నలుగురు మృతి, 13మందికి తీవ్ర గాయాలు
ప్రజాపక్షం/సూర్యాపేట ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో 13 మందికి గాయాలైన ఘటన గురువారం అంజనపురి కాలనీ సమీపంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి విజయవాడవైపుకు వెళ్తున్న లారీని డ్రైవర్ రోడ్డుపై నిలిపాడు. అదే సమయంలో అర్వపల్లి నుండి సూర్యాపేట పట్టణానికి 14 మంది ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోని వస్తున్న డ్రైవర్ ఒక్కసారిగా ముందు ఆగి ఉన్న లారీని గ్రహించి దానిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా వెనుక నుండి అతి వేగంగా వస్తున్న ఎర్టిగా కారు ఆటోను ఢీకొట్టగా ముందు ఆగి ఉన్న లారీని ఆటో బలంగా ఢీకొంది. ఈ ఘటనలో అర్వపల్లి నుండి ఆటోలో వస్తున్న ప్రయాణికుల్లో సూర్యాపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చింతరెడ్డి సరితారెడ్డి (44), లక్ష్మీతండాకు చెందిన లూనావత్ రుక్కమ్మ(63), తుంగతుర్తి మండలం పసునూరు గ్రామానికి చెందిన 17 నెలల చిన్నారి వేదశ్విని అక్కడికక్కడే మృతి చెందారు. జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పసునూరుకు చెందిన మోక్షిత్ (7) మృతి చెందాడు. అర్వపల్లి మండలం కాసర్లపహడ్ గ్రామానికి చెందిన కంపసాటి మహేష్, అడివేంలకు చెందిన సాయిరెడ్డి, పిల్లలమర్రి గ్రామానికి చెందిన చెరుకుపల్లి సైదమ్మ, చింటు, శైలజ, విజయేందర్, తుంగతుర్తి మండలం పసునూరు గ్రామానికి చెందిన గొలుసుల సంధ్య, కొమ్ము సువర్ణ, చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన జీడిమెట్ల సైదులు, గుంపులకు చెందిన శివరాత్రి హైమావతి, శివరాత్రి రాములమ్మ, ఆత్మకూర్(ఎస్) మండలం ఏనుభాములకు చెందిన బొప్పాని పావని, లావణ్య తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరగగానే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని గాయపడ్డ వారిని జిల్లా జనరల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతి చెందిన వారిని మార్చురికి చేర్చారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమించడంతో పలువురుని మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలించారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, డిఎస్పి రవిలు సంఘటన స్థలానికి చేరుకోని ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES