HomeNewsNationalభారత్‌ ఖాతాలో 6 పతకాలు

భారత్‌ ఖాతాలో 6 పతకాలు

త్రుటిలో చేజారినవి ఎన్నో

పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలకు ఆదివారంతో ఎ్‌ండ కార్డ్‌ పడనుంది. ఈ విశ్వ క్రీడల్లో భారత్‌ పోరాటం కూడా ముగిసింది. అంతర్జాతీయ పోటీల్లో భారత్‌ తరఫున 117 మంది అథ్లెట్లు ఆయా క్రీడాంశాల్లో బరిలో దిగి తమతమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అయితే ఈసారి పతకాల సంఖ్య గతంలో (2020లో 7 పతకాలు) కంటే పెరుగుతుందని భావించగా, భారత్‌ ఆరింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. అయితే పతకాల సంఖ్య అటుంచితే ఒలింపిక్స్‌లో మనోళ్లు పలు కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించారు. అవేంటంటే?
తూటా దింపిన మను
ఈ ఒలింపిక్స్‌లో షూటర్‌ మను బాకర్‌ రెండు కాంస్య పతకాలు సాధించింది. తొలుత షూటింగ్‌ 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో మను కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది. మిక్స్‌డ టీమ్‌ ఈవెంట్‌లోనూ సరబ్‌జ్యోత్‌తో కలిసి కాంస్యం సాధించిన మను స్వాత్రంత్య్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచింది.
హాకీలో సరికొత్త చరిత్ర
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు ఈ సారి కూడా కాంస్యం అందుకుంది. దీంతో విశ్వక్రీడల్లో హాకీలో భారత్‌ పతకాల సంఖ్య 13కి చేరింది. భారత జట్టు 52 ఏళ్ల తర్వాత వరుసగా కాంస్య పతకాలు సాధించడం ఇదే తొలిసారి. అంతకు ముందు 1968, 1972లో టీమ్‌ఇండియా మూడో స్థానంలో నిలిచింది.
నీరజ్‌ మళ్లీ
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ సారి రజతం దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన క్రీడాకారుడిగా నీరజ్‌ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా వరుసగా రెండు ఒలింపిక్‌ ఎడిషన్లలో పతకం సాధించిన మూడో భారత అథ్లెట్‌గా నిలిచాడు. అతని కంటే ముందు రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఘనత సాధించారు.
ఒకే ఈవెంట్‌లో మూడు పతకాలు
షూటర్‌ స్వప్నిల్‌ కుశాలె 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం అందుకున్నాడు. ఈ విభాగంలో భారత్‌ పతకం సాధించడం ఇదే తొలిసారి. దీంతో షూటింగ్‌లోనే భారత్‌ మూడు పతకాలు నెగ్గింది. ఒక ఒలింపిక్స్‌లో ఒకే క్రీడాంశంలో మూడు పతకాలు అందుకోవడం ఇదే తొలిసారి.
చివర్లో అమన్‌
ఈ ఒలింపిక్స్‌లో పురుషుల విభాగంలో పోటీ పడిన ఏకైక రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌. తిరుగులేని ఆటతో ఆశలు రేపినా అతడు సెమీస్‌లో భంగపడ్డాడు. చివరకు కాంస్య పతకం సాధించి రెజ్లింగ్‌లో ఈ సారి భారత్‌కు పతకాన్ని అందించాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం గెలిచిన అతి పిన్న వయస్సు (21 ఏళ్ల 24 రోజులు) భారత అథ్లెట్‌గా అతను చరిత్ర సృష్టించాడు. పీవీ సింధు (2016లో రజతం గెలిచినప్పుడు 21 ఏళ్ల 1 నెల 14 రోజులు) నెలకొల్పిన రికార్డును బ్రేక్‌ చేశాడు.
చేజారిన పతకాలు
* 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో అర్జున్‌ బబుతా కనీసం రజత పతకం సాధిస్తాడని అంతా భావించారు. కొద్దిలో నాలుగో స్థానానికి పడిపోయి కాంస్య పతకాన్ని మిస్‌ చేసుకున్నాడు.
* మను బాకర్‌ కూడా 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో నాలుగో ప్లేస్‌లో నిలిచి త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది.
* స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు మహేశ్వరి చౌహాన్‌, అనంత్‌జిత్‌ సింగ్‌ ఒక్క పాయింట్‌తో కాంస్య పతకానికి దూరమయ్యారు.
* ఆర్చరీలో మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో బొమ్మదేవర ధీరజ్‌, అంకిత నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.
* వెయిట్‌ లిప్టింగ్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి చాను ఈ సారి నిరాశపర్చింది. నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని చేజార్చుకుంది.
రెజ్లర్‌ వినేశ్‌కు పతకం ఖాయమైన తర్వాత ఆమెపై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమెను ఫైనల్‌ ఆడకుండా ఒలింపిక్స్‌ నిర్వాహకులు డిస్‌క్వాలిఫై చేశారు. లేకపోతే వినేశ్‌కు స్వర్ణం లేదా రజతం వచ్చేదే. అయితే ఆమె అనర్హతను సవాల్‌ చేస్తూ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఆఫ్‌ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. ఈ అప్పీల్‌పై తీర్పు రావాల్సి ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments