బిజెపి బిఆర్ఎస్ వ్యవహారం
ఇన్నాళ్లు కలిసి పనిచేసిన కేడీమోడీలు ఇప్పుడు వేర్వేరంటున్నారు
కాంగ్రెస్ ‘జనజాతర’ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలవాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సవాల్
ప్రజాపక్షం/ రంగారెడ్డి ప్రతినిధి కెసిఆర్ కుటుంబానికి పెద్ద దిక్కు బిజెపి నేతృత్వంలోని భారత ప్రధాని నరేంద్ర మోడీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌సి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఇన్నాళ్లు కలిసి పనిచేసిన (కెడీమోడీ) గత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రధాని నరేంద్ర మోడీలు ఇప్పుడు ఇద్దరూ తాము వేర్వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని తన కొడుకును చేయాలని అప్పటి బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని వేడుకున్నట్లు స్వయాన మోడీ తెలిపిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. చీకట్లో కలిసి
ఉండి, పగలు కొట్లాట పెట్టుకునే విధంగా వీళ్ళ వ్యవహారం ఉందని ఆయన ఆరోపించారు. బిజెపి నాయకులు చెప్తున్న గుజరాత్ మోడల్ పాలన అంటే పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడం, తగలబెట్టడం లాంటిదేనా అని ఆయన ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని హామీలు ఇచ్చిన నరేంద్ర మోడీ ఆ లెక్కన ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చూపించాలని అన్నారు. మోడీని మళ్లీ ప్రధానిని చేయాలని చెప్పుకుంటున్న బిజెపి నేతలు ఇప్పటివరకు ప్రధానిగా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని, పేదలకు ఇల్లు కట్టి ఇవ్వకుండా, ఉద్యోగ నియామకాలు చేయకుండా, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేయడమే నా గుజరాత్ మోడల్ అంటే అని సిఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు.
మగాడివైతే ఒక్క సీటు గెలిపించు : – కెటిఆర్ కు సిఎం రేవంత్ రెడ్డి సవాల్
మగాడివైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిపించి చూపించాలి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నువ్వు వస్తావా నీ అయ్య వస్తాడు రండి.. మేం అల్లాటప్ప కాలం కాదు. నేనేమీ అయ్య పేరు చెప్పి కుర్చీలో కూర్చోలేదు. ప్రజల కోసం అక్రమ కేసులు ఎదుర్కొని, నాటు దెబ్బలు తిని చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చాను. నిన్ను, మీ అయ్యను, నీ బావను బొందపెట్టి ప్రజలు మమ్మల్ని కుర్చీలో కూర్చొబెట్టారని చెప్పారు. ఈ కుర్చీ మా కార్యకర్తల పోరాటంతో వచ్చింది, సోనియమ్మ ఇచ్చిన మాట శిలాశాసనం. ఎన్నికల్లో ఆమె ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత మాది. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిపించుకోవాలని కోరారు.
ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తాం నేను మీలో ఒకడిని, నాతోపాటు, మంత్రులు, ఎంఎల్ఎ రోజుకు 18 గంటలు పనిచేస్తూన్నారని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ ఇందిరమ్మ కమిటీల ద్వారా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం, తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి పని చేసిన కార్యకర్తలను,నాయకులను, వార్డ్ మెంబర్లు మొదలుకొని, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ల వరకు గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
మహిళలను కోటీశ్వరులు చేస్తాం
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇబ్బందులకు గురిచేసిందని తమ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగా పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలను అందిస్తూ మహిళలను సాధికారమే కాదు కోటీశ్వరులు చేసే బాధ్యత తమపై ఉందన్నారు.
మెగా డి.ఎస్.సి ప్రకటిస్తాం
నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అవేవి నెరవేర్చకుండా అనేక ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 వేల మందికి ఎల్బీ స్టేడియంలో చిన్న నియామక పత్రాలు చూసి ఓర్వలేక టిఆర్ఎస్ నాయకులు శాపనార్థాలు పెడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. నిరుపేదలు తమ బిడ్డల ఉద్యోగులుగా చూడాలని పదేళ్లుగా వేల రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే ఉద్యోగ నియామకాలు చేయక పోవడంతో పెండ్లిలు గాక, రోడ్ల మీద తిరుగుతూ తీవ్ర ఇబ్బందులకు అయ్యారని తెలిపారు. అదే కెసిఆర్ కుటుంబంలో అందరికీ రాజకీయంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారని, కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానవ రూపంలో ఉన్న మృగం అని సిఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. అందుకే త్వరలో మెగా డి ఎస్ సి ని ప్రకటించి గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా పారదర్శకమైన నియామకాల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
చీకట్లో మిత్రుత్వం… పగలు కొట్లాట
RELATED ARTICLES