HomeNewsNationalడిమాండ్లు నెరవేరే వరకూ ఆందోళన కొనసాగిస్తాం

డిమాండ్లు నెరవేరే వరకూ ఆందోళన కొనసాగిస్తాం

రైతు నేత సర్వన్‌సింగ్‌ పంధేర్‌ స్పష్టీకరణ
చండీగఢ్‌ : పంజాబ్‌, హర్యానా రెండు సరిహద్దు పాయింట్లలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతు నేత సర్వన్‌సింగ్‌ పంధేర్‌ స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ ముక్తి మోర్చా ‘ఢిల్లీ చలో’ ర్యాలీ నిర్వహించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రైతులను ఢిల్లీ వెళ్లనీయకుండా ఫిబ్రవరి 13న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అప్పటి నుంచి శంభు, ఖనౌరి సరిహద్దు పాయింట్లలో పంజాబ్‌ రైతులు శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేరేంత వరకు శాంతియుతంగా కొనసాగిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటికీ నిరసనకు కోడ్‌తో సంబంధం లేదన్నారు. రైతులు, రైతు కూలీల ఎజెండాను ప్రజల ముందు ఉంచుతున్నామని చెప్పారు. కాగా, శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద హర్యానాకు చెందిన భద్రతా సిబ్బంది భారీ బారికేడింగ్‌తో మోహరించారు. ట్రాక్టర్‌ ట్రాలీలతో దేశ రాజధాని వైపు వెళ్లేందుకు బిజెపి ప్రభుత్వం అనుమతించకపోవడంపైపంధేర్‌ మండిపడ్డారు. మా డిమాండ్లను అమలు చేయించుకునేందుకు ఢిల్లీ వెళ్లడానికి మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు. అమృత్‌సర్‌, జండియాలా, బియాస్‌ నుండి అనేక మంది రైతులు, వ్యవసాయ కూలీలు సరిహద్దు పాయింట్లకు బయలుదేరారని పంధేర్‌ చెప్పారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో రైతులు తమ ఇళ్ల నుంచి ఫ్యాన్లు, ఇతర వస్తువులను సరిహద్దు పాయింట్లకు తీసుకొచ్చారన్నారు. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 13న రైతులు తమ ర్యాలీని ప్రారంభించారు. కానీ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి, ఇది హర్యానా, -పంజాబ్‌ సరిహద్దులోని శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద ఘర్షణలకు దారితీసింది. ఫిబ్రవరి 21న పంజాబ్‌-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ సరిహద్దు పాయింట్‌ వద్ద జరిగిన ఘర్షణల్లో భటిండాకు చెందిన శుభకరన్‌ సింగ్‌ (21) అనే రైతు మరణించగా, 12 మంది పోలీసులు గాయపడ్డారు. నిరసన తెలుపుతున్న కొందరు రైతులు బారికేడ్ల వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, రాష్ట్ర సరిహద్దు దాటి ఢిల్లీకి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఈ ఘటన జరిగింది.
సేవ్‌ డెమోక్రసీ డేగా.. భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ అవమరవీరుల దినోత్సవం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : మార్చి 23న భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల అమరవీరుల దినోత్సవాన్ని సేవ్‌ డెమోక్రసీ డేగా పాటించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర పాలకులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, అమరవీరులకు నివాళులు అర్పించడం, సభలు, సమావేశాల నిర్వహణతో పాటు నిరసన కార్యక్రమాలను జరపాలని ఎస్‌కెఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కన్వీనర్లు పశ్య పద్మ, టి. సాగర్‌, వి. ప్రభాకర్‌, మండల వెంకన్న, మామిడాల భిక్షపతి, కొండల్‌, పెద్దారపు రమేష్‌, జక్కుల వెంకటయ్య, ప్రమీల, నాగిరెడ్డి, బాల్‌ మల్లేశ్‌, ఆర్‌. వెంకట్రాములు, రామకృష్ణ, గోనె కుమారస్వామి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక బిజెపిని ఓడించేందుకు ప్రతిజ్ఞ చేయించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎస్‌కెఎంతో పాటు, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా, వృత్తి, ఆదివాసీ, గిరిజన, సామాజిక, మైనారిటీ సంఘాలు భాగస్వామ్యులు కావాలని వారు కోరారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments