అక్రమార్కులకు వరంగా బియ్యం స్మగ్లింగ్
కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన మీదుగా సరిహద్దు మహారాష్ట్రకు అక్రమ రవాణా
ప్రజాపక్షం/కాళేశ్వరం : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం పక్క దారి పట్టి ఆక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద అంతర్ రాష్ట్ర వంతెన మీదుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా నిత్యం జోరుగా సాగుతున్నది. మహారాష్ట్ర ప్రాంతాలలో బియ్యానికి డిమాండ్ ఏర్పడడంతో తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు వరంగా మారింది. దీనితో అక్రమార్కులు తెలంగాణ ప్రాంతాల నుండి సరిహద్దు మహారాష్ట్ర ప్రాంతాలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రేషన్ డీలర్ల నుంచి అడ్డగోలుగా అక్రమ దందా కొనసాగించిన రేషన్ స్మగ్లర్లు ప్రభుత్వం రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయడంతో ఇప్పుడు రేషన్ మాఫియా నయా రకం దందాకు తెర లేపింది. గ్రామీణ ప్రాంతాల్లో దళారి వ్యవస్థ ఏర్పాటు చేసి రేషన్ బియ్యాన్ని లబ్దిదారుల నుండి కారుచౌకగా కొనుగోలు చేసి రేషన్ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన ఆసరా చేసుకొని తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి నిత్యం వందలాది వాహనాల ద్వారా మహారాష్ట్ర ప్రాంతాలకు రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఉత్తర
తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా సరిహద్దు మహారాష్ట్ర లోని తాలూకా కేంద్రమైన సిరొంచా సమీపంలో రహస్య ప్రదేశంలో ఏర్పాటు చేసిన రేషన్ డెన్ కు తరలించి అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతాల్లో దళారులు రేషన్ బియ్యాన్ని కిలో రూ.8 నుండి 10 చొప్పున రేషన్ వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి రూ.18 చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. దళారుల నుండి చేతులు మారిన అక్రమ రేషన్ బియ్యాన్ని రేషన్ వీరప్పన్ మహారాష్ట్ర ప్రాంతాల్లో రూ.50 చొప్పున హోల్ సేల్ ధరలకు విక్రయించడం గమనార్హం. ఆహార భద్రత కార్డు కలిగిన పేద, మధ్యతరగతి వర్గాల కోసం ప్రభుత్వం ప్రతి నెల కుటుంబంలోని ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా అందిస్తుండగా దొడ్డు బియ్యం కారణంగా రేషన్ బియ్యం వినియోగించకపోవడంతో ఇదే అదునుగా భావించిన రేషన్ దళారులు వారి వద్ద నుండి తక్కువ ధరకు సేకరించి మహారాష్ట్రలోని సిరొంచా స్థావరానికి తరలించి జోరుగా అక్రమ రవాణా కొనసాగించడం నిత్యకృత్యంగా మారింది.
మామూళ్లు ఫుల్.! తనీఖీలు నిల్..!
తెలంగాణ సరిహద్దులు దాటించి భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ దందా కార్యకలాపాలు కొనసాగిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులపై జిల్లా, మండల స్థాయి అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించాల్సిన రెవెన్యూ సిబ్బంది అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. సంబంధిత అధికారులకు రేషన్ అక్రమార్కుల నుండి భారీగా ముడుపులు అందుతున్నాయనే బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నిరంతరం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టి అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం వాటిపై కన్నెత్తి చూడటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెక్ పోస్ట్ సిబ్బంది కనుసన్నల్లో రేషన్ బియ్యం అక్రమ దందా సాఫీగా సాగుతున్నట్లు ఆరోపిస్తున్నారు. కాగా అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ముందుగానే మాఫియా ఫోన్ ద్వారా సమాచారం అందించి రేషన్ అక్రమ దందా రాత్రి, పగలు అనే తేడా లేకుండా యదేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో చెక్ పోస్ట్ సిబ్బందికి పెద్ద ఎత్తున మామూళ్లు అందించి రేషన్ బియ్యం అక్రమ దందాను స్మగ్లింగ్ మాఫియా అడ్డు అదుపూ లేకుండా ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాగా గ్రామ స్థాయి అధికారులు నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు రేషన్ మాఫియా మామూళ్ల పంపకాలు ఎరగా వేసి రేషన్ బియ్యం అక్రమ దందా నిరాటంకంగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం వద్ద శుక్రవారం విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ ఆగడాలపై దాడులు జరిపి నాలుగు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 700 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంతో రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పరుగెత్తడం కొసమెరుపు.
సరిహద్దులు దాటుతున్న ‘రేషన్’
RELATED ARTICLES