ప్రజాపక్షం/ ఖమ్మం అర్బన్ :
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అందుకు అవసరమైన నిధులను కేటాయించనున్న ట్లు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. సో మవారం భట్టివిక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శా ఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం ఎంపి రఘురాం రెడ్డిలతో కలిసి ఖమ్మం నగరంలోని ఖిల్లాను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తామన్నారు. తెలంగాణ పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించి ప్రపంచ పటంలో స్థానం కల్పిస్తామన్నారు. ఖమ్మంజిల్లాలో ఎకో టూ రిజం, టెంపుల్ టూరిజంకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భట్టి తెలిపారు. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు అ డవులు ఎకో టూరిజానికి అనువుగా ఉన్నాయని తెలిపారు. నేలకొండపల్లిలోని బౌద్ద స్తూపం మొదలు జమలాపురం మీదుగా భద్రాచలంలోని సీతారాముల ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. ఖమ్మంజిల్లా కేంద్రంలో ఖిల్లాకు రోప్ కావాలన్న డిమాండ్ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. ప్రచారం చేసేందుకు నేలకొండపల్లి బౌద్ద ఆరామల వద్దకు జపాన్ లాంటి దేశాల నుంచి టూరిస్టులను ఆహ్వానించాలన్నారు. హైదరాబాద్ సాప్ట్‌వేర్‌కు కేంద్రమని ఆఉద్యోగులు నెలకు ఒకసారి సెలవులు దొరికితే ప్రశాంతంగా గడిపేందుకు అడవుల్లో ట్రెక్కింగ్, వాకింగ్ ట్రాక్, రిసార్ట్, ఇంటర్నేట్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. వారానికి లేదా నెలకు ఒకసారి అటవిడుపు కోసం ఈ పర్యాటక ప్రాంతాలు ఉపయోగపడతాయన్నారు. ఆటవిడుపుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తే పని చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఖమ్మం ఖిల్లాకు వెయ్యేళ్ల చరిత్ర :
ఖమ్మం ఖిల్లాకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని మహా చారిత్రక కట్టడమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా తెలిపారు. ఆనాడు ఎలా నిర్మాణం చేశారు, ఎలా చేశారో చరిత్రను మననం చేసుకుని గుర్తుంచుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. నేలకొండపల్లిలో భక్తరామదాసు, బౌద్ద స్తూపాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశానన్నారు. రోప్‌వే వేస్తే తప్ప ఖిల్లాలో విహారానికి అవకాశం లేదన్నారు. భద్రాద్రి కి రైల్వే కనెక్టివిటి వస్తుందని, నేషనల్ హైవే, విమాన సేవలు రావాలన్నారు.
రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు:
మంత్రి జూపల్లి రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కుతుందని అంతర్జాతీయ పర్యాటకులను రప్పించడానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, టూరిజం అభివృద్ధి సంస్థ ఛైర్మన్ రమేష్‌రెడ్డి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమాజోహరా, అధికారులు, కార్పొరేటర్లు, టూరిజం అధికారులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కిన్నెరసానిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
కిన్నెరసానిని జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం కొత్తగూడెం ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు కిన్నెరసాని ప్రాజెక్టు, టూరిజం హోటల్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భద్రాచలం పుణ్యక్షేత్రం కిన్నెరసాని పర్యాటక కేంద్రానికి వచ్చే ప్రజలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో బడ్జెట్ హోటల్(హరిత) నిర్మించాలన్నదే లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగానే ఇల్లందు క్రాస్‌రోడ్డులో బడ్జెట్ హోటల్ సిద్దమవుతుందన్నారు. గతంలో తాను ఎంఎల్ఎగా ఉన్నప్పుడు పర్యాటకశాఖ మంత్రితో సంప్రదింపులు జరిపితే యుపిఏ ప్రభుత్వం హోటల్‌ను మంజూరు చేసిందన్నారు.