HomeNewsNationalకవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తీర్పు

కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తీర్పు

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఇడి దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరఫు న్యాయవాదులు రిజాయిండర్‌ దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత తరఫున మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్‌ ఇస్తే ఆధారాలు, సాక్షులను ప్రభావితం చేస్తారని ఇడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారు. ఆమె తన ఫోన్‌ డేటాను డిలీట్‌ చేశారు. దర్యాప్తులో
అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. పది ఫోన్లు ఇచ్చినా అన్నీ ఫార్మాట్‌ చేసే ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత 4 ఫోన్లను కవిత ఫార్మాట్‌ చేశారు. నిందితులు వందల డిజిటల్‌ డివైజ్‌లను ధ్వంసం చేశారు. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని బెదిరించారు. ఆమె చిన్న కుమారుడు ఒంటరి కాదు. సోదరుడు, కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారు. కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్‌ అడిగారు. కొన్ని పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి” అని ఇడి తెలిపింది. వాదనల అనంతరం రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తీర్పు వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఏప్రిల్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments