాశాన్ని ప్రజలు కోల్పోవద్దన్నారు. సెమీ కండక్టర్‌ల ఉత్పత్తి రంగంలో గ్లోబల్ లీడర్ అయ్యేందుకు నిబద్ధతతో పని చేస్తున్నామని, దేశం తయరీరంగంలో పారిశ్రామిక హబ్‌గా మరబోతుందన్నారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ అనే తన లక్ష్యం ఎజెండా కోసం వివిధ రంగాల ప్రజలు సూచలను సలహాలు ఇచ్చారని, అందులో న్యాయవ్యవస్థ సంస్కరణలు సహా, వివిధరంగాలలో స్వశక్తితో ఎలా ఎదగాలనే అంశాలు కూడా ఉన్నాయని మోదీ తెలిపారు.